ఇక ఏటా డీఎస్సీ! | Adimulapu Suresh Said DSC Notification Will Be Release Every Year | Sakshi
Sakshi News home page

ఇక ఏటా డీఎస్సీ!

Published Wed, Oct 2 2019 9:58 AM | Last Updated on Wed, Oct 2 2019 9:58 AM

Adimulapu Suresh Said DSC Notification Will Be Release Every Year - Sakshi

సాక్షి, మార్కాపురం (ప్రకాశం): ఇక మీదట ప్రతి ఏటా డీఎస్సీ నిర్వహిస్తూ విద్యాశాఖలో ఖాళీలన్నీ భర్తీ చేస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విద్యారంగం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారని చెప్పారు. మంగళవారం ఆయన మార్కాపురం ప్రెస్‌క్లబ్‌లో జరిగిన మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో మాట్లాడారు. ఇటీవలే పాఠశాల్లో పేరెంట్‌ కమిటీ ఎన్నికలు నిర్వహించామన్నారు. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా మనబడి–మన బాధ్యత కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని, దీని ద్వారా పాఠశాలల్లో తాగునీరు, మరుగుదొడ్ల నిర్మాణం, బ్లాక్‌బోర్డ్స్, ప్రహరీల నిర్మాణం తదితర పనులు చేపడతామన్నారు. విద్యార్థుల నిష్పత్తిని అనుసరించి ఉపాధ్యాయ పోస్టులను మంజూరు చేసి భర్తీ చేస్తామన్నారు. నెలలో 1, 3వ శనివారాలను నో బ్యాగ్‌ డేగా పాటించి విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసే కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించినట్లు తెలిపారు. రాజన్న బడిబాట కార్యక్రమం ద్వారా బడిలో చేరిన విద్యార్థులందరికీ విలువలతో కూడిన విద్యను అందిస్తున్నామని, డ్రాప్‌ అవుట్స్‌ తగ్గిస్తున్నామని తెలిపారు.

సంస్కరణలకు పెద్దపీట..
గత ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసి ప్రజాధనాన్ని లూటీ చేయటంతో విద్యాశాఖలో రివర్స్‌ టెండరింగ్‌ విధానం అమలు చేస్తున్నట్లు మంత్రి సురేష్‌ చెప్పారు. వర్చువల్‌ క్లాసులు, డిజిటల్‌ తరగతుల పేరుతో కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైందని, వీటి కోసం రివర్స్‌ టెండరింగ్‌కు వెళ్తామన్నారు. పారదర్శకంగా పరిపాలన ఉంటుందన్నారు. బాలికల్లో అక్షరాస్యత శాతాన్ని పెంపొందించే చర్యలు తీసుకున్నామని తెలిపారు. రెండేళ్లలో రాష్ట్రంలోని పాఠశాలల రూపురేఖలు మారిపోయి అత్యున్నత స్థాయికి వెళ్తాయన్నారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థ పటిష్టత కోసం ప్రైవేటు విద్యా సంస్థలపై పర్యవేక్షణ, ఫీజుల నియంత్రణ కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, జస్టిస్‌ కాంతా రావు, జస్టిస్‌ ఈశ్వరయ్యలతో కమిషన్లను ఏర్పాటు చేశారని, సంస్కరణలకు పెద్ద పీట వేస్తున్నామని చెప్పారు. ప్రతి ఏటా విద్యాదినోత్సవం నాడు ప్రతిభా వంతులైన విద్యార్థులకు జిల్లా స్థాయిలో పురస్కారాలు అందిస్తామన్నారు.

2వ ప్రాధాన్యత ప్రాజెక్టుగా వెలిగొండ..
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోలవరం ప్రాజెక్టు తరువాత వెలిగొండ ప్రాజెక్టును 2వ ప్రాధాన్యతగా గుర్తించినట్లు తెలిపారని, వచ్చే ఏడాది వెలిగొండ ప్రాజెక్టు నీళ్లు కచ్చితంగా వస్తాయని మంత్రి స్పష్టం చేశారు.  టీడీపీ నేతల మాదిరిగా 5 ఏళ్ల పాటు మాయమాటలు చెప్పి తప్పించుకోమన్నారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితుల కోసం రూ.1500 కోట్లతో కలెక్టర్‌ ప్రభుత్వానికి నివేదిక పంపారని తెలిపారు. ఇందులో నష్ట పరిహారానికి, పునరావాస కాలనీలకు మొదటి విడతగా రూ.500 కోట్లు ప్రభుత్వం కేటాయించిందన్నారు. ప్రాజెక్టు పూర్తయితే 3 జిల్లాల్లో 4.50 లక్షల ఎకరాలకు సాగునీరు, 16 లక్షల మందికి తాగునీరు వస్తుందని, మొదటి దశలో సుమారు 1.16 లక్షల ఎకరాలకు సాగునీరు వస్తుందని మంత్రి తెలిపారు. 2వ టన్నెల్‌ పనులకు టెండర్లు పిలుస్తున్నట్లు తెలిపారు. అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కూడా మంజూరు చేస్తామని మంత్రి చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement