సమైక్య బంద్ సంపూర్ణం
Published Wed, Sep 25 2013 1:27 AM | Last Updated on Tue, Mar 19 2019 7:00 PM
సాక్షి, రాజమండ్రి :సమైక్య భావన మరోసారి బలంగా వెల్లడైంది. ఏపీఎన్‌జీఓల పిలుపుతో మంగళవారం జిల్లాలో బంద్ సంపూర్ణంగా సాగింది. అన్ని వర్గాల వారు బంద్‌కు స్వచ్ఛందంగా సహకరించారు. సమైక్యవాదులు ఎక్కడికక్కడ రహదారులను దిగ్బంధించడంతో జనం రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. నిరాహార దీక్షలు, రాస్తారోకోలు, మానవహారాలు, ర్యాలీలు, వంటా వార్పులు కొనసాగాయి. సకల జనులు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొని సమైక్య సమరంలో సడలింపు లేదని స్పష్టం చేశారు. జిల్లాలోని 19 నియోజకవర్గాల్లో బంద్ విజయవంతంగా జరిగింది. పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. వాహనాల రాకపోకలను సమైక్య వాదులు అడ్డుకున్నారు. ఎక్కడికక్కడ ప్రధాన రహదారులలో టైర్లను అడ్డువేసి రాకపోకలను అడ్డుకున్నారు. బంద్ సందర్భంగా జిల్లాలో జనజీవనం స్తంభించింది. సోమవారం అర్ధరాత్రి నుంచి ఆర్‌అండ్‌బీ ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగారు.
రాజమండ్రిలో
రాజమండ్రిలో సమైక్యాంధ్రకు మద్దతుగా ఏపీ ఎన్‌జీఓల ఆధ్వర్యంలో బంద్ పూర్తిగా సాగింది. పాఠశాలల దగ్గర నుంచి అన్నీ సంస్థలూ మూత పడ్డాయి. ఆటోస్టాండు వర్కర్స్ ఆధ్వర్యంలో నగరంలో మోటారు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఇంటర్ బోర్డు సిబ్బంది జూనియర్ కళాశాల వద్ద రాస్తారోకో చేసి రెండుగంటల పాటు ట్రాఫిక్‌ను స్తంభింపచేశారు. సమైక్యవాదులు ఎక్కడికక్కడ రోడ్లను బ్లాక్ చేసి సమైక్య పతాకాలతో ఊరేగింపు చేపట్టారు. కోటగుమ్మం, కంబాలచెరువు, కోటిపల్లి బస్టాండ్ సెంటర్లలో మానవహారాలుగా ఏర్పడి నినాదాలు చేశారు. ఉద్యమానికి మద్దతుగా నగరపాలక సంస్థ సిబ్బందికి రూ. 10,000 ఆర్థిక సహాయాన్ని మంచాల బాబ్జీ అందచేశారు. సమైక్యాంధ్ర ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో దీక్షలు ప్రారంభించారు. పశువుల ఆస్పత్రి ఆవరణలో కొనసాగుతున్న పశుసంవర్థక శాఖ సిబ్బంది దీక్షలకు స్టిక్కరింగ్ దుకాణ నిర్వాహకుల సంఘం మద్దతు తెలిపింది. మోరంపూడి సెంటర్‌లో ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై మానవహారంగా ఏర్పడి ధర్నా చేశారు. బంద్ సందర్భంగా వేమగిరిలో ఏపీ ఎన్‌జీఓలు హైవేను ముట్టడించారు. రోడ్డుపై కోలాటం ఆడి నిరసన తెలిపారు.
కాకినాడలో
కాకినాడ నగరంలో బంద్ సంపూర్ణంగా సాగింది. పెట్రోల్ బంకులు సినిమాహాళ్లు మూతపడ్డాయి. కాకినాడ పోర్టు కార్యకలాపాలను సమైక్యవాదులు అడ్డుకున్నారు. గత అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వచ్చిన ఆర్‌అండ్‌బీ ఉద్యోగులు దీక్షలు చేపట్టారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు నగరంలో ర్యాలీ చేశారు. ప్రభుత్వ వైద్యుల సంఘం జీజీహెచ్ ఆవరణలో నిరసన ప్రదర్శన నిర్వహించింది. న్యాయవాద గుమాస్తాలు పంచికట్టుకుని చెవిలో పువ్వులు ధరించి నిరసన తెలిపారు. దేవాదాయ శాఖ కార్యాలయం ఎదురుగా రామారావుపేటలో ఉద్యోగులు రోడ్లపై ముగ్గులు వేసి సమైక్యాంధ్రకు మద్దతు పలికారు. నూకాలమ్మ గుడి సెంటర్‌లో పాన్‌షాప్ నిర్వాహకుల సంఘం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు.
కోనసీమలో
అమలాపురం తహసీల్దారు నక్కా చిట్టిబాబుతో పాటు రెవెన్యూ సిబ్బంది, కార్యదర్శులు, వీఆర్‌ఓలు, జర్నలిస్టులు.. శ్రీకృష్ణదేవరాయలు, భగత్‌సింగ్, పొట్టి శ్రీరాములు, పౌరాణిక పాత్రలైన దుర్యోధనుడు , శకుని తదితర వేషధారణలతో గడియారం స్తంభం సెంటర్‌లోని జేఏసీ రిలే దీక్షా శిబిరం వద్ద సమైక్య ప్రదర్శన చేశారు. అనంతరం అమలాపురం సిటీ, రూరల్, ఉప్పలగుప్తం మండలాల్లో ర్యాలీ నిర్వహించారు. బంద్‌ను పురస్కరించుకుని ఏపీఎన్‌జీఓలు ప్రధాన రహదారులు, వంతెనల వద్ద వాహనాలు అడ్డుపెట్టి రాకపోకలు స్తంభింపచేశారు. వ్యాపార సంస్థలు, పాఠశాలలు మూత పడ్డాయి. ఏరియా ఆస్పత్రి ఉద్యోగులు భారీ ర్యాలీ చేశారు.
