సమైక్యం కోసం సమస్తం బంద్
Published Sun, Sep 15 2013 1:30 AM | Last Updated on Sun, Apr 7 2019 4:30 PM
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా, సమైక్యాంధ్రకు మద్దతుగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, చాంబర్ ఆఫ్ కామర్స్(నాన్‌పొలిటికల్ జేఏసీ)సంఘాల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో జిల్లాలో జరిగిన 48 గంటల బంద్ విజయవంతమైంది. సమైక్య రాష్ట్రం కోసం సమస్తం బంద్ చేసి నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రమైన విజయనగరం పట్టణంతో పాటు జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణాల్లో, మండల కేంద్రాల్లో, గ్రామాల్లో ప్రజలు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, వర్తకులు, విద్యార్థులు, కార్మికులు, పింఛనుదారులు, న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు, ఆర్టీసీ ఉద్యోగులు, విద్యుత్ శాఖ ఉద్యోగులు ఇలా అన్ని వర్గాల ప్రజలు, అన్ని సంఘాల ఉద్యమకారులు బంద్‌ను విజయవంతం చేసేందుకు తమ వంతు పాత్ర పోషించారు.
శుక్రవారం అర్ధరాత్రి నుంచి శనివారం అర్ధరాత్రి వరకూ బంద్ కొనసాగింది. ఉద్యమకారులంతా రెండో రోజూ కూడా తెల్లవారుజాము నుంచే రోడ్లెక్కారు. హోటళ్లు, పెట్రోల్ బంక్‌లు, వ్యాపార వాణిజ్య సముదాయాలు, విద్యాలయాలు, కళాశాలలు, బ్యాంక్‌లు, పాన్‌షాపులు, సినిమా థియేటర్లు స్వచ్ఛందంగా మూసివేశారు. ఆటోలు, మేక్సీక్యాబ్‌లు, టాటా ఏస్ వంటి వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. ప్రైవేట్ నర్సింగ్ హోంలు, ప్రభుత్వ ఆస్పత్రులు, డిస్పెన్సరీలు సైతం ఎమర్జెన్సీ కేసులు మినహా మిగిలిన కేసులకు వైద్యం అందించకుండా వైద్యులు, సిబ్బంది బంద్‌లో భాగస్వాములయ్యారు. అత్యవసరంగా ప్రయాణం చేయాల్సిన వారు ద్విచక్ర వాహనాలపైనే వెళ్లాల్సి వచ్చింది.
జిల్లా కేంద్రంలోని ప్రధాన రోడ్లు, మార్కెట్ ప్రాంతాల్లో జన సంచారం లేక నిర్మానుష్యంగా మారాయి. జిల్లాలోని బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం, చీపురుపల్లి, ఎస్.కోట పట్టణాలతో పాటు అన్ని మండల కే్రందాలు, గ్రామాల్లో సైతం శనివారం నాటి బంద్ కూడా విజయవంతంగానే ముగిసింది. ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి వాహనాలను ఎక్కడికక్కడే నిలిపివేశారు. కేంద్ర ప్రభుత్వ శాఖలైన బీఎస్‌ఎన్‌ఎల్, తపాలా కార్యాలయాలను ముట్టడించి ఉద్యోగులు విధులకు హాజరుకాకుండా అడ్డుకున్నారు. నాన్‌పొలిటికల్ జేఏసీ కన్వీనర్ గంటా వెంకటరావు, ఉద్యోగ సంఘాల జేఏసీ కన్వీనర్ ప్రభూజీ,
రెవెన్యూ అసోసియేషన్ రాష్ర్టసహ అధ్యక్షుడు పేడాడ జనార్దనరావు, ఎర్నాయుడు, పింఛనర్ల సం ఘం జిల్లా అధ్యక్షుడు పెద్దింటి అప్పారావు, ఉపాధ్యాయ సంఘాల జేఏసీ చైర్మన్ ఈశ్వరరావు, ఆర్టీసీ ఉద్యోగుల జేఏసీ ప్రతినిధి శ్రీనివాసరాజు, భానుమూర్తి, బి. ఎల్.నారాయణ, న్యాయవాదుల సంఘ ప్రతినిధులు గేదెల రామ్మోహనరావు, శివప్రసాద్, కె.వి.ఎన్.తమ్మన్నశెట్టి, న్యాయశాఖ ఉద్యోగులు జేఏసీ ప్రతినిధులు బొత్స రమేష్, సుభద్రాదేవి తదితరుల ఆధ్వర్యంలో రెండో రోజు జిల్లాబంద్ ప్రశాంతంగానే ముగిసిం ది. జిల్లావ్యాప్తంగా రెండోరోజు కూడా బ్యాంకులు, ఎల్‌ఐసీ కార్యాలయాల్లో లావాదేవీలు నిలిచిపోవడంతో రూ.150 కోట్ల రూపాయల లావాదేవీలకు బ్రేక్‌పడింది.
స్తంభించిన రవాణా వ్యవస్థ
ఆటోల నుంచి లారీల వరకూ ఇలా అన్ని వాహనాల చక్రాలకు బ్రేకులు పడ్డాయి. యజమానులు, డ్రైవర్లు స్వచ్ఛందంగా బంద్‌కు మద్దతు ప్రకటించటంతో జిల్లావ్యాప్తంగా 30 వేల వాహనాలు రెండు రోజుల పాటూ ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సొంత వాహనాల ద్వారా వచ్చిన ప్రయాణికులను సైతం అడ్డుకున్నారు. బంద్‌పై ముందే సమాచారం ఉండడంతో జనసంచారం కూడా పెద్దగా కన్పించలేదు. జిల్లా సరిహద్దుల్లో ఉన్న జాతీయ రహదారులను దిగ్బంధించారు. ప్రధానంగా రైళ్ల మార్గాల ద్వారా వచ్చే ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు.
బోసిపోయిన వస్త్ర..
వాణిజ్య సముదాయాలు..
జిల్లాలో హోల్‌సేల్ దుకాణాలతో పాటూ రెండు వేల వరకూ షాపులు మూతపడ్డాయి. రైతు బజార్లలో సైతం కూరగాయల దుకాణాలను తెరవలేదు. బాలాజీ మార్కెట్‌తో పాటూ జిల్లావ్యాప్తంగా ఉన్న 700 వస్త్ర దుకాణాలు, 250 బంగారం దుకాణాలు మూతపడ్డాయి. దీంతో సుమారు 28 కోట్ల లావా దేవీలు నిలిచి పోయాయి.
బంకులు బంద్..
జిల్లావ్యాప్తంగా ఉన్న 62 పెట్రోల్ బంకులు 48 గంటల పాటూ మూతపడ్డాయి. దీంతో మోటారు సైకిళ్లకు సైతం పెట్రోల్ లేక ప్రజలు అవస్థలు పడ్డారు. జిల్లావ్యాప్తంగా రెండు రోజుల్లో రెండు లక్షల లీటర్ల పెట్రోల్, మూడు లక్షల లీటర్ల డీజిల్ వినియోగం జరుగుతుంది. బంద్‌తో ఆ వ్యాపారం నిలిచిపోయింది. 160 మద్యం దుకాణాలు, 60 బార్లు తెరుచుకోలేదు. సమైక్య బంద్ నేపథ్యంలో వినోదానికి ఆటంకం ఏర్పడింది. జిల్లావ్యాప్తంగా ఉన్న సినిమా థియేటర్లలో రెండు రోజుల పాటూ ఉదయం, మధ్యాహ్నం ఆటలు నిలిపి వేశారు. టీస్టాల్స్ నుంచి హోటల్స్, రెస్టారెంట్లు వరకూ అన్నీ మూతపడ్డాయి.
Advertisement
Advertisement