సాగు ఎలా..?
సాగే బతుకు...అది ఆగితే చావే.... ఇదీ రైతన్న జీవన సూత్రం. తరతరాలుగా పుడమి తల్లిని నమ్ముకుని బతుకును పండించుకునేందుకు ఆరుగాలం శ్రమిస్తున్న అన్నదాతకు ఈ సంవత్సరం గడ్డురోజులు దాపురించాయి. పద్మవ్యూహంలో అభిమన్యుడిలా సమస్యల వలయంలో ఒంటిరి వాడయ్యాడు. బ్యాంకుల నుంచి అప్పు పుట్టక, విత్తన, కూలీ, ఎరువుల ధరలు విపరీతంగా పెరగడంతో ఆందోళన చెందుతున్నాడు.
విజయనగరం వ్యవసాయం :వ్యవసాయం కాస్త ‘వ్యయ’సాయంగా మారుతోం ది. ఏటా ధరలు పెరగిపోతుండడంతో సాగు భారమవుతోంది. ఆరుగాలం కష్టించినా ఫలితం దక్కడం లేదు. దీనికితోడు ప్రకృతి కరుణించకపోవడంతో రైతులు నష్టాల బారిన పడుతున్నారు. పెట్టుబడులకు ప్రతీ సారీ అప్పులు చేయాల్సిన పరిస్థితి. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినా ప్రభుత్వాలు సకాలంలో పరిహారం ఇచ్చి రైతుల ను ఆదుకున్న దాఖలాలు లేవు. దీంతో సాగు అంటేనే రైతులు వెనుకాడే పరిస్థితి నెలకొంది.
ఈ పరిస్థితుల్లో అనాదిగా వస్తున్న వ్యవసాయాన్ని వదలలేక మరి కొద్ది రోజుల్లో ప్రారంభం కానునన్న ఖరీఫ్‌కు సన్నద్ధమవుతున్నాడు.జిల్లాలో సాగు విస్తీర్ణం జిల్లా మొత్తం మీద అన్ని పంటలు కలిపి 2.20 లక్షల హెక్టార్లలో సాగవుతున్నాయి పధాన పంట వరి లక్షా 20 వేల హెక్టార్లలో సాగువుతోంది మిగిలిన విస్తీర్ణంలో మొక్కజొన్న, శెనగ, గోగు, చెరుకు,నువ్వు,పత్తి, అపరాలు , చిరుధాన్యాలను పండిస్తున్నారు. ధరాభారంకూలిరేట్లు నుంచి విత్తనాలు వరకు అన్ని ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ధరలు పెరిగినప్పటికీ రైతుల ఆదాయం మాత్రం పెరగడం లేదు. బ్యాంకులు, ప్రైవేట్ వ్యాపారుల వద్ద తీసుకున్న అప్పులు తీర్చలేని స్థితిలో ఉన్నారు.
టీడీపీ ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించినప్పటికీ... కమిటీ వేయడంతో రైతుల్లో ఉత్కంఠ నెలకొంది. రుణమాఫీ ఏయే సంవత్సరాల్లో తీసుకున్న రైతులకు వర్తింపజేస్తారు. బంగారం కుదవ పెట్టి రుణం తీసుకున్న వారికి ఇస్తా రా లేదా అనేది స్పష్టత లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎరువు బరువు గత నాలుగేళ్లగా ఎరువుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ప్రతీ ఏటా ధరలు పెరిగిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టుడుతున్నారు. యూరియా ధర మాత్రమే అదుపులో ఉంది. 50 కిలోల యూరియా బస్తా నాలుగేళ్ల కిందట రూ. 270 ఉండేది. నేడు రూ. 281 అయింది. డీఏపీ ధర 500 నుంచి రూ. 1260కు పెరిగింది. పొటాష్ ధర రూ. 350 నుంచి రూ.880 కు, కాంప్లెక్సు ఎరువు ధర రూ.450 నుంచి రూ.900 కు పెరిగింది.
విత్తనాల ధరలు:
జిల్లాలో 90 శాతం మంది రైతులు పంటలకు కావలసిన విత్తనమంతా ఏపీ సీడ్స్ విత్తన దుకాణదారుల వద్ద కొనుగోలు చేస్తుంటారు. ఈ ఏడాది వరి విత్తనాల ధరలు బాగా పెరిగాయి. బస్తా (30 కిలోలు) విత్తనాల ధర రకాలను బట్టి రూ.15 నుంచి రూ.81 వరకు పెరిగింది.
అందుబాటులో లేని దుక్కిరేట్లు:
పంటలు వేయాలంటే ముందుగా చేయాల్సింది పొలం దున్నడమే. అప్పటి నుంచి రైతులకు కష్టాలు మొదులువుతున్నాయి. పశు సంపద నానాటికీ తగ్గిపోతుండడం, డీజిల్ ధరలు పెరుగుతుండడంతో దుక్కిరేట్లు పెరిగిపోయాయి. గతంలో ట్రాక్టర్‌తో దున్నడానికి గంటకు రూ. 500 తీసుకుంటే ఇప్పుడు రూ.700 తీసుకుంటున్నారు. పశువులతో దున్నడానికి, దమ్ముపట్టడానికి గతంలో రైతులకు భోజనం, ఎడ్లకు దాణా పెట్టి రోజుకి రూ. 200 ఇచ్చేవారు. ఇప్పుడు రూ. 300 ఇస్తున్నారు.
కూలీలదీ అదే పరిస్థితి:
కూలీ ఖర్చులు గతంతో పోలిస్తే భారీగా పెరిగాయి. ఉపాధిహామీ పనుల కారణంగా కూలీలు దొరకడం కష్టంగా ఉంది. గతంలో ఆడవారికి రూ. 100, మగవారికి రూ. 150 ఇచ్చేవారు. ఇప్పుడు ఆడవారికి రూ. 150 , మగవారికి రూ. 250 వరకు ఇస్తే గాని పనులకు రాని పరిస్థితి. దీనికి తోడు కూలీలకు భోజనం పెట్టాలి.