ఉద్యోగమూ లేదు..డబ్బులు రావు | Air Force Jobs Fraud In Srikakulam | Sakshi
Sakshi News home page

ఉద్యోగమూ లేదు..డబ్బులు రావు

Jun 25 2019 10:11 AM | Updated on Jun 25 2019 10:11 AM

Air Force Jobs Fraud In Srikakulam - Sakshi

ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగం చేస్తున్నానని నమ్మబలిన కీలు సందీప్‌

సాక్షి, శ్రీకాకుళం : ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలు వేయిస్తానని నమ్మించి ఐదుగురు నిరుద్యోగుల నుంచి రూ.9.38 లక్షలు వసూలు చేసిన ఉదంతం పలాస–కాశీబుగ్గ జంట పట్టణాల్లో సంచలనంగా మారింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం..  వజ్రపుకొత్తూరు మండలం నూకవానిపేట గ్రామానికి చెందిన కీలు సందీప్‌ తన తల్లిదండ్రులతో కలిసి ఎయిర్‌ఫోర్స్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి నిరుద్యోగుల నుంచి నగదు కాజేశాడు. తల్లిదండ్రులు పరారవుతూ సోమవారం కాశీబుగ్గ పోలీసులకు చిక్కారు. సందీప్‌ పరారీలో ఉన్నాడు. పలాస–కాశీబుగ్గ జంట పట్టణాల్లో చదవుతున్నప్పుడు ఏబీవీపీ విద్యార్థి సంఘ నాయకునిగా ప్రచారం చేసుకుని విద్యార్థులతో పరిచయాలు పెంచుకున్నాడు. అందరి ఫోన్‌ నంబర్లు సంపాదించాడు. ఎయిర్‌ఫోర్స్‌కు దరఖాస్తులు చేసి వాటి హాల్‌టిక్కెట్‌ను చూపించి త్వరలో ఉద్యోగం వస్తుందని నమ్మించాడు.

హాల్‌టిక్కెట్‌ను కాస్త ఉద్యోగం వచ్చినట్లు తర్జుమా చేసి యువకులను మోసగించాడు. ఖరీదైన కారును అద్దెకు తీసుకుని దానిలో యువకులను తిప్పుతూ ఉద్యోగం వచ్చిందని అందరికీ పార్టీలు ఇచ్చి సందడి చేశాడు. వారికి కూడా ఉద్యోగాలు ఇప్పిస్తానని  నమ్మించడంతో (డమ్మీ హాల్‌టిక్కెటు చూపించి) కాశీబుగ్గకు చెందిన పసార మహేష్‌బాబు రూ.1.47లక్షలు, పలాస శివాజీనగర్‌కు చెందిన బమ్మిడి కుమార్‌ రూ.3.50లక్షలు, మెళియాపుట్టి మండలం పరుశురాంపురం(మురికింటిపద్ర) గ్రామానికి  చెందినటువంటి ఉప్పాడ మహేష్‌ వద్ద రూ.2లక్షలు, వీరితోపాటుగా సాహు రూ.3లక్షలు, లక్ష్మణ్‌ పాసర రూ.1లక్షా 47వేలు సందీప్‌ తల్లిదండ్రులు కీలు ధనలక్ష్మి, గోపాలరావు ఖాతాల్లో వేశారు. 

ఉద్యోగమూ లేదు..డబ్బులు లేవు..
డబ్బులు ఇచ్చి ఏడాది కావస్తున్నా ఉద్యోగాలు రాలేదు. దీంతో అనుమానం వచ్చి డబ్బులు తిరిగి ఇచ్చేయాలని సందీప్‌ను బాధితులు అడిగారు. అదుగోఇదుగో అంటూ చెప్పి తప్పించుకున్నాడు. తీరా సెల్‌ఫోన్‌ స్వీచ్‌ఆఫ్‌ రావడంతో సందీప్‌ను, తల్లిదండ్రులను నిరుద్యోగులంతా వెతకడం ప్రారంభించారు. సందీప్‌ స్వగ్రామం వజ్రపుకొత్తూరు మండలం నూకవానిపేటకు వెళ్లగా అక్కడ ఆచూకీ దొరకలేదు. తల్లిదండ్రులతో పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ 16వ వార్డులోని మహేశ్వరమ్మ దేవాలయం వెనుకభాగంలో ఉన్న రోడ్డులో అద్దె ఇంట్లో రహస్యంగా నివాసం ఉంటున్నట్లు తెలుసుకున్నారు. అక్కడకి వెళ్లగా ఆ ఇంటికి  తాళాలు వేసి ఉన్నాయి. వజ్రపుకొత్తూరు మండలం తేరపల్లి గ్రామంలో బంధువులు ఇంటి వద్ద ఉన్నారని తెలుసుకుని తల్లిదండ్రులతో కలిసి అక్కడకు వెళ్లారు. వీరిపై సందీప్‌ తల్లిదండ్రులు దాడి చేశారు.

మళ్లీ కాశీబుగ్గలోని అద్దెంటికి సందీప్‌ తల్లిదండ్రులు  వచ్చారని బాధితులు తెలుసుకుని  అక్కడికి వెళ్లారు. అక్కడ నుంచి పరారయ్యేందుకు సందీప్‌ తల్లిదండ్రులు ప్రయత్నించారు. బాధితులు కాశీబుగ్గ పోలీసులకు సమాచారం అందించారు.  ఇంటి నుంచి పరారవుతున్న సందీప్‌ తల్లిదండ్రులను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. అనేక ప్రాంతాల్లో ఉద్యోగాల పేరుతో యువతను మోసగించారు.  విజయనగరం జిల్లా ఎస్‌కోటలో విజయ అనే యువతి వద్ద రూ.4లక్షలు తీసుకున్నట్లు ఎస్‌కోట పోలీస్‌ స్టేషన్‌లో కేసు సైతం నమోదైనట్లు సమాచారం. బాధితులు సోమవారం కాశీబుగ్గ పోలీసులను ఆశ్రయించి సీఐ వేణుగోపాలరావు వద్ద గోడు వెళ్లబోసుకున్నారు. అనేకమందిని మోసగించిన సోమ్ముతో సొంత గ్రామంలో ఇంటిని అందంగా నిర్మించుకున్నాని బాధితులు సీఐకు తెలియజేశారు.

1
1/1

 కాశీబుగ్గ పోలీసు స్టేషన్‌ వద్ద బాధితులు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement