
సాక్షి, గన్నవరం : ‘ఆపరేషన్ గరుడ’ పేరుతో ఇటీవల హడావుడి చేసిన సినీనటుడు శివాజీ సోమవారం కృష్ణా జిల్లా గన్నవరం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. మండల పరిధిలోని అపార్టుమెంట్‌లో ప్లాట్ల కొనుగోలు నిమిత్తం వచ్చిన ఆయన మీడియా కంటపడకుండా ఉండేందుకు ప్రయత్నించారు. అక్కడికి వచ్చిన మీడియా ప్రతినిధులపై శివాజీ రుసరుసలాడారు. ఫొటోలు, వీడియోలు తీస్తే మీ సంగతి చూస్తానంటూ బెదిరింపులకు దిగారు. ‘రాస్తే రాసుకోండి.. మహా అయితే చంద్రబాబు ఇచ్చిన డబ్బులతో శివాజీ ఆస్తులు కొంటున్నాడని రాస్తారు... అంతేగా..’ అంటూ చిరుబుర్రులాడారు.
రిజిస్ట్రేషన్ పూర్తికాగానే పరుగు పరుగున కారు ఎక్కేసి వెళ్లిపోయారు. గన్నవరం మండలం చిన్నఆవుటపల్లి పరిధిలో ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు చెందిన అపార్టుమెంట్‌లో రెండు ప్లాట్లు రిజిస్ట్రేషన్ నిమిత్తం శివాజీ సాయంత్రం సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి వచ్చారు. శివాజీ నేరుగా సబ్‌రిజిస్ట్రార్ చాంబర్‌లోకి వెళ్లి కూర్చోగా ఆయన వెంట వచ్చిన వ్యక్తులు రిజిస్ట్రేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. అక్కడకు చేరుకున్న మీడియా ప్రతినిధులను ఫొటోలు తీయకుండా శివాజీ వ్యక్తిగత సిబ్బంది, అనుచరులు అడ్డుకున్నారు. దౌర్జన్యంగా ఫోన్‌ల నుంచి ఫొటోలను తొలగించారు.
Comments
Please login to add a commentAdd a comment