అది 32.52 లక్షల మంది ఆత్మఘోష.. 8 లక్షల మంది ఏజెంట్ల మనోవేదన.. ఏడు రాష్ట్రాలను కుదిపేస్తున్న కుంభకోణం.. అధిక వడ్డీకి ఆశపడిన చిరుజీవుల నుంచి డిపాజిట్లు సేకరించి నిండా ముంచేశారు.. వేల కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేశారు. ఆ డబ్బుతో ఆస్తులు కొన్నారు. ఆ ఆస్తులను అమ్మి బాధితులను కష్టాల నుంచి గట్టెక్కించాల్సిన ప్రభుత్వ పెద్దలు వాటిని అక్రమంగా దక్కించుకునే ఎత్తులు వేస్తున్నారు. అసలు ఆస్తులు ఉన్నాయా.. బ్యాంకుల్లో డబ్బు ఏమైంది? నాలుగేళ్ల నుంచి నిరవధికంగా పోరాడుతున్న అగ్రిగోల్డ్ బాధితుల గోడు వినేదెవరు? పదివేల కోట్ల రూపాయల అగ్రిగోల్డ్ కుంభకోణంలో ఇప్పటివరకు చోటు చేసుకున్న పరిణామాల సమాహారమిది.
సాక్షి, అమరావతి: అతిపెద్ద ఆర్థిక కుంభకోణంగా సంచలనం రేపిన అగ్రిగోల్డ్ వ్యవహారంలో ఏళ్లు గడుస్తున్నా బాధితులకు న్యాయం దక్కడం లేదు. దేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన లక్షలాది మంది చిరుద్యోగులు, రైతులు, సామాన్య ప్రజలు పైసా పైసా కూడబెట్టిన సొమ్మును 1995 నుంచి అగ్రిగోల్డ్ సంస్థలో డిపాజిట్ చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఒడిశా, పశ్చిమబెంగాల్, అండమాన్–నికోబార్ దీవులకు చెందిన 32,52,632 మంది ఖాతాదారులు, మరో 8 లక్షల మంది ఏజెంట్లు రూ.7,623 కోట్లు పెట్టుబడులు పెట్టారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 19,43,497 మంది ఖాతాదారులు రూ.3,965 కోట్లు డిపాజిట్లు చేశారు. ప్రజల నుంచి వసూలు చేసిన మొత్తాలతో అగ్రిగోల్డ్ యాజమాన్యం ఆంధ్రప్రదేశ్‌తోపాటు పలు రాష్ట్రాల్లో వేలాది ఎకరాల భూములను కొనుగోలు చేయడంతోపాటు పెద్ద ఎత్తున ఆస్తులను కూడబెట్టింది. ప్రజల సొమ్మును రియల్‌ఎస్టేట్, అగ్రిఫామ్స్, హాయ్‌ల్యాండ్, బయో ప్రాడక్ట్ ప్రాజెక్టులు, అగ్రి మిల్క్ తదితర 156 అనుబంధ సంస్థలకు మళ్లించింది. ప్రజలకే కాకుండా ఆంధ్రా బ్యాంక్, ఎస్‌బీఐ, కేవీబీ తదితర బ్యాంకులకు రూ.391 కోట్ల మేర ఎగనామం పెట్టింది. ప్రజల నుంచి రూ.వేల కోట్లు గుంజి 2014 నుంచి తిరిగి చెల్లించకుండా బోర్డు తిప్పేసింది.
మొదటి కేసు నెల్లూరులో..
అగ్రిగోల్డ్ మోసంపై 2014, డిసెంబర్ 24న నెల్లూరు త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో మొట్టమొదటి కేసు నమోదైంది. అగ్రిగోల్డ్ మోసాలపై దేశంలో 29 కేసులు నమోదుకాగా ఏపీలో 15 కేసులు, తెలంగాణలో మూడు, కర్ణాటకలో 9, అండమాన్–నికోబార్ దీవులు, ఒడిశాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. డిపాజిటర్లను మోసం చేసిన కేసులో అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వా వెంకటరామారావు, మేనేజింగ్ డైరెక్టర్ అవ్వా వెంకట శేషునారాయణరావు (కుమార్), వైస్ చైర్మన్ ఇమ్మడి సదాశివరావు, డైరెక్టర్ కేఎస్ రామచంద్రరావులతోపాటు మరో 14 మంది డైరెక్టర్లను పోలీసులు అరెస్టు చేశారు.
అగ్రిగోల్డ్ ఆస్తులపై కన్నేసి..
ప్రభుత్వ ముఖ్య నేతలు అగ్రిగోల్డ్ ఆస్తులను దక్కించుకునే ప్రయత్నాలు చేశారనే విమర్శలు అప్పట్లోనే వ్యక్తమయ్యాయి. మంత్రి నారా లోకేశ్‌కు అగ్రిగోల్డ్‌కు చెందిన హాయ్‌ల్యాండ్‌ను కట్టబెట్టేందుకు ప్రయత్నాలు సాగాయన్న ఆరోపణలు ఉన్నాయి. కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి, ఎంపీ మాగంటి మురళీమోహన్‌లు సైతం హాయ్‌ల్యాండ్‌ను కారుచౌకగా దక్కించుకునే ప్రయత్నాలు చేశారు. 85 ఎకరాల్లో విస్తరించిన హాయ్‌ల్యాండ్‌లోని భవనాలు, సామగ్రి దాదాపు 25 ఎకరాల్లో ఉన్నాయి. ఆ భూములు, భవనాలు, సామాగ్రి లెక్కగట్టినా మార్కెట్ విలువ భారీగానే ఉంటుందన్నది అందరికీ తెలిసిందే. అతి విలువైన హాయ్‌ల్యాండ్ మొత్తాన్ని రూ.200 నుంచి రూ.250 కోట్లకే చేజిక్కుంచుకోవాలనే ప్రయత్నాలు జరిగాయి.
ముందుగానే ఆస్తులు అమ్మేసిన యాజమాన్యం
అగ్రిగోల్డ్ కుంభకోణం బయటకు రాకముందే అగ్రిగోల్డ్ ఆస్తులను సంస్థ యాజమాన్యం అమ్మేసి డబ్బును సొంత అకౌంట్లకు మళ్లించుకుంది. ఇదంతా ప్రభుత్వ పెద్దల సహకారంతోనే చేసిందనే విమర్శలున్నాయి. అందుకు ప్రతిఫలంగా యాజమాన్యం కొన్ని కీలక ఆస్తులను నామమాత్రపు ధరలకే ప్రభుత్వంలోని ముఖ్యనేతలకు అమ్మేసింది. ఆస్తుల అటాచ్‌మెంట్‌లో ఆలస్యం, నిందితులను అరెస్టు చేసేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపకపోవడాన్ని బట్టి వీరి బంధం బలమైందని అర్థం చేసుకోవచ్చు. అగ్రిగోల్డ్ మాజీ వైస్ చైర్మన్ డొప్పా రామ్‌మోహన్‌రావు 2016, ఏప్రిల్ 30న టీడీపీలో చేరడం దీనికి నిదర్శనం. అగ్రిగోల్డ్ ఆస్తుల అటాచ్‌మెంట్ జీవో రాకముందే 2015, జనవరి 19న మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తన భార్య వెంకాయమ్మ పేరుతో అగ్రిగోల్డ్ గ్రూప్ కంపెనీ అయిన రామ్ ఆవాస్ రిసార్ట్స్ హోటల్స్ గ్రూప్ డైరెక్టర్ అయిన ఉదయ్ దినకర్ నుంచి 14 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. 2015, ఫిబ్రవరి 20న అగ్రిగోల్డ్ ఆస్తుల అటాచ్‌మెంట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో ఇవ్వడం గమనార్హం.
