తీపి కబురు: త్వరలో డీఎస్సీ | Adimulapu Suresh Comments About DSC 2020 | Sakshi
Sakshi News home page

త్వరలో డీఎస్సీ

Published Wed, Sep 23 2020 3:21 AM | Last Updated on Wed, Sep 23 2020 11:59 AM

Adimulapu Suresh Comments About DSC 2020 - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు డీఎస్సీ–2020పై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ తెలిపారు. డీఎస్సీ కంటే ముందు టెట్‌ను నిర్వహిస్తామన్నారు. ఆయన మంగళవారం విజయవాడలో మీడియాతో మాట్లాడారు. 2018 డీఎస్సీకి సంబంధించిన కోర్టు వ్యాజ్యాలన్నింటిని పరిష్కరింపజేసి త్వరగా ఆ పోస్టులన్నిటినీ భర్తీ చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారని చెప్పారు. అవన్నీ పూర్తయ్యాక టెట్, డీఎస్సీ–2020 నిర్వహణకు చర్యలు చేపడతామన్నారు. టెట్‌ విధివిధానాలు, సిలబస్‌ను సిద్ధం చేశామని తెలిపారు. నూతన విద్యావిధానానికి, మారుతున్న పాఠశాల సిలబస్‌కు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని టెట్‌ సిలబస్‌ ఉంటుందని వివరించారు.

ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలపై నేడు నిర్ణయం
► ఆర్జీయూకేటీ పరిధిలోని నాలుగు ట్రిపుల్‌ ఐటీల్లో ప్రవేశాలపై బుధవారం నిర్ణయం తీసుకుంటాం. 
► ఈసారి టెన్త్‌లో మార్కులు, గ్రేడ్‌లు ఇవ్వలేనందున ప్రవేశాలు ఎలా చేపట్టాలన్న దానిపై తుది నిర్ణయానికొస్తాం. 
► మ్యాథ్స్, సైన్స్‌ సబ్జెక్టుల్లో విద్యార్థులకు ఎంట్రెన్స్‌ టెస్ట్‌ పెట్టాలా? లేదా ఇంకా వేరే ఏదైనా మార్గముందా అనేది పరిశీలిస్తాం.
► డీసెట్‌ రాసి అర్హత సాధించకున్నా, రాయకున్నా స్పాట్‌ అడ్మిషన్ల పేరిట ప్రవేశాలు పొందిన 2017–2019 బ్యాచ్‌ అభ్యర్థులకు పరీక్షల నిర్వహణ విషయమై కోర్టు తీర్పుననుసరించి నిర్ణయం తీసుకుంటాం. 

ఇంటర్‌ సిలబస్‌ను తగ్గిస్తాం..
► ఇంటర్మీడియెట్‌ తరగతులు ఆలస్యమైనందున ముఖ్యాంశాలను వదలకుండా సీబీఎస్‌ఈ తరహాలో సిలబస్‌ను తగ్గిస్తాం. 
► 9, 10, ఇంటర్‌ విద్యార్థులకు రెగ్యులర్‌ తరగతులు అక్టోబర్‌ 5 నుంచి చేపట్టాలని భావిస్తున్నాం. కేంద్రం సూచనల మేరకు తుది నిర్ణయం తీసుకుంటాం. 
► జగనన్న విద్యా కానుకకు సంబంధించిన అన్ని వస్తువులు ఆయా స్కూళ్లకు చేరాయి. సీఎం ఆదేశాల మేరకు వీటిని నిర్ణీత తేదీన విద్యార్థులకు అందిస్తాం.
► నూతన విద్యావిధానం ప్రకారం.. 2020–21 విద్యాసంవత్సరం నుంచే 5+3+3+4 విధానాన్ని ప్రారంభిస్తున్నాం. 
► స్కూళ్లకు అనుబంధంగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల్లో ముందుగా ఎల్‌కేజీ, యూకేజీలను ప్రారంభించనున్నాం.
► టీచర్లకు త్వరలోనే వెబ్‌ కౌన్సెలింగ్‌ ద్వారా బదిలీలు ఉంటాయి. 

25 నుంచి ఎస్‌జీటీ పోస్టుల భర్తీకి కౌన్సెలింగ్‌
న్యాయ వివాదాల కారణంగా నిలిచిపోయిన 2018 డీఎస్సీ సెకండరీ గ్రేడ్‌ టీచర్‌ పోస్టుల భర్తీకి మంత్రి ఆదిమూలపు సురేశ్‌ షెడ్యూల్‌ ప్రకటించారు.
– 2018 డీఎస్సీ నోటిఫికేషన్‌లో 3,524 సెకండరీ గ్రేడ్‌ పోస్టుల భర్తీకి ప్రకటన ఇచ్చారు. 
– ఆ తర్వాత పరీక్షల నిర్వహణ, మెరిట్‌ జాబితాల రూపకల్పన చేసి 2,203 మంది ధ్రువపత్రాలను ఆయా జిల్లాల విద్యాధికారులు పరిశీలన చేశారు. వ్యాజ్యాల కారణంగా ఆ ప్రక్రియ అప్పట్లో నిలిచిపోయింది. 
– ఇంకా 1,321 మంది ధ్రువపత్రాలను పరిశీలన చేయాల్సి ఉంది. బుధవారం ఈ పోస్టులకు అర్హత సాధించిన వారి మొబైల్‌ నెంబర్లకు సంక్షిప్త సందేశాలను పంపిస్తారు. 
– అనంతరం వారు తమ ధ్రువపత్రాలను సంబంధిత వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఎంపికైనవారు ఈనెల 24న ఆయా జిల్లాల విద్యాశాఖాధికారి కార్యాలయాల్లో ఒరిజినల్‌ ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాలి. 
– అదే రోజు ఆయా జిల్లాల్లోని 3, 4 కేటగిరీలు, ఇతర మారుమూల ప్రాంతాల్లోని స్కూళ్లలోని ఖాళీల జాబితాను డీఈవో ఆఫీస్‌ పోర్టళ్లలో ప్రదర్శిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఈనెల 25, 26 తేదీల్లో కౌన్సెలింగ్‌ నిర్వహించి అదే రోజున నియామక ఉత్తర్వులు అందిస్తారు. 
– ఈనెల 28న తమకు కేటాయించిన స్కూళ్లలో చేరాల్సి ఉంటుంది. 
– కాగా ఇప్పటికీ పలు వ్యాజ్యాల కారణంగా నిలిచిపోయిన మరికొన్ని కేటగిరీలకు సంబంధించిన మొత్తం 949 పోస్టులను కూడా కోర్టు కేసుల పరిష్కారం అనంతరం నియామకాలు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఆయా పోస్టుల్లో 374 స్కూల్‌ అసిస్టెంట్‌ (తెలుగు, లాంగ్వేజ్‌ పండిట్స్‌–తెలుగు) పోస్టులు, 486 పీఈటీలు, ఫిజికల్‌ డైరెక్టర్లు, 89 ప్రిన్సిపాల్స్‌ పోస్టులున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement