సీఎం నిర్ణయంపై మంత్రి గంటా, విశాఖ టీడీపీ ఎమ్మెల్యేల అసంతృప్తి
విశాఖపట్నం: విశాఖజిల్లా ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతులివ్వాలన్న సీఎం చంద్రబాబు నిర్ణయానికి స్వపక్షం నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉండి బాక్సైట్ తవ్వకాలు వ్యతిరేకించి తీరా ఇప్పుడు అధికారంలోకి వచ్చాక సమ్మతిస్తే ప్రజల్లో అభాసుపాలవుతామని సొంత పార్టీ మంత్రులతోపాటు ఎమ్మెల్యేలు సీఎం నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు.మన్యంలో మళ్లీ మావోయిస్టులు బలపడేందుకు స్వయంగా ప్రభుత్వమే పూనుకున్నట్లు అవుతుదంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విశాఖ అభివృద్ధిపై చర్చించడానికి మంత్రి గంటాశ్రీనివాసరావు ఆదివారం పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. ఇందులో ప్రజాప్రతినిధులంతా ప్రభుత్వం నిర్ణయాన్ని తప్పుబట్టారు. సీఎంను కలిసి వాస్తవాలు వివరించి నిర్ణయం ఉపసంహరించేలా చేయాలని తీర్మానించారు. ‘విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు.
ఇప్పుడు ఆదిశగా ప్రయత్నిస్తున్నారు. ఇది సరికాదు. ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉండగా తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమించి పోరాటం చేసింది మనమే. ఇప్పుడు ్ల గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను మనమే చేస్తే ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడుతుంది. ఎమ్మెల్యేలు, మంత్రులు కలిసి సీఎం బాబును కలుద్దాం.తవ్వకాలకు అనుమతులు ఇవ్వకుండా ఒప్పిద్దాం. వాస్తవాలు వివరించకపోతే ఆతర్వాత నష్టపోయేది మనమే’.. అంటూ ఎమ్మెల్యేలంతా ముక్తకంఠంతో గంటాకు వివరించారు. దీంతో ఆయనకూడా నేతల అభిప్రాయంతో ఏకీభవించారు. భేటీకి మంత్రి అయ్యన్న లేకున్నా ఆయన కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారని పలువురు ప్రజాప్రతినిధులు మంత్రి గంటా దృష్టికి తీసుకువచ్చారు.
ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాలను ఒప్పుకోవద్దు
Published Mon, Sep 8 2014 12:07 AM | Last Updated on Wed, Apr 3 2019 9:27 PM
Advertisement
Advertisement