గతేడాది 2.66 కోట్ల మందికి శ్రీవారి దర్శనం
టీటీడీ ఈవో సాంబశివరావు వెల్లడి
సాక్షి, తిరుమల: గతేడాదిలో మొత్తం 2.66 కోట్ల మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారని టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు చెప్పారు. శుక్రవారం జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమానంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. గతేడాదిలో హుండీ ద్వారా శ్రీవారికి రూ.1,018 కోట్ల కానుకలు లభించాయని తెలిపారు. టీటీడీ 10.34 కోట్ల లడ్డూలు భక్తులకు పంపిణీ చేసి రికార్డు నెలకొల్పిందన్నారు. శ్రీవారి ఆర్జిత సేవలకు సంబంధించి ఏప్రిల్ 1 నుంచి 30 వరకు మొత్తం 50,974 టికెట్లను శుక్రవారం విడుదల చేసినట్లు ఈవో వెల్లడించారు.
వైకుంఠ ఏకాదశి, ద్వాదశికి విస్తృత ఏర్పాట్లు : ఈ నెల 8న వైకుంఠ ఏకాదశి, 9న వైకుంఠ ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని తిరుమల ఆలయంతో పాటు టీటీడీ అన్ని స్థానిక ఆలయాల్లో విస్తృత ఏర్పాట్లు చేసినట్లు ఈవో తెలిపారు. ఈ రెండు రోజుల్లో తిరుమలలోని శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారం తెరచి ఉంటుందన్నారు. ఆలయంలో అన్ని రకాల ఆర్జిత సేవలు, వృద్ధులు, చంటిబిడ్డ తల్లిదండ్రులకు ప్రత్యేక ప్రవేశ దర్శనాలు రద్దు చేసినట్లు చెప్పారు. కాలిబాట భక్తులకు టోకెన్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఏకాదశి నాడు శ్రీవారికి స్వర్ణ రథోత్సవం: వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆదివారం తిరుమలలోని శ్రీవారికి స్వర్ణ రథోత్సవం నిర్వహించనున్నారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప స్వామి వారు స్వర్ణ రథంపై ఆలయ పురవీధుల్లో దర్శనమివ్వనున్నారు. సోమవారం ద్వాదశిని పురస్కరించుకుని వేకువజామున పుష్కరిణిలో శ్రీవారికి చక్రస్నానం నిర్వహించనున్నారు.