సీఐడీ దర్యాప్తుపై నీలినీడలు
అగ్రిగోల్డ్ కుంభకోణం కేసును 2015, జనవరి 5న రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉండే సీఐడీకి అప్పగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2015, జూలై 17న న్యాయం కోసం బాధితుల తరఫున కోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై హైకోర్టు స్పందిస్తూ అగ్రిగోల్డ్ ఆస్తులు అమ్మి బాధితులకు న్యాయం చేసేలా 2015, అక్టోబర్ 9న జస్టిస్ సూర్యారావు, సీతాపతి, కృష్ణారావులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ప్రభుత్వం 2015, జూన్ 5న ప్రకటించిన ఐదుగురు సభ్యుల కమిటీ, 2018, మే 3న ప్రకటించిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని అధికారుల కమిటీ కార్యరూపం దాల్చలేదు. సీఐడీ దర్యాçప్తును అనేకమార్లు తప్పుపట్టిన హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా హాయ్‌ల్యాండ్‌కు, అగ్రిగోల్డ్‌కు సంబంధం లేదని దాని యాజమాన్యం హైకోర్టుకు తెలపడంతో న్యాయస్థానం తీవ్రంగా మండిపడింది. అటు సీఐడీని, ఇటు అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని కోర్టు తీవ్రంగా మందలించిన నేపథ్యంలో హాయ్‌ల్యాండ్ ఎండీ అల్లూరి వెంకటేశ్వరరావును కూడా సీఐడీ అరెస్టు చేయాల్సి వచ్చింది. ఆయన అరెస్టుతో అగ్రిగోల్డ్ కేసులో నిందితుల సంఖ్య 27కు చేరింది. మరోవైపు హాయ్‌ల్యాండ్ తమదేనంటూ అగ్రిగోల్డ్ యాజమాన్యం సైతం కోర్టుకు అంగీకారం తెలపక తప్పలేదు.
బినామీ ఆస్తులపై దృష్టి పెట్టలేదు
అగ్రిగోల్డ్ ఆస్తులు అటాచ్ చేస్తూ 2015, ఫిబ్రవరి 20న రాష్ట్ర ప్రభుత్వం జీవో 23ను జారీ చేసింది. ఆ తర్వాత మరికొన్ని జీవోలు ఇచ్చింది. 2016 నుంచి ఇప్పటివరకు 23 వేల ఎకరాలను అటాచ్ చేశారు. అయితే ఈ కేసు విచారణ జరుగుతుండగానే అగ్రిగోల్డ్ వైస్ చైర్మన్ సీతారాం అవ్వా (చైర్మన్‌కు స్వయానా తమ్ముడు) తిరుపతి మెయిన్‌రోడ్డులో ఉన్న ఒక స్థలాన్ని (ఒక ఎకరా 12 సెంట్లు) 2015, ఆగస్టు 10న రూ.14 కోట్లకు అమ్మేశారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో 2017, సెప్టెంబర్ 4న సీఐడీ స్వాధీనం చేసుకుంది. ఇంకా అగ్రిగోల్డ్ యాజమాన్యానికి చెందిన డైరెక్టర్లు, వారి భార్యలు, బంధువులు, బినామీల పేరుతో వందల కోట్ల విలువైన ఆస్తులపై సీఐడీ దృష్టి పెట్టలేదు. 156 కంపెనీలకు మళ్లించిన దాదాపు రూ.976 కోట్లను పట్టించుకోలేదు. ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు 2015, జనవరి 17న మీడియాతో మాట్లాడుతూ అగ్రిగోల్డ్‌కు సంబంధించిన రూ.500 కోట్లు కమర్షియల్ బ్యాంకుల్లోను, రూ.70 కోట్లు నాన్ కమర్షియల్ బ్యాంకుల్లోనూ డిపాజిట్లుగా ఉన్నాయని చెప్పారు. అయితే ఆ తర్వాత 22 బ్యాంకు ఖాతాలను జప్తు చేసినప్పటికీ ఆ ఖాతాలలో కేవలం రూ.6 లక్షలే ఉన్నాయని హైకోర్టుకు నివేదించారు. కంపెనీ ఖాతాల్లో రూ.6 లక్షలే ఉండటమేమిటని కోర్టు కూడా ఆక్షేపణ తెలిపింది.
అస్తుల లెక్కల్లో చిక్కులెన్నో..
