నా బిడ్డనూ కువైట్‌లో అమ్మేశారు | Agents fraud a woman in chittoor | Sakshi
Sakshi News home page

నా బిడ్డనూ కువైట్‌లో అమ్మేశారు

Published Mon, Jun 12 2017 9:34 PM | Last Updated on Mon, Aug 13 2018 3:11 PM

Agents fraud a woman in chittoor

చిత్తూరు: పిల్లలు పుట్టలేదని భర్త వేధించడంతో భరించలేక ఓ మహిళ పుట్టింటికి చేరుకుంది. ఇదే అదునుగా భావించి ఏజెంట్లు రంగ ప్రవేశం చేశారు. ఆ అమ్మాయికి మాయమాటలు చెప్పి కువైట్ కు పంపించారు. కువైట్ చేరుకున్న కొద్ది రోజుల్లోనే మోసపోయానని గ్రహించిన ఆ మహిళ అక్కడి నుంచి ఒకసారి తన తల్లికి ఫోన్ చేసి తన గోడు వెల్లబోసుకుంది. తనను ఒక షేక్ కు అమ్మేశారని, ఆ షేక్ తనను చిత్రహింసలకు గురిచేస్తున్నాడంటూ కన్నీరుమున్నీరైంది. ఇది జరిగి మూడేళ్లవుతుంది. ఆ తర్వాత ఆమె నుంచి ఎలాంటి సమాచారం లేదు. ఆ మహిళ ఉందో లేదో తెలియని అగమ్యగోచరమైన పరిస్థితుల్లో తల్లిదండ్రులు అల్లాడుతున్నారు.

చిత్తూరు జిల్లా కురబలకోట మండలం అరవిందపురం గ్రామానికి చెందిన కొండగంటి జయరాజ్, మణెమ్మ దంపతుల ఒక్కగానొక్క కుమార్తె మల్లిక. ఆమెను మదనపల్లెకు చెందిన ఆనంద్ అనే వ్యక్తితో 15 ఏళ్ల కిందట పెళ్లి చేశారు. అయితే సంతానం లేకపోవడంతో భర్త వేధింపులు ఎక్కువయ్యాయి. కొన్నేళ్లపాటు సహనం వహించినా భరించలేని స్థితితో మల్లిక తిరిగి పుట్టింటికొచ్చింది. దాంతో కొందరు ఏజెంట్లు వచ్చి మల్లికకు మాయమాటలు చెప్పడం ప్రారంభించారు. జిల్లాకు చెందిన చాలా మంది కువైట్ వెళ్లారని, అక్కడ మంచి జీతం వస్తుందని, జీవితం మారిపోతుందంటూ అనేక రకాలుగా మభ్యపెట్టడం ప్రారంభించారు. వారి మాటలు నమ్మి మల్లిక కువైట్ పయనమైంది. అంతే అక్కడికి వెళ్లిన తర్వాత గానీ తనను కువైట్ లోని ఒక వ్యక్తికి విక్రయించారని గ్రహించింది.

ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు సోమవారం డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ ను కలిసి ఫిర్యాదు చేశారు. కురబలకోటకు చెందిన ఏజెంట్లు నజీర్, జాకీర్‌లు తన బిడ్డ మల్లికను కువైట్‌కు పంపించి అక్కడ ఒక సేట్‌కు అమ్మేశారని చెప్పారు. ఆరు నెలల కిందట తన కూతురు ఫోన్‌లో మాట్లాడి తన గోడును వినిపించిందనీ, కువైట్ లో తన బిడ్డను చిత్రహింసలు పెడుతున్నారని వెల్లబోసుకున్నారు. తన దేశానికి వెళ్లిపోతానంటే రెండు లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్నారనీ, సేట్‌కు రూ.2 లక్షలు చెల్లించి తనను వెంటనే తీసుకెళ్లాలని వేడుకున్నా ఏజెంట్లు నా బిడ్డకు న్యాయం చేయలేదంటూ మల్లిక తల్లి డీఎస్పీ ముందు వివరించారు.

మదనపల్లె బసినికొండ కాలనీకి చెందిన వెంకటరమణ భార్య రాణిని 10 రోజుల క్రితం  ఏజెంట్లు జాకీర్, నజీర్‌లు కువైట్‌కు పంపారని... ఆమె వెళ్లిన 6 రోజులకే అక్కడి చనిపోయినట్టు పత్రికల్లో రావడంతో అందుకు కారకులైన ఆ ఇద్దరు ఏజెంట్లే తమ బిడ్డకు కూడా తీరని మోసం చేసినట్లు ఫిర్యాదులో పేర్కొంది. ఏజెంట్లను కఠినంగా శిక్షించి మోసపోయిన తమకు న్యాయం చేయాలని బాధిత మహిళ తల్లి రాణెమ్మ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement