వైభవంగా గరుడోత్సవం
మలయప్ప దర్శనంతో తన్మయం చెందిన భక్తకోటి
సాక్షి, తిరుమల: పౌర్ణమి పర్వదినం సందర్భంగా తిరుమలలో ఆదివారం రాత్రి గరుడ వాహన ఊరేగింపు వైభవంగా సాగింది. పౌర్ణమి సందర్భంగా ఆలయ పురవీధుల్లో మలయప్ప గరుడ వాహనంపై దర్శనమివ్వటం సంప్రదాయం. సాయం సంధ్యా సమయం పూజలు ముగించుకుని శ్రీదేవి, భూదేవి సమేత మలయప్ప కొలువు మండపంలో వేంచేపు చేశారు. సహస్ర దీపాలంకారసేవలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చి కనువిందు చేశారు. తర్వాత వాహన మండపంలో వేంచేపు చేశారు. భక్తాగ్రేసుడైన గరుడునిపై ఆశీనులైన మలయప్పను అర్చకులు విశేష ఆభరణాలు, సుగంధ సువాసనలు వెదజల్లే పుష్పాలతో అలంకరించారు. భక్తుల గోవింద నామస్మరణలు, వేద మంత్రాల నడుమ రాత్రి 7 గంటలకు ప్రారంభమైన ఊరేగింపు రాత్రి 9 గంటల వరకు సాగింది. అశేష సంఖ్యలో హాజరైన భక్తులు అడుగడుగునా ఉత్సవ మూర్తులకు హారతి పట్టారు. కార్యక్రమంలో టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు , జేఈవో పాల్గొన్నారు.
దర్శనానికి కిక్కిరిసిన భక్తులు
తిరుమలలో పెరటాశి భక్తుల రద్దీ ఆదివారం కూడా కొనసాగింది. కాలిబాట, సర్వదర్శనం, రూ.300 టికెట్ల దర్శనంలోనూ భక్తులు కిక్కిరిసి కనిపించారు. పెరిగిన రద్దీకి అనుగుణంగా టీటీడీ కూడా అప్రమత్తమైంది. టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు, జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు అన్ని విభాగాల అధికారుల ద్వారా భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించడంపై దృష్టి సారించారు.