డిపాజిటర్లు చెల్లించిన మొత్తానికి వడ్డీ కలుపుకొని రూ.10 వేల కోట్ల కుంభకోణమైన అగ్రిగోల్డ్‌కు సంబంధించిన ఆస్తుల వాస్తవ విలువలో పరస్పర విరుద్ధ అంచనాలు ఉన్నాయి. సీఐడీ, ప్రభుత్వ పెద్దలు చెబుతున్న లెక్కల్లో అనుమానాల చిక్కులెన్నో ఉన్నాయి. అగ్రిగోల్డ్ ఆస్తుల విలువ రూ.3,940 కోట్లు అని గతంలో ప్రకటించిన సీఐడీ తాజాగా రూ.3,861 కోట్ల 76 లక్షలని తాజాగా ప్రకటించడం గమనార్హం. రిజిస్ట్రేషన్ విలువ రూ.123 కోట్ల 38 లక్షలు (మార్కెట్ విలువ రూ.260 కోట్ల 79 లక్షలు) గల 366 ఆస్తులను 24 బిడ్‌లుగా వేలానికి పిలిచారు. ఇప్పటివరకు దశలవారీగా రూ.72 కోట్లకు కొన్ని ఆస్తుల వేలం ప్రక్రియ పూర్తిచేశారు. ఇది ఇలా ఉంటే అగ్రిగోల్డ్ ఆస్తుల విలువ రూ.20 వేల కోట్లు ఉంటుందని, అవకాశం ఇస్తే వాటిని అమ్మి డిపాజిట్లు తిరిగి చెల్లిస్తామంటూ దాని చైర్మన్ అవ్వా వెంకట రామారావు 2015లో సీఐడీ విచారణలో పేర్కొన్నాడు. అగ్రిగోల్డ్ ఆస్తుల విలువ రూ.2,200 కోట్లు ఉంటుందని ఎస్సెల్ గ్రూప్ సంస్థ పేర్కొంటే, వాటి విలువ రూ.2,500 కోట్లు ఉంటుందంటూ ప్రభుత్వ సలహాదారు కుటుంబరావు మీడియా సమావేశంలో ప్రకటించారు. వాస్తవానికి రూ.10 వేల కోట్ల స్కామ్‌కు సంబంధించిన ఆగ్రిగోల్డ్ ఆస్తుల విలువ బహిరంగ మార్కెట్‌లో ఖచ్చితంగా అమ్మగలిగితే రూ.35 వేల కోట్లు ఉంటుందని అంచనా.
టేకోవర్ పేరుతో..
ప్రముఖ రాజకీయనేత అమర్‌సింగ్ మధ్యవర్తిత్వంతో ఎస్సెల్ గ్రూప్ అధినేత సుభాష్‌చంద్ర గతేడాది సెప్టెంబర్‌లో అగ్రిగోల్డ్ టేకోవర్‌కు ముందుకు వచ్చారు. తొమ్మిది నెలల తర్వాత టేకోవర్ చేయలేనని చేతులెత్తేశారు. ఈ మధ్యలో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలు టీడీపీ ప్రభుత్వ చిత్తశుద్ధిని శంకించేలా చేశాయి. అమర్‌సింగ్‌తో సహా సుభాష్‌చంద్ర నేరుగా అమరావతి వచ్చి సీఎం చంద్రబాబుతో చర్చలు జరిపారు. ఆ తర్వాత కూడా అనేక పర్యాయాలు రహస్య చర్చలు సాగాయి. ఎన్‌డీఏ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన చంద్రబాబు ఢిల్లీలో అన్ని జాతీయ పార్టీల నేతలను కలిసేందుకు వెళ్తున్నట్టు ప్రకటించి అక్కడ అమర్‌సింగ్, సుభాష్‌చంద్రలతో రాత్రి సమయంలో చర్చలు జరిపారనే విమర్శలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాతే అగ్రిగోల్డ్ టేకోవర్ విషయంలో సుభాష్‌చంద్ర వెనక్కి తగ్గారు. అప్పటివరకు అగ్రిగోల్డ్ యాజమాన్యం తరఫున చర్చల్లో ఉన్న అవ్వా సీతారామారావును ఢిల్లీలో ఏపీ సీఐడీ అధికారులు అరెస్టు చేయడం గమనార్హం. చిత్రం ఏమిటంటే.. ఏళ్ల తరబడి ఆయన రాష్ట్రంలోనే కళ్లెదుటే తిరిగినా పట్టించుకోని ఏపీ సీఐడీ పోలీసులు ఢిల్లీలోని గుర్గావ్‌లో పట్టుకుని స్థానిక కోర్టులో హాజరుపరిచి ఆంధ్రప్రదేశ్‌కు తీసుకురావడం.
