నాలుగేళ్లుగా అద్దెల్లేవ్
- 548 ఆరోగ్య ఉపకేంద్రాలకు అద్దె జబ్బు
- ప్రభుత్వం ఇచ్చేది రూ.250
- అది కూడా నాలుగేళ్లుగా పెండింగ్
- ఖాళీ చేయాలని యజమానుల ఒత్తిడి
మచిలీపట్నం/కంచికచర్ల : పాలకుల నిర్లక్ష్యం కారణంగా గ్రామీణ ప్రాంతాల్లోని ఆరోగ్య ఉపకేంద్రాలకు అద్దె జబ్బు పట్టింది. నాలుగేళ్ల క్రితం పట్టిన ఈ జబ్బును నయం చేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు ఎటువంటి చర్యలు చేపట్టడం లేదు. ఫలితంగా అద్దె భవనాల్లో నిర్వహిస్తున్న 548 ఆరోగ్య ఉపకేంద్రాలు ఖాళీ చేయాల్సిన ప్రమాదం ముంచుకొస్తోంది. పేదలకు ప్రాథమిక వైద్యం దూరమయ్యే దుస్థితి దాపురిస్తోంది.
జిల్లా వ్యాప్తంగా 620 ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 72 భవనాలను మాత్రమే ప్రభుత్వం నిర్మించింది. మిగిలిన 548 ఆరోగ్య ఉప కేంద్రాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఈ భవనాలకు ప్రభుత్వం నెలకు రూ.250 చొప్పున అద్దె మంజూరు చేస్తోంది. వాస్తవానికి ఒక్కో ఆరోగ్య ఉప కేంద్రానికి ఆయా ప్రాంతాన్ని బట్టి రూ.500 నుంచి రూ.1,200 వరకు ప్రతి నెలా ఏఎన్‌ఎంలే సొంత డబ్బుతో అద్దె చెల్లిస్తున్నారు.
భారీగా బకాయిలు
ప్రభుత్వం ప్రకటించిన రూ.250 కూడా నాలుగేళ్లుగా మంజూరు చేయడంలేదు. ప్రభుత్వం నిర్ణయించిన విధంగా ఒక్కో ఆరోగ్య ఉప కేంద్రానికి ఏడాదికి అద్దె బకాయిలు చెల్లించాలంటే జిల్లా వ్యాప్తంగా రూ.16.44 లక్షలు కావాలి. ప్రభుత్వం ఏటా కేవలం రూ.5 లక్షలకు మించి విడుదల చేయటం లేదు. ఈ నగదు కూడా ఆర్థిక సంవత్సరం ముగిసే మార్చి 25వ తేదీన విడుదల చేసి 31లోపు ఖర్చు చేయాలనే నిబంధన విధిస్తోంది. ఈ సమయంలో ట్రెజరీలో బిల్లులు మార్చుకునేందుకు ఫ్రీజింగ్ అడ్డుగా ఉండటంతో ఆరోగ్య ఉపకేంద్రాలకు సంబంధించిన అద్దె బకాయిలు చెల్లించే అవకాశం లేకుండాపోతోంది. ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి నెలకొందని డీఎం, హెచ్‌వో జె.సరసిజాక్షి ‘సాక్షి’కి తెలిపారు.
అద్దె భారం ఏఎన్‌ఎంల పైనే
అద్దె భవనాల్లో కొనసాగుతున్న ఆరోగ్య ఉపకేంద్రంలో పనిచేసే ఏఎన్‌ఎంలు ప్రతి నెలా తమ జీతంలో నుంచి ఆయా కేంద్రాలకు అద్దె చెల్లించాల్సి వస్తోంది. ఆరోగ్య ఉప కేంద్రాలకు సంబంధించిన విద్యుత్ బిల్లులను సైతం తామే చెల్లిస్తున్నామని పలువురు ఏఎన్‌ఎంలు వాపోతున్నారు. ప్రస్తుతం గృహాల అద్దె పెరిగిపోవటంతో ఆరోగ్య ఉప కేంద్రాలను ఖాళీ చేయాలని యజమానులు ఒత్తిడి చేస్తున్నారు.
దీంతో ఆరోగ్య ఉప కేంద్రాలు ఎక్కడ కొనసాగించాలా.. అని ఏఎన్‌ఎంలు తలలు పట్టుకుంటున్నారు. ఈ ఏడాదైనా ఆరోగ్య ఉప కేంద్రాలకు అద్దె బకాయిలను ప్రభుత్వం పూర్తి స్థాయిలో విడుదల చేయాలని పలువురు ఏఎన్‌ఎంలు కోరుతున్నారు. ఇప్పటికైనా ఆరోగ్య శాఖ జిల్లా స్థాయి అధికారులు స్పందించి ప్రాథమిక ఆరోగ్య ఉపకేంద్రాలకు సొంత భవనాల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.