‘ప్రతిపక్ష నేతపై జరిగిన హత్యాప్రయత్నంపైన ప్రత్యేక దర్యాప్తు అనవసరమ’ని చంద్రబాబు ప్రకటించడం దాని వెనుక దాగిన అసలు రహస్యాన్ని దాచడానికి చేస్తున్న అజ్ఞాత వ్యూహంగా భావించక తప్పదు. వివిధ భంగిమలలో, పలురకాల చూచిరాతలతో పది పదకొండు పేజీలతో లేఖ రాసి, దాన్ని నిందితుని జేబులో కుక్కి తప్పుకున్న వారెవరో అసలు ‘గండికోట’ రహస్యం. దాన్ని ఛేదించి వాస్తవాలు రాబట్టేదాకా చంద్రబాబు ఆనందంగా పదే పదే ఉచ్చరిస్తున్న ఆ ‘గరుడపక్షి’ ఎవడో, అతని ఆ మిత్రుడు సినీ పరిశ్రమ తోసిరాజన్న ఛత్రపతికాని ఆ ముసుగు వీరుడు ‘శివాజీ’ ఎవరో అతనితో ఉన్న బాదరాయణ సంబంధం లోతుపాతులన్నీ బయటికి రావాల్సిందే.
ఏదేశ చరిత్ర చూసినా సమస్తమూ నరజాతి చరిత్రగా పైకి కనిపించినా పరస్పర పీడనా దోసిళ్లతోనే, అధికార దాహంతో ప్రతి పక్షాన్ని చంపుకోవడంతోనే నిండిఉందని ఒక్క శ్రీశ్రీ ‘దేశచరిత్రలు’లో కాదు, పురాణ సాహిత్యం పేర్కొన్న క్రీస్తుపూర్వపు మగధ రాజ్య చరిత్రలో ఒక ఆసక్తికర ఘట్టం కూడా తిరుగులేని సాక్ష్యం పలుకుతోంది. బహుశా ఆ చరిత్ర మరొకసారి పునరావృత్తమవుతోందని ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ఆధ్వర్యంలో సాగు తున్న భ్రష్టుపట్టిన టీడీపీ పాలన నిరూపిస్తోంది.
భారత రాజ్యాంగ నిర్మాతలలో అగ్రగణ్యుడైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 75 ఏళ్ల నాడే ఎందుకన్నాడో గానీ మన దేశంలో కొన్ని రాజకీయ పక్షాలకు దేశంలో అసంఖ్యాకులైన దళిత, మహాజనులు, మైనారిటీల జీవితాలే బహు చులకనగా కనిపిస్తోందన్నారు. కొన్ని నెలల క్రితం ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, దళితుడిగా పుట్టాలని ఎవరూ కోరుకోరని వ్యంగ్యంగా మాట్లాడుతూ దళితుల్ని తూలనాడారు. అందుకు దళిత సంఘాలన్నీ ఆయన్ని దుమ్మెత్తిపోయవలసిన పరిస్థితి వచ్చిందనీ రాష్ట్ర ప్రజలకు తెలుసు.
ఈమాట ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే చరిత్ర ఎలా పునరావృత్తమవుతుందో మరోసారి చెప్పడానికే. క్రీస్తుపూర్వం మగధ సామ్రాజ్యానికి నంది వర్ధనుడు, ఆ తర్వాత మహానందనుడు అనే చక్రవర్తులు ఇద్దరు రాజులుగా ఉండేవారు. కానీ ఈ ఇరువురు శూద్రులు కావడం వల్ల శూద్రులైన నంద వంశం పొడగిట్టని మౌర్య చక్రవర్తులకు కొమ్ముకాసిన కుటిల నీతిపరుడు, మౌర్యుల పురోహితుడైన చాణక్యుడికి కన్నెర్రగా ఉండి శూద్రజాతికి చెందిన నందవశం నిర్మూలనే కంకణం కట్టుకున్నాడు. సరుకులేని అభినవ చాణక్యుడిగా చంద్రబాబు కూడా ఒక దళితుడినే వినియోగించి తన కుట్రలకు ఆసరాగా పావుచెక్కలా వాడుకుంటున్నాడని లోకం కోడై కూస్తోంది.