ఆటో యూనియన్ నేతలు కొత్తపేటలో నిరసన ర్యాలీ చేశారు. పాతబస్టాండ్ సెంటర్‌లో వాలీబాల్, కబడ్డీ, కోకో, షటిల్ తదితర ఆటలు ఆడి ఉద్యోగులు నిరసన తెలిపారు. మారుతీ సెంటర్‌లో ఉపాధ్యాయులు రోడ్డుపై వంటా వార్పూ చేశారు. ఏనుగులమహల్‌లో ఆటో కార్మికులు దీక్షలు చేపట్టారు. కొత్తపేటలో మార్కెట్ కమిటీ సభ్యులు దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి డేవిడ్‌రాజు, తెలుగుదేశం నేతలు మద్దతు పలికారు. రావులపాలెం జాతీయ రహదారిపై విద్యార్థులు, ఉద్యోగులు మానవహారంగా ఏర్పడి సమైక్య నినాదాలు చేశారు. మామిడికుదురులో జాతీయ రహదారిని దిగ్బంధించి రోడ్డుపై టెంట్‌వేసి జేఏసీ సభ్యులు రిలే దీక్షలు కొనసాగించారు. అయినవిల్లి మండలం ముక్తేశ్వరంలో బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో రోడ్డుపై శాంతిహోమం నిర్వహించారు. రాజోలు నియోజకవర్గంలో బంద్ సంపూర్ణంగా సాగింది. ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో దిండి వద్ద 216 జాతీయ రహదారి దిగ్బంధించారు. టేకిశెట్టిపాలెంలో ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రహదారుల దిగ్బంధం చేశారు.
ఎడ్లబండ్లతో ర్యాలీ
పెద్దాపురంలో రైతులు ఎడ్లబండ్లతో ర్యాలీ నిర్వహించారు. వ్యవసాయశాఖ ఉద్యోగులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా సామర్లకోట స్టేషన్ సెంటర్‌లో ఎన్‌న్‌సీసీ క్యాంప్ ఫైర్ చేపట్టారు. తుని వద్ద ఏపీఎన్‌జీఓలు జాతీయ రహదారిని దిగ్భంధం చేశారు. కత్తిపూడిలో జాతీయ రహదారిపై టీడీపీ వంటా వార్పూ చేపట్టింది. ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబు పాల్గొన్నారు. ప్రత్తిపాడులో జేఏసీ ఆధ్వర్యంలో జాతీయ రహదారులు దిగ్బంధించారు. ఏలేశ్వరంలో జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో, దీక్షలు జరిగాయి. జగ్గంపేటలో గాయత్రి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో హోమం నిర్వహించారు. వివేకానంద పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు జగ్గంపేట - పెద్దాపురం రోడ్డులో సేవ్ ఆంధ్రప్రదేశ్ అక్షరాకారంలో నిలబడ్డారు. వివేకానంద యూత్ సభ్యులు గండేపల్లి నుంచి జగ్గంపేట వరకూ పాదయాత్ర చేశారు. రామచంద్రపురంలో టీచర్లు మున్సిపల్ కార్యాలయం వద్ద కబడ్డీ ఆడారు. కె.గంగవరంలో ఉపాధ్యాయులు మానవహారంగా ఏర్పడి సమైక్య నినాదాలు చేశారు.
వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో
రాజమండ్రి కోటగుమ్మం సెంటర్‌లో వైఎస్సార్‌సీపీ చేపట్టిన దీక్షా శిబిరాలకు ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి టి.కె.విశ్వేశ్వరరెడ్డి మద్దతు పలికారు. రాజానగరంలో ఆటో రిక్షా సంఘాలు చేపట్టిన రిలే దీక్షలకు సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి సంఘీభావం తెలిపారు. మామిడికుదురులో వైఎస్సార్‌సీపీ చేపట్టిన రిలే దీక్షలు 36వ రోజుకు చేరుకున్నాయి. రైతు విభాగం రాష్ట్ర కమిటీ సభ్యులు జక్కంపూడి తాతాజీ, కో ఆర్డినేటర్ మందపాటి కిరణ్‌కుమార్ పాల్గొన్నారు. పెద్దాపురంలో జేఏసీ, న్యాయవాదుల దీక్షా శిబిరాలకు మద్దతు తెలిపి వైఎస్సార్‌సీపీ నేతలు బంద్‌లో పాల్గొన్నారు. ఏలేశ్వరంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పార్టీ నేత అలమండ చలమయ్య ఆధ్వర్యంలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. వైఎస్సార్‌సీపీ కాజులూరులో సమైక్యాంధ్రకు మద్దతుగా ర్యాలీ నిర్వహించింది. రామచంద్రపురంలో జేఏసీ చేపట్టిన రహదారుల దిగ్బంధం కార్యక్రమంలో పాల్గొన్నారు. మలికిపురంలో పార్టీ రిలే దీక్ష లు కొనసాగుతున్నాయి.
Advertisement
Advertisement