260 మంది ఆత్మహత్య
బాధితులను ఆదుకుంటామంటూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలుకాకపోవడంతో అగ్రిగోల్డ్ బాధితులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. అగ్రిగోల్డ్ కుంభకోణంతో తాము అహరహం కష్టపడి కూడబెట్టుకున్న సొమ్ము నష్టపోవడంతో రాష్ట్రంలో ఇప్పటివరకు 260 మంది బాధితులు ఆత్మహత్య చేసుకున్నారు. వీరిలో కేవలం 140 మందికి మాత్రమే రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇచ్చారు. తక్షణం రూ.200 నుంచి రూ.300 కోట్లు విడుదల చేసి అగ్రిగోల్డ్ బాధితులకు ఇస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు ఒక్కపైసా కూడా విదల్చలేదు. చస్తే పరిహారం ఇచ్చి సరిపెడతారా? అంటూ బాధితులు ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందస్తుగా రూ.1,150 కోట్లు విడుదల చేస్తే రూ.20 వేలు చొప్పున డిపాజిట్ చేసిన 70 శాతం మందికి న్యాయం చేసినట్టు అవుతుందనే బాధితుల డిమాండ్‌ను పట్టించుకునేవారే కరువయ్యారు.
అగ్రిగోల్డ్ బాధితుల ఉద్యమంలో కొన్ని సంఘటనలు..
- 2015, మే 5 విజయవాడలో ధర్నా
- 2016, మార్చిలో జింఖానా గ్రౌండ్‌లో భారీ నిరసన సభ
- 2016, జూన్ 16 కాజ టోల్‌ప్లాజా వద్ద పోరు దీక్ష
- 2016, అక్టోబర్ 8న 13 జిల్లాల్లో హైవేల దిగ్బంధం
- 2016, నవంబర్ 9న విజయవాడ లెనిన్ సెంటర్ వరకు పాదయాత్ర
- 2017, మార్చి 6 నుంచి 23 వరకు విజయవాడలో ధర్నా
- 2017, ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 17 వరకు బస్సు చైతన్య యాత్ర
- 2017, డిసెంబర్ 18, 19 తేదీల్లో మృతుల కుటుంబీకులతో 30 గంటలపాటు దీక్ష
- 2018, జనవరి 23 జస్టిస్ చంద్రకుమార్‌తో రౌండ్‌టేబుల్ సమావేశం
- 2018, మే 30, 31 తేదీల్లో న్యాయపోరాట పాదయాత్ర
- 2018, ఆగస్టు 13న అన్ని జిల్లాల్లో కేశఖండన నిరసన
- 2018, సెప్టెంబర్ 11న విజయవాడలో రాష్ట్ర స్థాయిలో కేశఖండన నిరసన
- 2018, నవంబర్ 1, 2 తేదీల్లో ధర్మాగ్రహ దీక్ష
బాధితుల డిమాండ్లు..
- అగ్రిగోల్డ్ యాజమాన్యం సేకరించిన డిపాజిట్లు తిరిగి చెల్లించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి.
- ప్రభుత్వం తక్షణం రూ.1,150 కోట్లు అడ్వాన్సుగా ఇచ్చి బాధితులను ఆదుకోవాలి.
- అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలి.
- అగ్రిగోల్డ్ పాల ఉత్పత్తి కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం మిల్క్ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేయాలి.
- అగ్రిగోల్డ్ బయోప్లాంట్లను రాష్ట్ర విద్యుత్ బోర్డు ద్వారా కొనుగోలు చేయాలి.
- అగ్రిగోల్డ్ సంస్థకు ఉన్న 23 వేల ఎకరాలను రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణలో భాగంగా కొనుగోలు చేయాలి.
- అగ్రిగోల్డ్‌కు చెందిన అన్ని రకాల భవనాలు, ఆస్తుల వేలంలో రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు పాల్గొని కొనుగోలు చేయాలి.
- సుమారు 20 లక్షల డిపాజిటర్ల కుటుంబాల్లో కోటి మంది సభ్యులను ఆదుకునేలా ప్రభుత్వం సత్వర చర్యలు చేపట్టాలి.
