వ్యవసాయశాఖ ఏడీ ఇంట్లో చోరీ
గుంటూరు రూరల్: శివారు ప్రాంతంలోని వెటర్నరీ అసిస్టెంట్ డెరైక్టర్ ఇంట్లో చోరీ ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. సౌత్‌జోన్ డీఎస్పీ కె.నరసింహా తెలిపిన వివరాల ప్రకారం గోరంట్లలోని తిరుమలనగర్ రెండోలైన్‌కు చెందిన ఆలపాటి మురళీకృష్ణ గురజాలలో వెటర్నరీ శాఖ అసిస్టెంట్ డెరైక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తుంటాడు. గత 15 రోజులుగా కుటుంబ సభ్యులు కూడా ఆయనతోపాటు గురజాలలోనే ఉంటున్నారు. ఇంట్లో ఎవరూ లేరని గమనించిన కొందరు గుర్తు తెలియని వ్యక్తులు తలుపులు బద్దలు కొట్టి లోపలికి చొరబడ్డారు. ఇంటి సామగ్రి అంతా చిందరవందర చేశారు. బీరువా లాకర్ తెరిచి సుమారు ఐదు సవర్ల బంగారం, కిలో వెండి, 20 వేల నగదు అపహరించారు. ఇంటి తలుపులు బద్దలు కొట్టి ఉండటాన్ని గమనించిన స్థానికులు ముర ళీకృష్ణకు ఫోన్ చేసి సమాచారం అందజేశారు. ఆయన సోమవారం అర్థరాత్రి ఇంటికి వచ్చి చూసే సరికి ప్రధాన ద్వారం బద్దలు కొట్టి ఉంది. దీంతో ఆయన మంగళవారం ఉదయాన్నే రూరల్ పోలీసులకు సమాచారం అందజేశారు. సౌత్‌జోన్ డీఎస్పీ కె.నరసింహా, సీఐ వై.శ్రీనివాసరావు ఘటన స్థలానికి చేరుకున్నారు. చుట్టుపక్కల వారి నుంచి వివరాలు సేకరించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ కీలక ఆధారాలను సేకరించాయి. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.