లగడపాటి అండ్ కో సర్వేల గారడీ
- ఏలూరు కేంద్రంగా బెట్టింగ్ శిబిరం!
- వందల కోట్లు కొల్లగొట్టేందుకు వ్యూహం
- టీడీపీదే గెలుపంటూ బోగస్ ప్రచారం
ఆయన పేరు లగడపాటి రాజగోపాల్. బెట్టింగ్‌ల విషయంలో ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరొందారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో రాజకీయ సన్యాసం స్వీకరించి తెరమరుగయ్యారు. సార్వత్రిక సమరం అనంతరం సర్వేల పేరుతో హల్‌చల్ చేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తోందని తొలుత చెప్పిన లగడపాటి తర్వాత తూచ్ అన్నారు. తాజాగా టీడీపీకి చాన్స్ ఉందంటూ కొత్త భాష్యం చెబుతున్నారు. ఊసరవెల్లి కంటే స్పీడ్‌గా లగడపాటి రంగులు మార్చడం వెనుక బడా బెట్టింగ్ స్కాం ఉన్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కేంద్రంగా లగడపాటి బెట్టింగ్ దందాకు తెరలేపారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
సాక్షి ప్రతినిధి, విజయవాడ : విజయవాడ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ప్రజలతో మైండ్‌గేమ్ ఆడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాల సర్వేల పేరుతో గందరగోళం సృష్టిస్తున్నారు. లడగపాటి అండ్ కో భారీ బెట్టింగ్ స్కీ(స్కా)ం కోసమే ఇంత రాద్ధాంతం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో సర్వేల పేరుతో వందల కోట్లు దండుకున్న లగడపాటి తాజాగా అదే మంత్రాంగాన్ని నడుపుతున్నట్లు భోగట్టా. గతంలో సర్వేల రాయుడిగా జనంలో కొంత ఇమేజ్ సంపాదించుకున్న రాజగోపాల్ దాన్ని అడ్డుపెట్టుకుని కోట్లు కొల్లగొట్టేందుకు వ్యూహం రూపొందించారు. ఏలూరు కేంద్రంగా భారీ బెట్టింగ్ రాకెట్ నడుపుతున్నారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి.
స్వాహాకు వ్యూహం...
ఏలూరు అడ్డాగా నడిచే బెట్టింగ్ శిబిరానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం అన్నీ లగడపాటేనని తెలుస్తోంది. తెరపైకి మాత్రం బుకీలు కనిపిస్తారు. సర్వేలు తారుమారు చేయడం ద్వారా పందేల బరిని సిద్ధం చేస్తారు. ఆనక ఒకటికి రెండిస్తామని పందేలరాయుళ్లను రెచ్చగొడతారు. ఎన్నికల్లో ఓటమి పాలయ్యే పార్టీకి అనుకూలంగా సర్వే నివేదికలు సృష్టిస్తారు. విజయం సాధించే పార్టీ తరఫున లగడపాటి వర్గం పందెం వేస్తోంది. వందల కోట్లు స్వాహా చేస్తోంది. ఇది లగడపాటి మార్క్ సర్వేల వెనుక దాగున్న లోగుట్టు. ఇవేమీ తెలియని అమాయక జనం పందేల పేరుతో సర్వం పోగొట్టుకుంటున్నారు.
అంతా బోగస్...
సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం స్పష్టంగా కనిపించింది. అన్ని వర్గాల ప్రజలు ఫ్యాన్ గాలిని కోరుకున్నారు. విజయవాడలో లగడపాటి ఓటు వేసే సమయంలో కొన్ని టీవీ చానళ్లు ఆయన్ని ఇంటర్వ్యూ చేశాయి. అప్పటికి 50 శాతం పోలింగ్ పూర్తయింది. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తోందని విలేకరులు ప్రశ్నించగా ఇప్పుడే చెప్పలేనని లగడపాటి పేర్కొన్నారు. రాష్ట్రంలో టీడీపీకి అధికారం వచ్చే అవకాశం ఉందని గురువారం లగడపాటి సర్వే విడుదల చేశారు. బెట్టింగ్ వ్యాపారంలో ఆరితేరిన లగడపాటికి అంతర్జాతీయ బుకీలతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. బోగస్ సర్వేతో లబ్ధిపొందాలనే ఉద్దేశంతో లగడపాటి గందరగోళానికి తెరతీశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రాష్ట్ర విభజన సర్వే ఏమైంది...
రాష్ట్రం ముమ్మాటికీ విడిపోదు. నా వద్ద సర్వేలు ఉన్నాయి అని నానా హడావిడి చేసిన లగడపాటి సర్వే ఏమైందని పలువురు ప్రజలు బాహాటంగా విమర్శిస్తున్నారు. తప్పుడు సర్వేలు సృష్టించడం, తద్వారా రాజకీయ, ఆర్థిక లబ్ధి పొందడం లగడపాటికి వెన్నతో పెట్టిన విద్య అని గుసగుసలు వినిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన అనంతరం రాజకీయ సన్యాసం తీసుకొని తెరమరుగైన రాజగోపాల్ సార్వత్రిక ఎన్నికల ఫలితాల అనంతరం సర్కస్‌లో బఫూన్‌లా మారడం ఖాయమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
లీకేజ్ రాయుడు...
2009 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధిస్తోందని లగడపాటి తన అనుచరగణం ద్వారా లీకులిప్పించారు. అప్పటివరకు సందిగ్ధంలో ఉన్న తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయి పందేలు కాశారు.
కాంగ్రెస్ గెలుస్తోందని లగడపాటి అనధికారికంగా సర్వే విడుదల చేశారు. దీంతో పందేలు రెండింతలయ్యాయి.
నగర ంలోని ఒక సహకార బ్యాంక్‌లో పందెం సొమ్ము డిపాజిట్ చేసే విధంగా పందేల ఒప్పందం కుదిరింది.
ఈ ఎన్నికల్లో లగడపాటి సుమారు రూ.100 కోట్లు పందెం గెలిచినట్లు అప్పట్లో జోరుగా ప్రచారం సాగింది.
అంతర్జాతీయ బుకీలతో లగడపాటికి సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
రాజగోపాల్ సర్వేల కోసం లక్షలు ఖర్చు చేసి బెట్టింగ్‌ల రూపంలో కోట్లు దండుకుంటారని భోగట్టా.