శతాబ్దాలనాటి చాణక్యనీతికి, ఈనాటి అపర చాణక్యుని నీతికి మధ్య తేడా కన్నా సామీప్యతే ఎక్కువని బోధపడుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఏకైక పెద్ద ప్రతిపక్ష నాయకుడిగా అనుపమానమైన ప్రజాదరణ మధ్య ప్రజాసంకల్ప పాదయాత్ర ద్వారా దూసుకువెళుతూ ఆ వేల కిలోమీటర్ల యాత్ర ఇక కొద్ది రోజుల్లోనే విజయవంతంగా ముగుస్తున్న సందర్భంలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ జీవనాడిగా, రాష్ట్ర భవిష్యత్ దీపశిఖగా ఉన్న చిరంజీవి జగన్‌మోహన్ రెడ్డిపై జరిగిన (లేదా జరిపించిన) హత్యాప్రయత్నం, ‘అభిమాని’ ముసుగులో విశాఖ విమానాశ్రయంలో చొప్పించిన ఆధునిక ‘జుడాస్’ చర్య!
ఈ అమానుష రాజకీయ కుట్ర బహిర్గతం కాకుండా పోలీస్ యంత్రాంగం ఒక స్థాయిలో జరిపి, సమర్పించిన రిమాండ్ రిపోర్టులో మాత్రం జగన్‌పై జరిగింది హత్యాప్రయత్నమేనని, ఆయన్ని అంతం చేయడానికే కత్తితో ఆయనపై దాడి జరిగిందని స్పష్టం చేశారు. కానీ ఆ రిమాండ్ రిపోర్టులో రాజకీయ కుట్రదారులెవరో మాత్రం ఎలాంటి వివరణ లేకపోవడం, ‘‘కొత్తదాసరికి పంగనామాలెక్కువ’’ అన్నట్లుగా టీడీపీకి అనుకూలంగా పొత్తుల కోసం ‘డూడూబసవన్నలు’గా మారిన కాంగ్రెస్ సహా ‘ఐక్య సంఘటన’ దుస్తులు ధరించిన కొన్ని ప్రతిపక్షాల నాయకులు సహా, మినహాయింపులు లేకుండా ఈ ఘాతుకాన్ని, కుట్రను ఖండించారు.
ఆ నాయకులు జగన్‌ని పరామర్శించారు. ఒకనాడు అలిపిరి సలపరానికి గురైన చంద్రన్నను ఆనాటి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి పరామర్శించి, త్వరలో కోలుకోవాలని కోరుకున్నారు కూడా. కానీ నేడు పాలకుడిగా ఉన్న చంద్రబాబు కానీ, బాధ్య తగల ‘దేశం’ నాయకులు కానీ ఏకైక పెద్ద ప్రతి పక్షంగా ఉన్న పార్టీ నాయకుడు జగన్‌ని కనీసం పరామర్శించే సంస్కారాన్ని కూడా పాటించలేకపోయారు.
పైగా జగన్‌ని వాడు ఇంటికి పోయాడుగా అని కనీస వాక్శుద్ధి కూడా లేకుండా ముఖ్యమంత్రి వెటకరించడం హేయం. పోలీసుల రిమాండ్ రిపోర్టులో.. ఇది జగన్‌ని అంతమొందించడానికే జరిగిన హత్యాప్రయత్నమేనని స్పష్టం చేస్తున్నా, ఆ ప్రయ త్నాన్ని ఓ ‘చిన్నగాయం’గా కావాలని ‘చీరుకున్న’ గాయం గానూ, తలచుకుంటే టీడీపీ కార్యకర్తలూ, టీడీపీ వ్యక్తులూ జగన్‌ను కైమా, కైమా చేసేవాళ్లని’ మరికొందరు ‘దేశం’ నాయకులు, మంత్రులూ అమానుషంగా ప్రకటనలు చేయడం దుస్సహం.
