భువనేశ్వర్ పోలీసుల అనుమానం
కాకినాడలో విచారణ పోలీసుల అదుపులో ముగ్గురు?
కాకినాడ క్రైం : విశాఖ స్టీల్‌ప్లాంట్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఐ.ఎస్. ప్రసాదరావు హత్యకేసులో కాకినాడ యువకుల హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ఏజీఎం ప్రసాదరావు రియల్ ఎస్టేట్ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తుండేవారు. ఆయన ఈ నెల మొదటివారంలో ఒడిశా రాష్ట్రం భువనేశ్వర్ వెళ్లారు. అక్కడ ఆయన కనిపించకుండా పోవడంతో కుటుంబ సభ్యులు అదృశ్యమైనట్లు ఫిర్యాదు చేశారు. అయితే ఈ నెల 4న భువనేశ్వర్‌లో అతని మృతదేహం లభ్యమైంది. ప్రత్యర్థులు అతనిని హత్య చేసినట్టుగా అక్కడి పోలీసులు కేసు నమోదు చేశారు.
కీలక ఆధారాలు సేకరించిన వారు హత్యలో కాకినాడకు చెందిన ముగ్గురు యువకులు హస్తం ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఈ మేరకు గురువారం భువనేశ్వర్ పోలీసులు కాకినాడ చేరుకున్నారు. ఏఎస్పీ దామోదర్‌కు కేసు వివరాలు తెలియజేసి, సహకరించాల్సిందిగా కోరారు. ఆయన ఆదేశాల మేరకు కాకినాడ పోలీసులు భువనేశ్వర్ పోలీసులను పలు ప్రాంతాలకు తీసుకువెళ్లి విచారణ నిర్వహించారు. కాకినాడ జగన్నాథపురానికి చెందిన ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే భువనేశ్వర్ పోలీసులు, స్థానిక పోలీసులు ఈ విషయాన్ని ధ్రువీకరించడం లేదు. ఇదిలా ఉంటే భువనేశ్వర్ పోలీసులు వచ్చి ఇక్కడ విచారణ చేపట్టడంతో స్థానికంగా కలకలం రేగింది.
స్టీల్‌ప్లాంట్ ఏజీఎం హత్య కేసులో కాకినాడ యువకులు!
Published Fri, Jan 30 2015 2:09 AM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM
Advertisement
Advertisement