- మానసిక వేదనతో మృతి చెందినవారికి ఒక్కొక్కరికి రూ.10 లక్షలు పరిహారం అందించాలి.
ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
ప్రభుత్వం నిజాయితీగా వ్యవహరించి అగ్రిగోల్డ్ డైరెక్టర్ల అందరినీ అరెస్టు చేయాలి. ఆ కంపెనీకి, దాని యాజమాన్యానికి ఉన్న ఆస్తులు అమ్మి వచ్చిన మొత్తాన్ని డిపాజిటర్లకు చెల్లించేలా వెంటనే చర్యలు తీసుకోవాలి. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. అగ్రిగోల్డ్ ఆస్తులను అప్పనంగా కొట్టేయడానికి ప్రభుత్వంలో కీలక నేతలు నాటకాలు ఆడుతున్నారు. హాయ్‌ల్యాండ్ తదితర కీలక ఆస్తులపై ఎప్పటి నుంచో కన్నేసిన ప్రభుత్వ నేతలు ఉద్దేశపూర్వకంగానే బాధితులను పట్టించుకోవడం లేదు. కీలక నిందితులు కళ్లెదుటే తిరుగుతున్న ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు? ప్రభుత్వం వీలైనంత త్వరగా డిపాజిటర్లకు న్యాయం చేయకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తాం.
– లేళ్ల అప్పిరెడ్డి, కన్వీనర్, అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ
ఉరి తీయాలి...
అగ్రిగోల్డ్ సంస్థలో కట్టిన డబ్బులు నా పిల్లాడి వైద్యానికి పనికొస్తాయనుకున్నాం. 2015 జనవరి 1వ తేదీన మా బాబుకు రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు మూడు రోజుల్లో డబ్బులొస్తాయి, కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించవచ్చనుకున్నాం. రూపాయి కూడా రాలేదు. ఆపరేషన్ చేయించినా మా అబ్బాయి ఆరోగ్యం క్షీణించింది. దీనికి బాధ్యులైన అగ్రిగోల్డ్ యాజమాన్యాన్ని ఉరి తీయాలి. – భాగ్యవతి, చిత్తూరు
బాబు కన్ను పడకుంటే న్యాయం జరిగేది..
చంద్రబాబు ఉద్యమం చేస్తున్న అగ్రిగోల్డ్ బాధితులను పిలిచి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఆయన హాయ్‌ల్యాండ్‌పై కన్నేయకుంటే ఈపాటికి బాధితులకు న్యాయం జరిగేది. బాధితులకు అన్యాయం చేస్తే ఎన్నికల్లో ఆయనకు బుద్ధి చెప్పటం ఖాయం.
– ఎం.అప్పలనాయుడు (విజయనగరం)
పోలీసులను ఉసిగొల్పారు..
అగ్రిగోల్డ్‌కు చెల్లించిన డబ్బులిప్పిస్తామని ప్రభుత్వం మమ్మల్ని నట్టేట ముంచింది. విచారణ పేరుతో కాలయాపన చేస్తూ మా కడుపు కొడుతోంది. డబ్బులు ఇప్పించకపోగా పోలీసులను ఉసిగొలిపి చోద్యం చూస్తోంది. అగ్రిగోల్డ్ బాధితులకు అన్యాయం చేసిన ఈ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా బుద్ధి చెబుతాం.
– జి.వీరలక్ష్మి, పశ్చిమ గోదావరి జిల్లా
వేలం ప్రక్రియలో వేగం పెంచాలి
ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం ప్రక్రియలో వేగం పెంచాలి. ఆస్తుల జప్తు జరగకుండా అగ్రిగోల్డ్ యాజమాన్యం ప్రయత్నిస్తోంది. బాధితులకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. పోరాటానికి పిలుపు ఇచ్చిన ప్రతిసారి ఏదో ఒక హామీ ఇచ్చి ప్రభుత్వం మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్రంలో దాదాపు 20 లక్షల కుటుంబాల వేదన ప్రభుత్వానికి పట్టడం లేదు.
– తిరుపతిరావు, ప్రధాన కార్యదర్శి, అగ్రిగోల్డ్ ఏజెంట్స్ అండ్ కస్టమర్స్ వెల్ఫేర్ అసోసియేషన్
Comments
Please login to add a commentAdd a comment