ఆరేళ్ల తర్వాత | After six years | Sakshi
Sakshi News home page

ఆరేళ్ల తర్వాత

Published Fri, Jan 31 2014 4:05 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

After six years

జూలకంటి పులీందర్‌రెడ్డిని గురువారం ఉదయం 9.45నిమిషాలకు ప్రత్యర్థులు కారుతో ఢీకొట్టి, వేటకొడవలితో నరికి చంపారు. గ్రామపంచాయతీ పని నిమిత్తం కోదాడలోని ఆర్‌అండ్‌బీ కార్యాలయానికి వెళ్లేందుకు పులీందర్‌రెడ్డి గ్రామానికి చెందిన సాక్షరభారత్ గ్రామ కోఆర్డినేటర్ పిడమర్తి అబ్రహంతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. వారు కోదాడ శివారులోకి రాగానే వెనుక నుంచి ఓ కారులో ఆరుగురు వ్యక్తులు వెంబడించి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టారు. దీంతో బైక్‌పై నుంచి ఇద్దరూ కిందపడిపోయారు. ఈలోగా కారులోంచి ఆరుగురు వ్యక్తులు ముసుగులు ధరించి వేటకొడవళ్లతో పులీందర్‌రెడ్డిని వెంబడించారు. సంఘటనా స్థలం నుంచి పులీందర్‌రెడ్డి ప్రాణభయంతో దాదాపు అర కిలోమీటర్ దూరం వరకు పరుగెత్తాడు. అయినా హంతకులు అతడిని వెంబడించి వేటకొడవళ్లతో దారుణంగా నరికారు.
 
 ఈ సంఘటన జరుగుతున్న సమయంలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై ప్రయాణించే పలువురు.. కోదాడ పోలీసులకు, 108సిబ్బందికి సమాచారమిచ్చారు. పులీందర్‌రెడ్డి మరణించాడని భావించిన హంతకులు వచ్చిన కారులోనే హుజూర్‌నగర్ రోడ్డు వైపు వెళ్లారు. సమాచారం అందుకున్న కోదాడ పోలీసులు, 108 సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. కొన ఊపిరితో ఉన్న పులీందర్‌రెడ్డిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందాడు. పులీందర్‌రెడ్డి మృతదేహాన్ని కోదాడ పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
 
 పంచాయతీ ఎన్నికలతో.. తిరిగి విభేదాలు
 ఆరు సంవత్సరాల పాటు ప్రశాంతంగా ఉన్న నర్సింహులగూడెంలో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నిక మరోసారి పాత కక్షలకు వేదికగా మారింది. ఈ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరఫున యువజన కాంగ్రెస్ పార్టీ జిల్లా మాజీ నాయకుడు ఖాసింఖాన్ సోదరుడు సత్తార్, సీపీఎం తరఫున జూలకంటి పులీందర్‌రెడ్డి పోటీ చేశారు. ఈ ఎన్నికలో పులీందర్‌రెడ్డి సత్తార్‌పై 369 ఓట్ల తేడాతో విజయం సాధించాడు. దీంతో ఇరువర్గాల మధ్య మళ్లీ పోరు మొదలైంది. ఈ తరుణంలో ప్రత్యర్థులు పులీందర్‌రెడ్డిని హతమార్చేందుకు ప్రణాళికను సిద్ధం చేసుకున్నారు. పలుమార్లు గ్రామంతో పాటు మునగాలలో రెక్కీ నిర్వహించిన ట్లు తెలిసింది. ఇందులో భాగంగా ముందస్తుగా పులీందర్‌రెడ్డిని హత్య చేసేందుకు ఆరుగురు ఒక ముఠాగా ఏర్పడి గురువారం వెంబ డించి దారుణంగా వేటకొడవళ్లతో దాడి చేసి హతమార్చారు.
 
 కూతురు పుట్టిన రోజు జరిపిన
 మరునాడే హత్య..
 పులిందర్‌రెడ్డికి భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. అందులో పెద్ద కూతురు పుట్టిన రోజును బుధవారం రాత్రి ఘనంగా నిర్వహించాడు. తెల్లవారే అతను హత్యకు గురయ్యాడు. రాత్రి సంతోషంగా అందరితో కలిసిమెలసి ఉన్న పులీందర్‌రెడ్డి విగతజీవిగా మారడాన్ని చూసి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తట్టుకోలేకపోయారు. బోరును విలపించారు. పులీందర్‌రెడ్డి హత్యకు గురయ్యాడన్న వార్త నిమిషాల వ్యవధిలోనే  మండలంలోని అన్ని గ్రామాలకు వ్యాపించింది. దీంతో వందలాది మంది ప్రజలు, సీపీఎం నాయకులు, కార్యకర్తలు కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని పులీందర్‌రెడ్డి మృతదేహాన్ని చూసి విలపించారు. మృతుని భార్య విజయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోదాడ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 
 పులీందర్ ప్రస్థానం..
 జూలకంటి పులీందర్‌రెడ్డి విద్యార్థి సంఘం నాయకుడి స్థాయి నుంచి సీపీఎం మండల కమిటీ సభ్యుడిగా పనిచేశారు. 1997లో ఆయన ఎస్‌ఎఫ్‌ఐలో చేరారు. 1999లో సంఘం డివిజన్ అధ్యక్షునిగా ఎన్నికై 2001వరకు ఆ పదవిలో కొనసాగారు. తన నాయకత్వంలో విద్యార్థుల సమస్యలపై అనేక ఆందోళనలు నిర్వహించారు. తర్వాత నర్సింహులగూడెంలో డీవైఎఫ్‌ఐ గ్రామ కమిటీలో కీలకపాత్ర పోషించారు.
 
 1997నుంచే సీపీఎం పార్టీ సభ్యుడిగా కొనసాగుతున్న ఆయన 2012లో పార్టీ గ్రామ శాఖ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం పార్టీ మండల కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నాడు. 2013 జూలైలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆయన టీడీపీ మద్దతుతో సీపీఎం అభ్యర్థిగా పోటీ చేసి సర్పంచ్‌గా భారీ మెజార్టీలో విజయం సాధించాడు. పులీందర్‌రెడ్డి కోదాడలో డిగ్రీ వరకు చదివాడు. అయితే, గతంలో సూర్యాపేటలో జరిగిన ఖాసింఖాన్ హత్య కేసులో అతడు ఏ3 ముద్దాయిగా ఉన్నాడు. దీంతో కోర్టులకు తిరగాల్సి రావడంతో ఫైనల్ ఇయర్ పరీక్షలు రాయలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement