తుస్సు‘బస్సు’!
ఢాం.. డూం.. ఇదేదో దీపావళి టపాసుల శబ్దాలనుకుంటే పొరబాటే. మహబూబ్ నగర్ జిల్లాలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైన తర్వాత జిల్లాలో ఆర్టీఏ అధికారులు స్పందించిన తీరిది. నిబంధనల మేరకు బస్సులు నడపడం లేదంటూ హడావిడి చేసి బస్సుల్ని ఆపేశారు.
అబ్బో.. ఆర్టీఏ అధికారులు కాస్త ఆలస్యంగానైనా మేల్కొన్నారని ప్రయాణికులు భావించారు. ఇంతలోనే వారి మనసు మారిపోయింది. బస్సులు నడుపుకోండంటూ పచ్చజెండా ఊపారు. ప్రైవేటు ట్రావెల్స్‌పై ఆర్టీఏ అధికారులకు ఎందుకంత ప్రేమ అన్నదే సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
సాక్షి, కడప: జిల్లాలో పైవేటు ట్రావెల్స్ ఆధ్వర్యంలో 77 బస్సులు నడుస్తున్నాయి. హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు రూట్లలో ప్రధానంగా ఈ బస్సులు నడుస్తున్నాయి. వీటిలో నిత్యం వందలాది మంది ప్రయాణిస్తున్నారు. ఈ బస్సులలో చాలా వరకూ అనుభవం ఉన్న డ్రైవర్లు లేరు.
చాలా ట్రావెల్స్ ఒక డ్రైవరుతోనే సర్వీసులు నడుపుతున్నాయి. నిబంధనలు పాటించకుండా నడిచే సర్వీసులు కూడా బోలెడే.అయినా అధికారులు మాత్రం చర్యలు తీసుకోలేదు. యథేచ్ఛగా ట్రావెల్స్ నడిచాయి. అక్కడక్కడా ప్రమాదాలు జరిగినా, కొన్ని సందర్భాల్లో గమ్యం చేరకుండానే బస్సులు మధ్యలో మొరాయించినా, అధిక ధరలకు టిక్కెట్లు విక్రయిస్తున్నా చర్యలు తీసుకోలేదు. ట్రావెల్స్ యజమానులకు, ఆర్టీఏ అధికారులకు ఉన్న సత్సంబంధాలే దీనికి కారణం.
మహబూబ్‌నగర్ ఘటన తర్వాత హడావుడి:
ఇటీవల మహబూబ్‌నగర్‌లో ఓ ప్రైవేటు బస్సు ప్రమాదానికై గురై 45మంది దుర్మరణం చెందారు. దీంతో జిల్లాలోని ట్రావెల్స్ పరిస్థితి ఏంటని కలెక్టర్ కోన శశిధర్ ఆర్టీఏ అధికారులను ఆరా తీశారు. దీంతో హడావుడి చేసి 72 బస్సులను ఆపేశారు. ఇదేంటని అడిగితే ప్రయాణికులను సురక్షితంగా గమ్యం చేర్చేందుకు, బస్సులు ప్రమాదానికి గురికాకుండా ఉండేందుకు తీసుకునే చర్యలపై లిఖిత పూర్వక హామీ ఇవ్వాలని ట్రావెల్స్ యజమానులను కోరామని, అవి అందేదాకా ఎట్టిపరిస్థితుల్లో అనుమతిచ్చే ప్రసక్తే లేదని డీటీసీ కృష్ణవేణి గట్టిగానే చెప్పారు. అయితే ట్రావెల్స్ యజమానులు లెటర్‌ప్యాడ్‌లో హామీలు ఇచ్చేదాని కంటే ప్రతి బస్సులో సౌకర్యాలను పర్యవేక్షించి, అన్నీ సక్రమంగా ఉన్నవాటికి అనుమతులు జారీ చేయాలనే దిశగా అధికారులు ఆలోచించలేదు.
ఇవన్నీ కనిపించలేదా?:
చాలా ట్రావెల్స్‌లో బస్సులకు కిటికీలు లేవు. పూర్తిగా అద్దంతో మూసేశారు. ప్రస్తుతం ఉన్న హైటెక్ బస్సులకు డోర్‌లాక్ అయిపోతోంది. ఏదైనా ప్రమాదం జరిగితే ప్రయాణికులు బస్సులో నుంచి బయట పడే మార్గమే లేదు. కనీసం అత్యవసర పరిస్థితుల్లో ఏ అద్దాన్నైనా పగలగొట్టచ్చనే సూచికలు ఎక్కడా లేవు.
అత్యవసర కిటికీని కూడా అమర్చలేదు. స్లీపర్ కోచ్‌లలో అయితే పరిస్థితి మరీ దారుణం. అలాగే చాలా ట్రావెల్స్‌లో స్మోక్ అలారమ్‌లు లేవు. బస్సులో ఏదైనా రిపేరు వచ్చినా, ప్రమాదానికి గురైన సందర్భంలో పొగవస్తే వెంటనే అలారమ్ మోగుతుంది. ఈ క్రమంలో ప్రమాదం తీవ్రత పెరిగే లోపు ప్రయాణికులు బస్సు దిగే అవకాశం ఉంది. చాలా బస్సుల్లో ఒక్క డ్రైవరే బస్సులు నడిపే పరిస్థితి. దీంతో నిద్రకు తట్టుకోలేక ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఆర్టీసీ బస్సులో ఇద్దరు డ్రైవర్లు ఉంటారు. ఈ నిబంధనను ప్రైవేట్ ట్రావెల్స్ పట్టించుకోలేదు.
దీనిపై ఆర్టీఏ చర్యలు లేవు. చాలా ట్రావెల్స్ బస్సు టాప్‌పై భారీ లగేజీని తీసుకెళ్తున్నారు. ఇన్నాళ్లూ దీనిపై అధికారులు చర్యలు తీసుకోలేదు. వీటితో పాటు చాలా నిబంధనలకు విరుద్ధంగా బస్సులు నడుస్తున్నాయి. అయినా అధికారులు చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. బడా రాజకీయ నాయకులకు, వారి అనుచరులకే అధికశాతం ట్రావెల్స్ ఉండటంతో నిబంధనలు లేని వాటిపై అధికారులు చర్యలు తీసుకోలేకపోతున్నారు. దీంతోపాటు ఒక్కో ట్రావెల్స్ నుంచి ఆర్టీఏ అధికారులకు ప్రతి నెలా 2-3 వేల రూపాయల మామూళ్లు అందుతున్నాయని, దీంతోనే వారు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.
డీటీసీ కృష్ణవేణి ఏమన్నారంటే:
మహబూబ్‌నగర్ ఘటన తర్వాతే ఎందుకు చ ర్యలు తీసుకున్నారని, అంతకుముందు ఈ సమస్యలు మీకు తెలీదా? అని డీటీసీ కృష్ణవేణిని ‘సాక్షి’ ప్రశ్నించగా... ఏదైనా విపత్తు జరిగినప్పుడే ఆపై చర్యలకు చర్చ జరుగుతుందని, ఆ క్రమంలోనే చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. అలాగే ఆర్టీఏ కార్యాలయంలో ఎవ్వరు మామూళ్లు తీసుకుంటున్నారో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని, పుకార్లలాగా చెబితే చర్యలు తీసుకోలేమన్నారు. అన్ని బస్సులపై గట్టిగా నిఘా పెట్టామన్నారు. ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని ఇన్‌స్పెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు.