మళ్లీ ఒత్తిళ్లు
కర్నూలు(అర్బన్) : కర్నూలు-కడప (కేసీ) కెనాల్ వాటా నీటిని మళ్లీ తన్నుకుపోయేందుకు అనంతపురం జిల్లా నేతలు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకువస్తున్నట్లు సమాచారం. ఇదే జరిగితే కేసీ ఆయకట్టు కింద ప్రస్తుతం సాగులో వున్న 1.32 లక్షల ఎకరాల్లో వేసిన పంటల పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది. వాస్తవంగా కర్నూలు జిల్లాకు కేసీ వాటాగా 6.5 టీఎంసీల నీరు రావాల్సి వుండగా, అనేక ఒడిదుడకులు, రాజకీయ ఒత్తిళ్ల మధ్య కేవలం 2.50 టీఎంసీల నీటిని మాత్రమే విడుదల చేసేందుకు ప్రభుత్వం అంగీకరించింది.
ఈ నేపథ్యంలోనే ఈ నెల 10వ తేదీ నుంచి టీబీ డ్యామ్ నుంచి రోజుకు 1600 క్యూసెక్కుల నీరు తుంగభద్ర నదికి విడుదల చేస్తూ వచ్చారు. ఈ నీటి సరఫరా ఈ నెల 19వ తేదీ రాత్రి ఆగిపోయింది. మొత్తం 0.90 టీఎంసీల నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం సుంకేసుల జలాశయంలో వున్న నీరు కేవలం మరో మూడు రోజులకు మించి సరఫరా కాని పరిస్థితి ఉంది. ఇంకా జిల్లాకు 1.60 టీఎంసీల నీరు టీబీ డ్యామ్ నుంచి విడుదల కావాల్సి వుంది.
అయితే ఈ నీటిని కూడా మళ్లించుకునేందుకు రాజకీయ పార్టీలకు అతీతంగా అనంతపురం జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు ద్వారా నీటి పారుదల శాఖ ఈఎన్‌సీపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం, ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీలకు అతీతంగా కేసీ వాటా నీరు అనంతకు మళ్లకుండా చర్యలు తీసుకోకుంటే కేసీ కెనాల్ కింద చేతికొచ్చిన కోట్లాది రూపాయల విలువ చేసే మిర్చి, పసుపు తదితర పంటలను రైతులు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. కేసీ కెనాల్ నీటిని అనంతపురం జిల్లాకు మళ్లిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని కేసీ రైతులు హెచ్చరిస్తున్నారు.