పైగా ‘ప్రతిపక్ష నేతపై జరిగిన హత్యాప్ర యత్నం పైన ప్రత్యేక దర్యాప్తు అనవసరమ’ని చంద్ర బాబు ప్రకటించడం హత్యాప్రయత్నం వెనుక దాగిన అసలు రహస్యాన్ని దాచడానికి చేస్తున్న అజ్ఞాత వ్యూహంగా భావించక తప్పదు. వివిధ భంగిమలలో, పలురకాల చూచిరాతలతో పది పదకొండు పేజీలతో లేఖ రాసి, దాన్ని నిందితుని జేబులో కుక్కి తప్పుకున్న వారెవరన్నదే అసలు ‘గండికోట’ రహస్యం. దాన్ని ఛేదించి వాస్తవాలు రాబట్టేదాకా చంద్రబాబు ఆనందంగా పదే పదే ఉచ్చరిస్తున్న ఆ ‘గరుడపక్షి’ ఎవడో, సినీ పరిశ్రమ తోసిరాజన్న ఛత్రపతికాని ఆ ముసుగు వీరుడు ‘శివాజీ’ ఎవరో అతనితో ఉన్న బాదరాయణ సంబంధం లోతుపాతులన్నీ బయటికి రావాల్సిందే.
అలిపిరి దుర్ఘటనను ఊహించి, ముందు హెచ్చరిక చేయలేని ఆ ‘గండ భేరుండ పక్షి’ శివాజీకి ఆ శక్తిని కల్పించింది, నీడ నిచ్చిందీ ఎవరో తేలాలి. అసలా ‘పక్షి’ కనపడ్డేం? కొన్ని మాసాలనాడే ‘బాబు ప్రభుత్వాన్ని కూల దోసేందుకు కుట్రలు జరుగుతున్నాయని అదే సమయంలో జగన్‌పై హత్యాప్రయత్నం జరుగుతుందన్న ఆ శివాజీ మరోవైపున ఆంధ్రప్రదేశ్‌లో అలజడులు రెచ్చగొట్టేందుకు బీజేపీ నేతలు ‘ఆపరేషన్ గరుడ’ చేపట్టి, ‘ఐటీ’ దాడులకు, హత్యలకు తెరలేపనున్నారని వీడియోల్లో కనపడి అకస్మాత్తుగా తప్పుకుపోయిన ఆ ‘అపర శివాజీ’ బాబు చేయి, బీజేపీ నేతల చేతులకు దొరక్కుండా ఎక్కడికిపోయి తలదాచుకు న్నాడు?! ‘ఆపరేషన్ గరుడ’ పదాన్ని శివాజీ ఆశీస్సులతోనే టీడీపీ మీడియా గుంపు ప్రచారంలో పెట్టిందా? పదే పదే చంద్రన్న వర్ణిస్తూ వల్లిస్తున్న శివాజీ ‘గరుడ’ రూపంలో ‘గండిపేట’ కార్యాలయంలో తలదాచుకుంటున్నాడా, జూబ్లీహిల్స్‌లోని నేలమాళిగలోనా? హాస్యనటుడిగా ఉన్నట్టుండి రహస్య జీవితంలోకి జారుకున్న ఆ గరుడపక్షిని పట్టుకోవడం మాల్యా, చౌక్సీ, నీరద్‌మోదీల ఉనికికి మించినంత కష్టమా?
తెలుగుదేశం పార్టీ నిర్మాత ఎన్టీఆర్‌ను క్రమంగా పాలకునిగా తప్పించి, ఆ స్థానాన్ని ఆక్రమిం చేందుకు అల్లుడి హోదాలోనే, పార్టీ కార్యదర్శి రూపంలోనే సాగించిన నాటకాలను తెలుగు ప్రజలు కళ్లారా చూశారు. అందులో తొలి నాటకం మల్లెల బాజ్జీ ద్వారా పూర్తి చేయగా, మలి నాటకంలో ‘ఎన్‌కౌంటర్’ పత్రిక సంపాదకుడు దశరథరామ్ హత్యతో ముగిసింది. ఆ తరువాత చిన్నవీ, పెద్దవీ రకరకాల అంకాలుగా ముగిశాయి, కొత్త అంకాలకు తెర లేపడానికి ముందు సీఎంగా ఎన్టీఆర్‌పై ‘దేశం’లోని తన తైనాతీలను బాబు ఉసిగొల్పి ఎన్టీఆర్‌పైన చెప్పులు వేయించాడు. ఫలితంగా ‘దేశం’ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ మనస్తాపంతో తనువు చాలించాల్సి వచ్చింది.
