జూన్ 2 తరువాతే లావాదేవీలు
సాక్షి, అనంతపురం : బిల్లులు, ఇతరత్రా పనులపై వచ్చే వారితో నిత్యం కిటకిటలాడే జిల్లా ట్రెజరీ (ఖజానా) కార్యాలయానికి తాళం పడింది. ఈ నెలాఖరుకు రిటైర్డ్ అయ్యే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి గ్రాట్యుటీ, ఈపీఎఫ్ బిల్లులు మినహా ఏ బిల్లులూ పాస్ చేయడానికి వీలులేకుండా ఉత్తర్వులు జారీ అయ్యాయి. రాష్ట్ర ఆర్థిక లావాదేవీల ముగింపు రాష్ట్ర అపాయింటెడ్ ‘డే’ తేదీతో ముడిపడి ఉండడమే ఇందుకు కారణం. మే 21తోనే ఉద్యోగులు తమ జీతభత్యాల బిల్లులు సమర్పించే గడువు ముగిసింది.
జిల్లాలోని 17 సబ్‌ట్రెజరీ కార్యాలయాల నుంచి బిల్లుల చెల్లింపులకు తొలుత 24 చివరి తేదీగా నిర్ణయించినా... ఉద్యోగ సంఘాల వినతి మేరకు 26 వరకు పొడిగించారు. మొత్తం మీద ఐదు రోజుల ముందే జిల్లాలోని ఉద్యోగులు, పెన్షనర్లకు చెల్లింపులు చేయాల్సి రావడంతో ట్రెజరీ ఉద్యోగులు ఒత్తిడికి లోనయ్యారు.
రాష్ట్ర విభజనలో భాగంగా జూన్ 2వ తేదీని సీమాంధ్ర, తెలంగాణ (రెండు రాష్ట్రాలు) రాష్ట్రాలకు అవిర్భావ దినంగా కేంద్ర ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. ఆ రోజు నుంచి ఏ రాష్ట్రానికి సంబంధించిన లెక్కలు ఆ రాష్ట్రానివే. పాలనా వ్యవహారాలన్నీ ఆరోజు నుంచి వేర్వేరుగా జరగనున్నాయి. ఆ తేదీని దృష్టిలో ఉంచుకుని ఉద్యోగులు, పెన్షనర్ల జీతభత్యాలు, డీఏ బకాయిలు తదితర బిల్లులను మే 26లోగా పూర్తి చేయాలంటూ ఆర్థిక శాఖ నుంచి జిల్లా ఖజానా కార్యాలయానికి ఆదేశాలు వచ్చాయి.
జిల్లాలోని దాదాపు 40,300 మంది ఉద్యోగులు, 22,352 మంది పెన్షనర్లకు సంబంధించి బిల్లుల చెల్లింపులకు వారం రోజులుగా ట్రెజరీ ఉద్యోగులు కుస్తీపడ్డారు. మొత్తం మీద చివరి రోజైన సోమవారం నాటికి (26వ తేదీ) జిల్లాలోని ఉద్యోగులకు రూ.133 కోట్లు, పెన్షనర్లకు రూ.47.50 కోట్లు చెల్లింపులు చేశారు. అయితే గత నెల ఉద్యోగస్తుల జీతాలు, చెక్కులకు రూ.286 కోట్ల బిల్లుల చెల్లింపులు చేయగా ఈ నెల రూ.133 కోట్లు మాత్రమే చేశారు.
మరో విశేషమేమిటంటే ఈ ఏడాది ఉద్యోగులకు పెరిగిన డీఏ అరియర్స్ ఈ నెల చెల్లించాల్సి రావడంతో ఈ నెల ఉద్యోగులకు దాదాపు రూ.300 కోట్ల వరకు చెల్లింపులు చేయాల్సి ఉంది. అయితే రూ.133 కోట్లు మాత్రమే చెల్లింపులు చేయగా రూ.164 కోట్లు ఉద్యోగులకు చెల్లించాల్సి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కొంత మంది ఉద్యోగులు గడువు నాటికి బిల్లులు ట్రెజరీకి సమర్పించకపోవడవం వల్లే చెల్లింపులు చేయలేకపోయినట్లు ట్రెజరీ అధికారులు చెబుతున్నారు. ఇక డీఏ పెరగడంతో గత నెల పెన్షనర్లకు రూ.37.50 కోట్లు చెల్లింపులు చేయగా ఈ నెల రూ.47.50 కోట్లు చెల్లింపులు జరిగాయి.
ముందుగానే జీతాలు
ప్రభుత్వ ఉద్యోగులకు సాధారణంగా ప్రతి నెలా మూడో తేదీలోపు వేతనాలు అందుతాయి. మే నెలలో నిర్వర్తించిన విధులకు సంబంధించి జూన్ 3వ తేదీలోగా వేతనాలు అందాలి. ఈ సారి ఇందుకు భిన్నంగా మే 31 నాటికి విధులు నిర్వర్తించేందుకు సిద్ధంగా ఉంటే ఆ వేతనాన్ని కూడా కలిపి మొత్తం వేతనం ఈనెల 26 నాటికే ఉద్యోగుల ఖాతాల్లో జమ చేశారు.
ఖజానాకు తాళం!
Published Tue, May 27 2014 2:51 AM | Last Updated on Sat, Sep 2 2017 7:53 AM
Advertisement
Advertisement