మీకు వైఎస్సార్‌సీపీ అంటే ఇష్టమా? లేక టీడీపీనా? | Votes Removal Gangs in the State | Sakshi
Sakshi News home page

ఓటుకు ‘సర్వే’ స్పాట్‌!

Published Sun, Nov 18 2018 5:11 AM | Last Updated on Sun, Nov 18 2018 10:00 AM

Votes Removal Gangs in the State - Sakshi

సాక్షి, అమరావతి: ‘‘మీకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అంటే ఇష్టమా? తెలుగుదేశం పార్టీ అంటే ఇష్టమా? వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అభిమానిస్తారా? చంద్రబాబును అభిమానిస్తారా? ప్రభుత్వం పథకాలు ఎలా అమలవుతున్నాయి? చంద్రబాబు బాగా పనిచేస్తున్నారా? వైఎస్‌ జగన్, చంద్రబాబులలో ఎవరంటే మీకు ఇష్టం?  ఈ ఇద్దరిలో ఎవరికి మీ ఓటు?’’

ఇటీవలి కాలంలో కొందరు యువకులు బృందాలుగా ఏర్పడి రాష్ట్రమంతటా తిరుగుతూ ఎన్నికల సర్వే పేరిట ఇలాంటి ప్రశ్నలు సంధిస్తున్నారు. ట్యాబ్‌లు, ఇతర అధునాతన సాంకేతిక పరికరాలను తమతోపాటు తీసుకొస్తున్నారు. ఎక్కువగా ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీకి పట్టున్న ప్రాంతాల్లో ఈ బృందాలు  మోహరిస్తున్నాయి. ప్రజాభిప్రాయం తెలుసుకుంటున్నామని చెబుతూ ఓటర్లను ప్రశ్నలు అడుగుతున్నారు. ఓటరు ఐడీ నెంబర్, మొబైల్‌ నెంబర్‌ కూడా తీసుకుంటున్నారు. ఆయా నెంబర్లను తమతోపాటు తెచ్చుకున్న ట్యాబ్‌ల్లో అప్‌లోడ్‌ చేస్తున్నారు. కొద్దిసేపటికి సదరు ఓటర్ల ఓటు హక్కు రద్దవుతోంది. తమ ఓటు రద్దయినట్లు తెలుసుకుని జనం అవాక్కవుతున్నారు.  

ఓట్ల తొలగింపే లక్ష్యం 
గ్రామాలకు వస్తున్న యువకుల అసలు ఉద్దేశం సర్వే కాదని, వైఎస్సార్‌సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించేలా చేయడమేనని స్పష్టమవుతోంది. వచ్చే ఎన్నికల్లో తమకు భంగపాటు తప్పదని తేటతెల్లం కావడంతో టీడీపీయే సర్వేల పేరిట యువకులను పంపించి, ప్రతిపక్షం ఓట్లను  తొలగిస్తోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో 70 మంది యువకులను బృందాలుగా విభజించి, వారిపై ఒక సూపర్‌వైజర్‌ను నియమించి తిప్పుతున్నారు. యువకుల వద్ద చంద్రబాబు, మంత్రి లోకేశ్‌ ఫొటోలున్న టీడీపీ సభ్యత్వ గుర్తింపు కార్డులున్నాయి. 

సర్వే బృందాలకు వాట్సాప్‌ గ్రూప్‌ 
గుంటూరులోని బాలాజీ నగర్‌లో ఇటీవల కొందరు యువకులు సర్వే పేరిట ఇంటింటికీ తిరుగుతూ పట్టుబడ్డారు. పి.వెంకటేశ్వర్లు అనే వ్యక్తి నివాసానికి వచ్చి సర్వే పేరిట ఓటర్‌ ఐడీ నంబర్, ఫోన్‌ నెంబర్‌ తీసుకున్నారు. ఏ పార్టీకి ఓటు వేస్తారని అడిగారు. సెంటర్‌ ఫర్‌ సోషియో పొలిటికల్‌ ఎనాలసిస్‌(స్పా) అనే సంస్థ ద్వారా ప్రజాభిప్రాయం సేకరిస్తున్నామని చెప్పారు. ఓటర్‌ ఐడీ నెంబర్, ఫోన్‌ నెంబర్‌తో పనేముందని వారిని ప్రశ్నించడంతో అసలు సంగతి బయటపడింది. వీరిని స్థానిక వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే మహ్మద్‌ ముస్తాఫా పోలీసులకు అప్పగించారు. తాము ఇక్కడ 12 మంది తిరుగుతున్నామని, బెంగళూరు కేంద్రంగా తమ కార్యాలయం పనిచేస్తోందని, రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో తమ బృందాలు తిరుగుతున్నాయని సదరు యువకులు చెప్పారు. ఆ యువకుల మొబైల్‌లో 76 మందితో కూడిన సర్వే బృందం వాట్సాప్‌ గ్రూప్‌ ఉంది. గుంటూరు జిల్లా కృష్ణాయపాలెంలోనూ మరో బృందం సర్వే చేసి వెళ్లింది. యువకుల బృందాలు సర్వే చేసి వెళ్లిన కొద్దిసేపటికే తమ ఓట్లు రద్దవుతున్నాయని బాధితులు తెలిపారు. 

ఎన్నికల సంఘం పేరిట.. 
సర్వేలంటూ కొన్ని బృందాలు తిరుగుతుండగా మరికొందరు ఎన్నికల సంఘం పేరు చెప్పుకుంటూ గ్రామాల్లో తిరుగుతున్నారు. ఓటర్ల జాబితా సవరణ కోసం వచ్చామంటూ ఓటర్ల వివరాలు తెలుసుకుంటున్నారు. వారి చేతిలోని ట్యాబ్‌లో పార్టీల గుర్తులు చూపిస్తూ ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారో దానిపై వేలిముద్ర వేయాలని సూచిస్తున్నారు. వైఎస్సార్‌సీపీ గుర్తుపై వేలిముద్ర వేసిన వారి ఓట్లన్నీ ఓటర్ల జాబితా నుంచి మాయమవుతున్నాయి. తమ ఇంటికీ కొందరు యువకులు వచ్చి వివరాలు తీసుకొని, వేలిముద్ర వేయించుకొని వెళ్లారని, అనుమానం వచ్చి ఎన్నికల సంఘం టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌ చేస్తే తమ ఓటును తొలగించినట్లు సమాధానం వచ్చిందని తోట కార్తీక్‌ అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లాలోనూ ఓట్ల తొలగింపు ముఠాలు పట్టుబడ్డాయి. అంబాజీపేట, రాజోలు ప్రాంతాల్లో ఓట్లు తొలగిస్తున్న ఈ ముఠాలను స్థానికులు, వైఎస్సార్‌సీపీ నేతలు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. రాజోలు మండలం మాచవరం, వాకలగరువు గ్రామాల్లో తిరుగుతూ ఓటరు ఐడీ నెంబర్లు, ఫోన్‌ నెంబర్లు అడుగుతున్న యువకులపై అనుమానం వచ్చిన స్థానికులు పట్టుకుని విచారించారు. తాము సోషియో పొలిటికల్‌ ఎనాలసిస్‌ అనే సంస్థ నుంచి వచ్చామని యువకులు చెప్పుకొచ్చారు. ఒక్కో నియోజకవర్గానికి 60 మంది  బృందాలుగా ఏర్పరిచినట్లు పోలీసుల విచారణలో అంగీకరించారు. 

ప్రజలు అప్రమత్తంగా ఉండాలి 
సర్వేల పేరిట వివరాలు తెలుసుకుని, ఓట్లను తొలగిస్తున్న ముఠాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజాస్వామ్యవాదులు సూచిస్తున్నారు. వివరాలు అడిగితే చెప్పొద్దని, ఓటరు ఐడీ, ఫోన్‌ నెంబర్లను ఇవ్వొద్దని పేర్కొంటున్నారు. అనుమానం వస్తే గట్టిగా నిలదీయాలని, పోలీసులకు అప్పగించాలని అంటున్నారు. ఓటర్లకు తెలియకుండా వారి ఓటు హక్కును తొలగించడం ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం నేరమని చెబుతున్నారు. అక్రమంగా ఓట్లను తొలగిస్తున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

వేలిముద్ర వేస్తే ఓటు మాయమైంది 
‘‘మా ఇంటికి కొందరు యువకులు వచ్చారు. ఓటర్‌ ఐడీ నెంబర్, ఫోన్‌ నెంబర్‌ తీసుకున్నారు. ట్యాబ్‌లోని గుర్తులపై వేలిముద్ర వేయాలంటే వైఎస్సార్‌సీపీ గుర్తుపై వేశాం. మరుసటి రోజు చూసుకుంటే ఓటరు జాబితాలో మా కుటుంబ సభ్యుల పేర్లు కనిపించలేదు’’ 
– సానికొమ్ము వెంకటేశ్వరరెడ్డి, ఎల్‌ఆర్‌ కాలనీ, గుంటూరు  

ఇది తెలుగుదేశం పార్టీ పనే 
గుంటూరు నగరంలో సర్వేల పేరిట యువకులను నియమించి, 36 వేలకు పైగా ఓట్లను తొలగించారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ముస్తాఫా చెప్పారు. ఈ ఓట్లన్నీ తమ పార్టీ అభిమానులు, సానుభూతిపరులవేనని అన్నారు.  అధికార తెలుగుదేశం పార్టీయే ఇదంతా చేయిస్తోందని ఆరోపించారు.

టీడీపీ అడ్డదారులు
ప్రతిపక్ష మద్దతుదారులకు చెందిన ఓట్ల తొలగింపే లక్ష్యంగా ఇలాంటి ముఠాలు పర్యటిస్తున్నాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కోరారు. రానున్న ఎన్నికల్లో విజయం సాధించలేమనే టీడీపీ నేతలు అడ్డదారుల్లో ఇలా ఓట్ల తొలగింపునకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement