- రూ.50 లక్షల వ్యయంతో ఏర్పాటు
- అక్రమాల అడ్డుకట్టే లక్ష్యం
ఆదోని: సాంకేతిక పరిజ్ఞానంను వినియోగించుకోవడంలో ఆదోని యార్డు ముందుంది. వ్యవసాయ దిగుబడుల క్రయ, విక్రయాల ప్రక్రియను వేగవంతం చేసేందుకు ఈ-టెండర్లు ప్రారంభించిన అధికారులు అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు యార్డులో 60 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. రాష్ట్ర మార్కెటింగ్ శాఖ కమిషనరు వెంకటరామిరెడ్డి సీసీ కెమెరాల ఏర్పాటుకు ఓకే చెప్పారు. ఏటా దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు విలువైన వ్యవసాయ దిగుబడులను రైతులు యార్డులో అమ్ముకుంటున్నారు.
అయితే కొంత మంది వ్యాపారులు ఏటా రూ.కోట్ల రూపాయలు విలువైన దిగుబడులను జీరోలో కొనుగోలు చేసి ఇతర రాష్ట్రాలకు తరలించుకుని సొమ్ముచేసుకుంటున్నారు. దీనివల్ల యార్డు, వాణిజ్య పన్నుల శాఖల ఖజానాకు రూ.కోట్లు గండి పడుతోంది. కొంతమంది యార్డు సిబ్బంది చేతులు కలుపడంతో అక్రమ వ్యాపారుల ఆగడాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. తమకు సహకరిస్తున్న అధికారులకు, సిబ్బందికి అక్రమ వ్యాపారులు వేరుశనగ బస్తాకు రూ.8, పత్తి డోక్రాకు రూ.వంద చొప్పున ఇచ్చుకుంటున్నారనే ఆరోపణలున్నారు.
జీరోలో కొనుగోలు చేస్తున్న వ్యాపారులు నేరుగా రైతులతో సంప్రదించి ధర మాట్లాడుకుంటున్నారు. దీంతో పలు సందర్బాలలో ధర రూపంలో రైతులు కూడా నష్టపోతున్నారు. యార్డులో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే ఇటు అక్రమ వ్యాపారులు, అందుకు సహకరించే అధికారులు, సిబ్బంది కదలికలను గుర్తించవచ్చని భావించారు.
రూ.50 లక్షల వ్యయంతో..
యార్డులో ఐదు ప్రధాన గేట్లు ఉన్నాయి. టీఎంసీ యార్డుతో కలుపుకుని మొత్తం 7 ప్లాట్ ఫారంలు ఉన్నాయి. ప్రధాన గేట్లు, ప్లాట్ ఫారంలు, టెండర్‌హాలు, ప్రధాన కార్యాలయంలో మొత్తం 60 చోట్ల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉందని యార్డు కార్యదర్శి రామారావు, డీఈఈ సుబ్బారెడ్డి తెలిపారు. ఇందుకు దాదాపు రూ.50లక్షల వరకు వ్యయం అవుతోందని అంచనా వేశామని అన్నారు. ఇప్పటికే ముంబరుుకి చెందిన ప్రధాన సంస్థ ప్రతినిధులు సీసీ కెమెరాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలో పరిశీలించి నివేదిక అందించారని పేర్కొన్నారు.
ఈ-టెండర్లు ప్రారంభోత్సవంకు వచ్చిన మార్కెటింగ్ శాఖ కమిషనరు వెంకటరామిరెడ్డి సీసీ కెమెరాల ఏర్పాటుపై యార్డు అధికారులతో చర్చించారు. సొంతంగా కొనుగోలు చేయడం కన్నా అద్దెకు ఏదైనా ప్రముఖ సంస్థకు ఇవ్వడం బాగుంటుందేమో పరిశీలించాలని తమకు సూచించినట్లు డీఈఈ సుబ్బారెడ్డి తెలిపారు. సొంతంగా కొనుగోలుచేయూలా లేక అద్దెకు ఇవ్వాలా అనేది ఉన్నత స్థాయిలో నిర్ణయం తీసుకుని ఆదేశాలు జారీ చేస్తారని, ఆదేశాలు రాగానే కెమెరాల ఏర్పాటు చేస్తామని యార్డు కార్యదర్శి, డీఈఈ వివరించారు.