ఆకర్షణీయమైన బస్సులతో ప్రజలను ఆకట్టుకుంటూ వారి ప్రాణాలతో ప్రైవేటు ట్రావెల్స్ సంస్థలు చెలగాటమాడుతున్నాయి. కాంట్రాక్టు పర్మిట్ల పేరుతో బస్సులను స్టేజీ క్యారియర్లుగా తిప్పుతూ, ఊరూరా ప్రయాణికులను ఎక్కించుకుంటూ సింగిల్ డ్రైవర్‌తో బస్సులను వేగంగా నడుపుతూ ప్రాణాలు బలితీసుకుంటున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా ఆయా సంస్థలు దందా సాగిస్తున్నా పట్టించుకునే వారు కరువయ్యారు.
సాక్షి, నెల్లూరు: జిల్లాలో ప్రైవేటు ట్రావెల్ మాఫియా అక్రమాలకు అడ్డే లేకుండా పోతోంది. నిబంధనలతో పాటు ఆర్టీసీ రాబడికి గండి కొడుతూ ప్రయాణికుల నుంచి అందినకాడికి దోచుకుంటున్నాయి. వారి ధన దాహం, దూకుడుకు తరచూ పదుల సంఖ్యలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఒకే నంబర్ ప్లేటుతోనే పలు బస్సులు నడుపుతూ ప్రభుత్వానికి పన్నుల ఎగ్గొడుతున్నట్లు సమాచారం. ఇంత జరుగుతున్నా రవాణాశాఖ మామూళ్ల మత్తులో పడి చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏదో ఒక సంఘటన జరిగిన సమయంలో మాత్రం రెండు మూడు రోజులు బస్సులను సీజ్ చేస్తూ హడావుడి చేస్తున్నారు. తర్వాత పరిస్థితి మళ్లీ మొదటికొస్తోంది.
అక్రమ వాహనాల జోరు
రవాణాశాఖ అధికారుల లెక్కల ప్రకారం జిల్లా నుంచి 41 బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. అనధికారికంగా వాటి సంఖ్య వందకు పైగా ఉన్నట్లు తెలుస్తోంది. 29కి పైగా ట్రావెల్స్ సంస్థలు తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. వీటిలో కొన్నింటికి తాత్కాలిక అనుమతి మాత్రమే ఉంది. విహారయాత్రలు, ప్రత్యేక ప్యాకేజీలు ఉన్నప్పుడే తాత్కాలిక పర్మిట్లతో బస్సులు నడపాలి.
అయితే వీరు మూడు నెలలకోసారి తాత్కాలిక పర్మిట్లు తీసుకుంటూ ఆన్‌లై న్ టికెట్ కౌంటర్లను ఏర్పాటు చేసుకుని బస్సులను స్టేజి క్యారియర్లుగా నడుపుతున్నారు. ఇదంతా బహిరంగ రహస్యమే అయినా ఆర్టీఏ అధికారులు పట్టించుకోవడం లేదు.
అక్రమంగా ట్రావెల్స్ నిర్వహిస్తున్నవారిని నియంత్రించాల్సిన ఆ శాఖ వైఫల్యం ప్రజల ప్రాణాలను హరిస్తోంది. 1985లో ప్రజల ప్రయాణాలు పూర్తిగా ప్రభుత్వ రంగ సంస్థలే చేయాలని చట్టం వచ్చింది. ఆర్టీసీ బస్సులు మాత్రమే స్టేజి క్యారీయర్లుగా ఉండాలని ఆ చట్టంలో పేర్కొన్నారు. ఆ చట్టానికి ప్రైవేటు ట్రావెల్స్ తూట్లు పొడుస్తూ అక్రమ వ్యాపారానికి తెరదీశాయి.
నిబంధనలకు పాతర : టికెట్ కౌంటర్లు ఎన్ని ఉన్నాయో ఆర్‌టీఏ వద్ద పూర్తి వివరాలు లేవు. దాదాపు 90 శాతం వరకూ నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్నవేనని వారికి తెలుసు. ఓల్వో బస్సులు గంటకు 120 నుంచి 150 కిలోమీటర్లు వేగంతో వెళుతున్నా నియంత్రించే వారు కరువయ్యారు. ఇద్దరు డ్రైవర్ల నిబంధన రికార్డులకే పరిమితమైంది. ప్రయాణికుల వివరాలు తెలిపే జాబితాలు తప్పుల తడకగా ఉంటున్నాయి. అత్యవసర సమయాల్లో అద్దాలు పగలగొట్టేందుకు సుత్తులు, అగ్ని మాపక పరికరాలు ఉండడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా రోజూ వివిధ ప్రాంతాలకు బస్సులు నడుపుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌పై ఆర్‌టీఏ అధికారులు, పోలీసులు చర్యలు తీసుకోవడం లేదు. నిబంధనలను యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నా ఉదాసీనవైఖరి అవలంబిస్తున్నారు.
క్రమేణా పెరుగుతున్న బస్సులు
జిల్లాలో 2012-2013లో హైదరాబాదుకు 18 బస్సులు ఉండేవి. ఈ ఏడాది అవి 29కి పెరిగాయి. చెన్నైకి 10, వైజాగ్ 6, బెంగళూరుకు 10 బస్సులు నడుస్తున్నాయి. ప్రయాణికుల రద్దీని బట్టి బస్సుల సంఖ్యను పెంచుతున్నారు. నిర్ధిష్టమైన ప్రాంతాలకు పర్మిట్లు లేకుండా టెంపరరీ పర్మిట్లతో ఏ ప్రాంతానికి కావాలంటే ఆ ప్రాంతానికి అప్పటికప్పటికే బస్సులను ఏర్పాటు చేయ డం నిర్వాహకులకు అలవాటుగా మారింది. మరికొన్ని ట్రావెల్స్ నిర్వాహకులు ఒకే నంబర్, ఒకే పర్మిట్‌తో మూడు, నాలుగు బస్సులను నడుపుతున్నట్లు డ్రైవర్లే చెబుతున్నారు. మరోవైపు నిషిద్ధ వస్తువులను కూడా ఈ బస్సుల్లో యథేచ్ఛగా రవాణా చేస్తున్నారు.
గాలిలో కలుస్తున్న ప్రాణాలు
రోడ్డు ప్రమాదాల్లో ప్రజల ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. జిల్లాలో 2011లో జరిగిన ప్రమాదాల్లో 499 మంది మరణించగా, 1832 మంది క్షతగాత్రులయ్యారు. 2012లో 528 మంది మరణించగా 1827 మంది గాయపడ్డారు. 2013లో 502 మంది మరణించగా 2180 మంది గాయాలపాలయ్యారు.
ట్రావెల్ మాఫియా
Published Wed, Jan 22 2014 4:06 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
Advertisement
Advertisement