ఉద్రిక్తం | Farmers concerned in vizianagaram | Sakshi
Sakshi News home page

ఉద్రిక్తం

Published Wed, Sep 3 2014 2:07 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

ఉద్రిక్తం - Sakshi

ఉద్రిక్తం

 సీతానగరం, బొబ్బిలి : సీతానగరంలోని ఎన్‌సీఎస్ (నారాయణం చెలమయ్య శెట్టి అండ్ సన్స్) ఫ్యాక్టరీకి సరఫరా చేసిన చెరుకు రైతులు బిల్లుల కోసం రోడ్డెక్కారు. జాతీయ రహదారిని దిగ్బంధించారు. పలుమార్లు ఫ్యాక్టరీలోనికి దూసుకెళ్లడంతో వారిని నిలువురించడానికి పోలీసులు శ్రమించవలసి వ చ్చింది. ఈ సందర్భంగా పోలీసులకు రైతులకు మధ్య తోపులాట జరిగింది. ఫ్యాక్టరీ కార్యాలయం పై రైతులు రాళ్ల వర్షం కురిపించడం వంటి సంఘటనలతో మంగళవారం లచ్చయ్యపేట చక్కర కర్మాగారం ప్రాంగణం అట్టుడికిపోయింది. ఎన్‌సీఎస్ చక్కెర కర్మాగారం రైతులకు రూ.24 కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సి ఉంది.
 
 ఈ ఏడాది జనవరి నెలాఖరు నుంచి రైతులకు చెల్లింపులు నిలిపివేయడంతో పాటు యాజమాన్యం పత్తాలేకుండా పోయింది. దీంతో రైతులు దశలవారీగా ఆందోళనను ఉధృతం చేశారు. బిల్లులు చెల్లించే వరకూ ఆందోళన చేయాలని ఏపీ రైతు సంఘం ఆధ్వ ర్యంలో నిర్ణయించి, మంగళవారం మహాధర్నా చేశారు. ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు మర్రాపు సూ ర్యనారయణ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాకు వందలాది మంది రైతులు బొబ్బిలి, సీతానగరం, మక్కువ, బాడంగి, తెర్లాం, సాలూరు, పార్వతీ పురం, బలిజిపేట తదితర మండలాల నుంచి త రలివచ్చారు. రైతు నాయకులు, రైతులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.
 
 బిల్లులు చెల్లించేవరకూ తిరిగి వెళ్లేది లేదని తేల్చిచెప్పారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీగా ఎత్తున మోహరించారు. డీఎస్‌పీ ఇషాక్ మహమ్మద్ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. ఒకానొక దశలో రైతులు ఫ్యాక్టరీలోనికి దూసుకెళ్లడానికి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆ తరువాత కొంత సమయం గడిచాక మళ్లీ రైతులు కార్యాలయంలోనికి దూసుకువెళ్లడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో తోపులాట జరిగింది. అలాగే రైతులు ఫ్యాక్టరీ కార్యాలయం పై రాళ్ల వర్షం కురిపించారు. రాళ్ల దాటికి తలుపులు, కిటికీల అద్దాలు పగిలాయి. ఆ సంఘటనలో బొబ్బిలి టౌన్ సీఐ తిరుమలరావు తో పాటు హెచ్‌సీ ప్రసాద్, కానిస్టేబుల్ మురళీకృష్ణలకు గాయాలయ్యాయి. ఒక రైతు కూడా గాయపడ్డాడు. దీంతో పోలీసులు బందోబస్తును మరింత  పెంచారు.
 
 వైఎస్‌ఆర్‌సీపీ మద్దతు
 చెరుకు బిల్లులు కోసం ఆందోళన చేస్తున్న రైతులకు అండగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలిచింది. పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే , పార్టీ నాయకురాలు సవరపు జయమణి ఫ్యాక్టరీ వద్దకు వచ్చి రైతులకు మద్దతు తెలియజేస్తూ రోడ్డుపై బైఠాయించారు. దాదాపు గంట సేపు అలాగే బైఠాయించి మద్దతు తెలిపారు. అలాగే సాయంత్రం నియోజకవర్గ ఇన్‌చార్జి జమ్మాన ప్రసన్నకుమార్ వచ్చి రై   తులకు అండగా నిలిచి, అధికారులతో మాట్లాడారు. సీపీఎం కూడా రైతులకు మద్దతు తెలిపింది. ఆ పార్టీ జిల్లా నాయకుడు ఎం కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ఆందోళన చేశారు.
 
