ఆర్మీ సిబ్బందితో ఆపరేషన్ శేషాచలం
తిరుమల : తిరుమల శేషాచలం అటవీ ప్రాంతంలో చెలరేగిన కార్చిచ్చును ఆర్పేందుకు వందమంది ఆర్మీ సిబ్బంది రంగంలోకి దిగాయి. రెండు రోజులుగా శ్రమిస్తున్నా మంటలు ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. తిరుమల కొండకు మూడు కిలోమీటర్ల దూరంలో మంటలు వ్యాపించాయి. ఇప్పటికే అయిదువేల హెక్టర్లలో అటవీ సంపద కాలి బూడిదయ్యింది.
మంటలు అదుపులోకి రాకపోవటంతో ఆక్టోపస్, ఎన్డీఆర్ఎఫ్ నావికా దళాలు ఇప్పటికే రేణిగుంట చేరుకున్నాయి. హెలికాప్టర్ల ద్వారా మంటలను అదుపులోకి తెచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. దాంతో తిరుమల కొండల్లో చెలరేగిన మంటలను ఆర్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. యుద్ధప్రాతిపదికన సహాయ సహకారాలు అందించాలని గవర్నర్ నరసింహన్ కేంద్ర ప్రభుత్వానికి, ఆర్మీ, నేవీకి విజ్ఞప్తి చేశారు.
నీరు, నురగతో కూడిన రసాయనాలను గగనతలం నుంచి చల్లి మంటలను ఆర్పేందుకు నేవీ, ఎయిర్‌ఫోర్సుకు చెందిన ఎయిర్‌క్రాఫ్ట్‌లు, ఎంఐ-17 హెలికాప్టర్లు తిరుమలకు రానున్నాయి. ఇప్పటికే బుధవారం ఓ హెలికాప్టర్ శేషాచలంపై చక్కర్లు కొట్టి అగ్నిప్రమాద ఘటనపై పూర్తి స్థాయిలో సర్వే చేసి వెళ్లింది. ఆగమ నిబంధనలను అతిక్రమించకుండా టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. తమిళనాడు అరక్కోణం నుంచి ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు కూడా తిరుమల చేరుకున్నాయి.
అటవీ శాఖ డీజీ సమీక్ష
కేంద్ర అటవీ శాఖ డెరైక్టర్ జనరల్ (డీజీ) ఎస్‌ఎస్ గార్బియల్ గురువారం ఉదయం తిరుపతిలో వివిధ రాష్ట్రాల అటవీ అధికారులతో సమావేశం అయ్యారు. రాష్ట్రాల నుంచి ఏనుగుల వలస సమస్య, పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, కర్ణాటక తదితర రాష్ట్రాల అటవీశాఖల ఉన్నతాధికారులు, వన్యప్రాణి సంరక్షణాధికారులతో చర్చలు జరుపుతున్నారు.