రూ.300 టికెట్ల అడ్వాన్స్ బుకింగ్ గడువు పెంపు
టీటీడీ ఈవో సాంబశివరావు వెల్లడి
సాక్షి, తిరుమల: శ్రీవారి రూ. 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల ముందస్తు రిజర్వేషన్‌ను 60 రోజుల నుంచి 90 రోజులకు పెంచుతున్నట్టు టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు శుక్రవారం డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో వెల్లడించారు. ఈ సౌకర్యాన్ని భక్తులకు వారంలోపు కల్పిస్తామని, గదులు, శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల రిజర్వేషన్లు కూడా 90 రోజుల ముందే బుకింగ్ చేసుకునేందుకు పరిశీలిస్తామన్నారు.
జూలై ఒకటో తేదీ నుంచి 31వ తేదీ వరకు 56,640 ఆర్జిత సేవా టికెట్లు భక్తులకు అందుబాటులో ఉంచామని, శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి www. ttdsevaonline.com వెబ్‌సైట్‌లో రిజర్వేషన్ చేసుకోవచ్చని చెప్పారు. ఆగస్టు 12 నుంచి ప్రారంభం కానున్న కృష్ణా పుష్కరాలకు టీటీడీ తరఫున త్వరలోనే నమూనా ఆలయాన్ని నిర్మిస్తామని తెలిపారు.