 5వ తేదీ నుంచి చెల్లిస్తామన్నా...అంగీకరించని రైతులు
 బిల్లులు కోసం రైతులు ఆందోళన తీవ్రతరం చే యడంతో మంగళవారం సాయంత్రానికి సబ్ కలెక్టరు శ్వేతామహంతి, ఏఎస్‌పీ రాహుల్‌దేవ్ శర్మలు ఫ్యాక్టరీవద్దకు చేరుకున్నారు. ఫ్యాక్టరీ డెరైక్టరు శ్రీనివాస్‌తో ఫోన్‌లో, సీఈఓ ఆంజనేయుల తో ఛాంబర్‌లో మా ట్లాడారు. ఈ నెల 5 నుంచి చెల్లింపులు మొదలు పెట్టి 15వ తేదీ నాటికి పూర్తిస్థాయిలో చెల్లింపులు చేస్తామని యాజమాన్య ప్రతినిధులు హామీ ఇచ్చారు. ఆ విషయాన్ని కలెక్టరుకు కూడా లిఖిత పూర్వకంగా తెలియజేశారు. ఈ విషయాన్ని రైతులకు సబ్ కలెక్టరుతో పాటు సీఈఓ  బహిరంగంగా వివరించినా రైతులు అందుకు అంగీకరించకుండా అధికారులపై విరుచుకుపడ్డారు. ఈ విషయం చె ప్ప డానికేనా ఉదయం నుంచి రాత్రి వరకూ మమ్మల్ని ఆకలితో ఉంచారంటూ నానా శాపనార్థాలు పెట్టారు.
 
 వాహనాల దారిమళ్లింపు..ప్రయాణికుల పాట్లు
 అంతరాష్ట్ర రహదారిపై రైతులు ఆందోళనకు చేయడంతో పోలీసులు వాహనాల దారి మళ్లించారు. అయినా ఫలితం లేకపోయింది. వర్షాలకు వాహనాలు ఎక్కడికక్కడ కూరుకుపోవడంతో కొత్త సమస్యలు మొదలయ్యాయి. దీంతో ప్రయాణికులు కాలినడకన గమ్య స్థానాలకు చేరుకోవలసి వచ్చింది. పార్వతీపురం నుంచి వచ్చినవి కోమటిపల్లి మీదుగా, బొబ్బిలి నుంచి వెళ్లినవి దిబ్బగుడ్డివల మీదుగా పంపినా ప్రయోజనం లేకపోయింది. దీంతో వాహనాలు బారులు తీరి నిలిచిపోయాయి.
 
 చీటింగ్ కేసు నమోదు.. 12ఎకరాలు స్వాధీనం
 చెరుకు రైతులకు మోసం చేసిన ఎన్‌సీఎస్ యాజమాన్యంపై చీటింగ్  కేసు నమోదు చేసినట్టు సబ్ కలెక్టరు శ్వేతా మహంతి ఫ్యాక్టరీ వద్ద విలేకరులకు తెలిపారు. ఫ్యాక్టరీ డెరైక్టరుతో పాటు బాధ్యులందరిపై చర్యలుంటాయన్నారు. ఫ్యాక్టరీ ఆవరణ కాకుండా ఈ యాజమాన్యానికి మరో 12 ఎకరాల స్థలం ఉందని, వాటిని ఆర్‌ఆర్ యాక్టు కింద స్వాధీనం చేసుకుంటామన్నారు. ఆ భూమిని వేలం వేసి రైతులకు బకాయిలు తీరుస్తామన్నారు. చివరకు రాత్రి తొమ్మిది గంటల సమయంలో రైతులు ఆందోళన విరమించారు.  బుధ వారం ఉదయం మళ్లీ ఆందోళన చేయాలని నిర్ణయించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement