శ్రీకాకుళం క్రైం, న్యూస్‌లైన్: పోలీసుల వైఫ్యలం కారణంగా జిల్లా కేంద్రమైన శ్రీకాకుళంలో రౌడీల దందాలు, దాడులు విచ్చలవిడిగా సాగుతున్నాయి. కొద్దినెలల క్రితం వరకు పట్టణంలో రౌడీరాజ్యం చెలాయించి, పత్రికల్లో వార్తలు రావడం.. పోలీసులు ఏవో కొన్ని చర్యలు తీసుకోవడంతో కొద్దికాలంపాటు మౌనం వహించిన పంచ భూతాల్లో ఒకడైన గబ్బర్ గ్యాంగ్ మళ్లీ దాడులకు తెగబడుతోంది. తనపై రౌడీ షీట్ ఉన్నా ఏమాత్రం భయపడకుండా గబ్బర్ దాడులకు దిగుతుండటం గమనార్హం. దమ్మల వీధికి చెందిన ఈ గ్యాంగ్ తాజాగా
ఆదివారం అర్ధరాత్రి ప్రశ్నించిన పాపానికి ఓ ఆటో డ్రైవర్‌పై దాడి చేసి చితక్కొట్టారు. పట్టణంలోని బొడెమ్మ కోవెల సమీపంలో నివాసముంటున్న ఆటో డ్రైవర్ మైలపిల్లి భీమారావు ఆదివారం రాత్రి 11.15 గంటల ప్రాంతంలో తన పని ముగించుకుని ఆటోలో ఇంటికి వెళుతుండగా పందుంపుల్ల సెంటర్ వద్ద గబ్బర్, అతని సోదరుడు శ్రీనివాసరావు, మరికొందరు అనుచరులు ఆపి ఆటోలో తమను ఇళ్ల వద్ద దిగబెట్టాలని డిమాండ్ చేశారు.
మీ అందరి వద్ద బళ్లు ఉన్నాయి కదా.. ఆటోలో దిగబెట్టడమేమిటని భీమారావు వారిని ప్రశ్నించాడు. అంతే.. మమ్మల్నే ఎదురు ప్రశ్నిస్తావా అంటూ ఆ గ్యాంగ్ భీమారావుపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు.దాంతో అతని శరీరంపై చాలా చోట అవుకు దెబ్బలు తగలగా, కింది పెదవి పూర్తిగా చిట్లిపోయింది. గాయాలతో రిమ్స్‌లో చేరిన బాధితుడి నుంచి అక్కడి ఔట్ పోస్టు పోలీసులు వివరాలు సేకరించారు. తనపై దమ్మల వీధికి చెందిన రాయితి గబ్బర్, రాయితి శ్రీనివాసరావు, దుమ్ము అప్పన్న(కలస అప్పన్న), వాడల రాంబాబు(పొట్టి రాంబాబు)తో పాటు మరికొంత మంది దాడి చేశారని భీమారావు పోలీసులకు చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న గబ్బర్ ముఠా ఆస్పత్రికి వచ్చి కేసు విత్‌డ్రా చేసుకోకపోతే చంపేస్తామని బెదిరించారు. ‘మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు.. ఏ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా ఫర్వాలేదు.. ఎంతైనా ఖర్చు పెట్టి బయటకు రాగలమంటూనే కేసు విత్‌డ్రా చేసుకోకపోతే నిన్ను చంపేసి కేసు లేకుండా చేసుకోగలమని’ బెదరించారు.
దీంతో రిమ్స్‌లో తనకు రక్షణ ఉండదని భయపడిన భీమరావు సోమవారం ఉదయం శ్రీకాకుళం ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌కు వెళ్లి మళ్లీ ఫిర్యాదు చేశాడు. తనను కొట్టిన వారిలో బర్రి మురళీ, తోటయ్య కూడా ఉన్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
వెలుగులోకి ఓ మహిళ ఆత్మహత్యాయత్నం
గబ్బర్ ముఠా ఆగడాలు ప్రజలను ఎంతగా భయపెడుతున్నాయో చెప్పడానికి మరో ఉదాహరణ.. వీరి కారణంగానే ఇటీవల ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన. శ్రీకాకుళం ఒకటో పట్టణ పరిధిలో పని చేస్తున్న ఓ హోంగార్డు భార్య పట్ల ఇటీవల గబ్బర్ అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలిసింది. దీంతో ఆమె ఆత్మహత్య చేసుకోవటానికి ప్రయత్నించింది. కుటుంబ సభ్యులు గమనించి అడ్డుకున్నారు. దీనిపై ఆ హోంగార్డు వెంటనే ఒకటో పట్టణ పోలీసు స్టేషన్‌లో తమ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్లు కూడా సమాచారం. అయితే ఏం జరిగిందో గానీ.. ఆ సంఘటనపై కేసే లేకుండా పోయింది. వెలుగులోకి రాని ఇటువంటి దారుణాలు ఎన్నో గబ్బర్ ముఠా ఖాతాలో ఉన్నాయని తెలుస్తోంది. ఈ ముఠా దాడులు, ఆగడాలతో బయట తిరగాలంటేనే భయమేస్తోందని దమ్మల వీధి పరిసర ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రతి చిన్న విషయంలోనూ ఈ ముఠా జోక్యం చేసుకుని అమాయకులను చితకబాదేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కేసులు నమోదై, అరెస్టు అయినా.. ఇలా వెళ్లి.. అలా బయటకు వచ్చేసి.. మరింతగా రెచ్చిపోతున్నారని.. అందువల్ల పోలీసులకు ఫిర్యాదు చేయాలన్న భయమేస్తోందని వాపోతున్నారు.
నిందితుల అరెస్టు
కాగా ఆటో డ్రైవర్ భీమరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాయితి గబ్బర్, రాయితి శ్రీనివాసరావు, దుమ్ము అప్పన్న, వాడల రాంబాబులపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు శ్రీకాకుళం ఒకటో పట్టణ ఎస్సై భాస్కరరావు తెలిపారు.