తన ‘వెన్నుపోటు’ చరిత్రను అనుక్షణం గమనిస్తున్న దేశ ప్రతిపక్షాలు నేడు ఆంధ్రప్రదేశ్‌లో తన చేష్టల వల్ల, ఇన్నాళ్లుగా అనుసరిస్తున్న ‘ఉల్టా పల్టా’ రాజ కీయాలవల్ల తన పట్ల ఆమోదం చూపవని బాబుకి తెలుసు. తాజాగా, జగన్‌పై జరిగిన హత్యా ప్రయత్నంతో ఆ ‘అపవాదు; తన పార్టీకి రాకుండా చేసుకునేందుకే బాబు ఢిల్లీ యాత్ర తలపెట్టాడు. ఆంధ్ర ప్రదేశ్‌లోని తాజా పరిణామాల దృష్ట్యా ప్రతి పక్షాల నాయకులు బాబుతో శాలువాలు కప్పించుకోవడం మినహా, తనను మించిన కాంగ్రెస్‌తోనే బాబు చేతులు కలిపి ఐక్యసంఘటన ఏర్పాటుకు ప్రయత్నించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మాట నిలకడ లేని బాబుతో చేతులు కలపడం ఏ రోజుకైనా ప్రమాదమేనన్న అనుభవం కాంగ్రెస్‌తోపాటు మరికొన్ని ఇతర ప్రతిపక్షాలకూ లేకపోలేదు. జాతీయ స్థాయిలో తన ఐక్యసంఘటన ఏర్పాటుయత్నం విఫలం కాక తప్పదని, తన ఇంట్లో కాలుతున్న చేతుల్ని కాపాడుకునేందుకు మాత్రమే బాబు చేసే ప్రయత్నమని జాతీయ ప్రతిపక్షాలకు తెలుసు. ఒకసారి జాతీయ ఐక్యసంఘటన ప్రయత్నాల్నీ, ప్రభుత్వాల్నీ ముంచేసిన బాబును మరోసారి ఆదరిస్తాయనుకోవటం భ్రమ.
కాబట్టి, ఈ దుస్థితిలో దేశాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల్ని రక్షించగల్గింది నిలువెల్లా ‘మశూచి’ మచ్చలతో నిండిన తె.దే.పా.ను మినహాయించి బుద్ధి, జ్ఞానంగల ప్రతిపక్షాల (వామపక్షాలు సహా)తో ఐక్యసంఘటన ముందుకు సాగడమే. అందుకు ముందుగా నెరవేర్చుకోదగిన షరతు– మానవ ద్వేషులైన ‘శాడిస్టు’లు నాయక స్థానంలో ఉన్న పార్టీలను, ఆ శాడిస్టు రాజకీయవేత్తలు అంట కాగుతున్న శివాజీ లాంటి అజ్ఞాత గరుడపక్షులనూ వదిలించుకోవడమూ! ఇంతకీ ప్రస్తుతం దేశ విపక్షాలపై ఢిల్లీలో వాలిన బాబుగారి శివాజీ గరుడపక్షి ప్రస్తుత ఉనికి ఎక్కడ? ప్రస్తుతం ఆ గరుడ శివాజీతోనే అమెరికా చేరిందట, అంటే శివాజీ ఒక మాల్యాలా, ఒక నీరద్‌మోదీలా, ఒక చౌక్సీలా దేశ పాలకుల కళ్లుకప్పి అమెరికాకు ఉడాయించాడు. సీఎం రమేష్ సింగపూర్‌కు వెళ్లినట్టు వెళ్లి ఒమన్‌కు జారుకున్నాడు. విద్యుచ్చక్తి శాఖలో ఓ చిన్న ఉద్యోగి హోదాలో ఉండి కోటికి పడగలెత్తిన సానా సతీష్ (తూర్పుగోదావరి) సీబీఐ కేసులో ఇరుక్కుని అడ్రస్ లేకుండా ఎటో పోయాడు. మరి ఇక చంద్రబాబు ప్రయాణించే మార్గం ఎన్ని తీరాలకో చూడాలి. అధి కారాంతమందు చూడవలె నా అయ్య సౌభా గ్యముల్!!
- ఏబీకే ప్రసాద్
సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in
Comments
Please login to add a commentAdd a comment