
అభివృద్ధికి దూరంగా.. అనారోగ్యానికి బంధువుగా!
రీజినల్ క్యాన్సర్ సెంటర్ హుళక్కే
గుంటూరుకు తరలించే ప్రయత్నం
ఆ ప్రాంత మంత్రి ముమ్మర ఏర్పాట్లు
కర్నూలుకు మరోసారి మొండిచేయి
ఇప్పటికే గుంటూరుకు మళ్లిన ఎయిమ్స్
ప్రభుత్వం అరచేతిలో వైకుంఠం చూపుతోంది. రాజధాని ఏర్పాటు విషయంలో జిల్లాకు మొండిచేయి చూపిన చంద్రబాబు.. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరంగా ముందువరుసలో నిలుపుతామని ఇచ్చిన హామీ క్రమంగా నీరుగారుతోంది. ఎయిమ్స్‌ను గుంటూరుకు తరలించిన ఆ పార్టీ పెద్దలు.. తాజాగా రీజినల్ క్యాన్సర్ సెంటర్‌ను కూడా అదే ప్రాంతానికి తరలించుకుపోతుండటం గమనార్హం.
కర్నూలు(జిల్లా పరిషత్) : కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు 60 ఏళ్ల చరిత్ర ఉంది. రాయలసీమ నుంచే కాకుండా మహబూబ్‌నగర్, బళ్లారి, రాయచూరు, ప్రకాశం, చిత్తూరు జిల్లాల ప్రజలకు కూడా ఈ ఆసుపత్రే పెద్దదిక్కు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ఆసుపత్రి కావడంతోనే 1986లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు వైజాగ్, గుంటూరుతో పాటు కర్నూలులో క్యాన్సర్ విభాగాన్ని, కోబాల్ట్ మిషన్లు ఏర్పాటు చేశారు.
అప్పటి నుంచి ఈ మిషన్ ద్వారా రేడియేషన్ థెరపి ఇస్తూ లక్షలాది మంది క్యాన్సర్ రోగులకు సాంత్వన చేకూరుస్తోంది. రోజూ 40 నుంచి 60 మంది ఓపీ విభాగానికి చికిత్స కోసం వస్తుండగా.. నిత్యం 25 మందికి రేడియేషన్, 25 మందికి కీమోథెరపి ఇస్తున్నారు. ప్రస్తుతం నిపుణులైన వైద్యులు ఇక్కడి రోగులకు వైద్యం అందిస్తున్నారు. ఆరోగ్యశ్రీ పథకంతో పాటు పేద రోగులకు ఉచితంగా కూడా ఇక్కడ రూపాయి ఖర్చులేని వైద్యం అందుతోంది.
రూ.40కోట్లతో రీజనల్ క్యాన్సర్ సెంటర్ హుళక్కే
ప్రాధాన్యత దృష్ట్యా ఆసుపత్రిలో రూ.40కోట్లతో రీజనల్ క్యాన్సర్ సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ఆరు నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ సెంటర్ ఏర్పాటైతే లీనర్ యాక్సిలేటర్, బ్రాకీథెరపి యంత్రాలతో ట్రీట్‌మెంట్ ప్లానింగ్ సిస్టమ్ అమల్లోకి వస్తుంది. ప్రస్తుతం ఉన్న రేడియాలజితో పాటు సర్జికల్ ఆంకాలజి, మెడికల్ విభాగాలు ఏర్పాటవుతాయి.
ఒక్కో విభాగానికి ఒక ప్రొఫెసర్, ఒక అసోసియేట్ ప్రొఫెసర్, ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లతో పాటు స్టాఫ్ నర్సులు, పారామెడికల్ సిబ్బంది నియమితులవుతారు. అత్యాధునిక యంత్రాల ద్వారా క్యాన్సర్ రోగులకు మరింత సులభమైన, సురక్షితమైన, సైడ్‌ఎఫెక్ట్ తక్కువగా ఉండే చికిత్స అందుకునే వీలుంటుంది. ఇలాంటి క్యాన్సర్ సెంటర్‌ను జిల్లా నుంచి దూరం చేసేందుకు జరుగుతున్న కుట్ర విమర్శల పాలవుతోంది.
గుంటూరుకు తరలించే యత్నం
కర్నూలుకు ఎయిమ్స్‌ను ఎలాగూ రానీయలేదు. కనీసం రీజనల్ క్యాన్సర్ సెంటర్‌నైనా ఏర్పాటు చేస్తున్నారనే ఆశను కోస్తా మంత్రులు ఆవిరి చేస్తున్నారు. ఈ సెంటర్‌ను గుంటూరులో ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఇప్పటికే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం. ఆ మేరకు గుంటూరులో ఏర్పాట్లు జరిగిపోతున్నట్లు జిల్లా ఆసుపత్రి వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
ఇక్కడ ఏర్పాటు చేస్తే రోగులకు ఉపయోగం
రాయలసీమ ప్రాంతంలో క్యాన్సర్ విభాగం లేదు. కర్నూలులోని క్యాన్సర్ విభాగానికి మంచి పేరుంది. ఇక్కడ స్పెషలిస్టు వైద్యులు, సిబ్బంది ఉన్నారు. దీనిని అప్‌గ్రేడ్ చేసి రీజనల్ క్యాన్సర్ సెంటర్‌గా ఏర్పాటు చేస్తే రాయలసీమ ప్రాంతానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సెంటర్ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటి వరకు మాకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదు.
-డాక్టర్ వీరస్వామి, ఆసుపత్రి సూపరింటెండెంట్ కర్నూలులోనే క్యాన్సర్ సెంటర్ ఏర్పాటు చేయాలి
రాష్ట్రం విడిపోయినందున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కర్నూలు చివరన మిగిలిపోయింది. ఇక్కడి రోగులు మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లాల్సి వస్తోంది. భవిష్యత్‌లో తెలంగాణ రాష్ట్రంలో ఏపీ ఆరోగ్యశ్రీ కార్డులను ఆమోదించకపోతే పరిస్థితి ఏమిటో పాలకులు తెలుసుకోవాలి. రాయలసీమ ప్రాంతంలో క్యాన్సర్ రోగులు అధికంగా ఉన్నందున రీజనల్ క్యాన్సర్ సెంటర్‌ను కచ్చితంగా కర్నూలులో ఏర్పాటు చేయాలి. గుంటూరుకు తరలించాలని చూస్తే ఊరుకోబోం.
- డాక్టర్ విజయశంకర్, మెడికల్ జేఏసీ నాయకులు గుంటూరుకు తరలిస్తే పెద్ద ఎత్తున ఉద్యమం
కేంద్ర విద్యాసంస్థలను కర్నూలులో ఏర్పాటు చేయనీయకుండా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, బీజేపీ నాయకులు అడ్డుపడుతున్నారు. అన్ని విద్యాసంస్థలను గుంటూరు, విజయవాడ మధ్యలోనే ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ తరహాలో ఇప్పుడు గుంటూరు, విజయవాడ మధ్యలోనే అభివృద్దిని కేంద్రీకరిస్తున్నారు. దీనివల్ల ప్రత్యేక రాయలసీమ ఉద్యమం ఊపిరి పోసుకుంటుంది. రీజనల్ క్యాన్సర్ సెంటర్‌ను గుంటూరుకు తరలించాలని చూస్తే పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం.
- జె.లక్ష్మీనరసింహ, కర్నూలు జేఏసీ కోకన్వీనర్