వ్యవసాయ విద్యార్థుల ఆందోళనలో ఉద్రిక్తత
► మంత్రి దిష్టిబొమ్మ దహనం
► పోలీసులకు, విద్యార్థులకు మధ్య తోపులాట
వ్యవసాయ విద్యార్థుల ఆందోళనలో భాగంగా నాలుగో రోజు గురువారం మంత్రి దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించ డంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. దూరవిద్యా విధానం ప్రతిపాదనను వెనక్కి తీసుకున్నట్టు ఉత్తర్వులు అందాయని ఆందోళన కారులకు ప్రిన్సిపాల్ తెలియజేశారు. అయినప్పటికీ ప్రైవేటు కళాశాలలు, ప్రయివేట్ పాలిటెక్నిక్‌లు రద్దుచేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు. వారి నిరసనకు గురువారం ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మద్దతు తెలిపారు.
యూనివర్సిటీ క్యాంపస్: వ్యవసాయ విశ్వవిద్యాలయంలో దూరవిద్యా కోర్సులు ప్రవేశ పెట్టవద్దంటూ విద్యార్థులు నాలుగు రోజులుగా చేస్తున్న ఆందోళనలో గురువారం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఉదయం వ్యవసాయ కళాశాల నుంచి విద్యానగర్ సర్కిల్ వరకు విద్యార్థులు ర్యాలీ చేశారు. దూరవిద్యా కోర్సు ఆలోచన మానుకోవాలని, ప్రైవేటు వ్యవసాయ కళాశాలలు, పాలిటెక్నిక్‌లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యానగర్ సర్కిల్‌లో వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు దిష్టిబొమ్మ దహనం చేశారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఎంఆర్‌పల్లి సీఐ మధు అక్కడకు చేరుకున్నారు.
దిష్టిబొమ్మ కాల్చేందుకు అనుమతి లేదని, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. ఓ విద్యార్థి కిందపడిపోయాడు ఆగ్రహిం చిన విద్యార్థులు పోలీసులపై చెప్పులు విసిరారు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు విద్యార్థులను అక్కడి నుంచి బలవంతంగా వెనక్కు పంపించారు. అనంతరం విద్యార్థులు వ్యవసాయ కళాశాల వద్ద వేసిన టెంట్ వద్దకు చేరుకుని దీక్ష కొనసాగించారు.
చెవిరెడ్డి మద్దతు..
చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి విద్యానగర్ సర్కిల్ చేరుకుని ఆందోళన చేస్తున్న విద్యార్థులకు మద్దతు తెలియజేశారు. విద్యార్థుల న్యాయమైన సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
దూరవిద్యా విధానం రద్దు..
వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రవేశపెట్టాలనుకున్న దూరవిద్యా విధానం ప్రతిపాదనను వెనక్కి తీసుకున్నట్టు యూనివర్సిటీ ఇన్‌చార్జి వీసీ విజయకుమార్ తెలిపారు. ఈ మేరకు ఎస్వీ వ్యవసాయ కళాశాల ప్రిన్సిపాల్‌కు ఫ్యాక్స్ ద్వారా ఉత్తర్వులు పంపారు. అలాగే ప్రైవేటు కళాశాలలు, పాలిటెక్నిక్‌లు రద్దు చేసే వరకు ఆందోళన కొనసాగిస్తామని వ్యవసాయ కళాశాల విద్యార్థులు స్పష్టం చేశారు.