విమానాశ్రయ విస్తరణకు భూసేకరణ ఎప్పుడో!
సాక్షి, రాజమండ్రి : విజయవాడ, విశాఖపట్నం తర్వాత ఆ రెండు నగరాల మధ్య ఉన్న ఏకైక విమానాశ్రయం రాజమండ్రి సమీపంలోని మధురపూడిలోనే ఉంది. పెరుగుతున్న విమాన ప్రయాణాలను దృష్టిలో ఉంచుకుని ఈ విమానాశ్రయాన్ని విస్తరించాలని 2012లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. విస్తరణకు అవసరమైన 800 ఎకరాల సేకరణకు రూ.80 కోట్లు మంజూరు చేసింది. అయినా భూ సేకరణలో అధికారులు వెనకడుగు వేస్తున్నారు. బ్రిటిష్‌వారి హయాంలో ఏర్పాటైన రాజమండ్రి విమానాశ్రయాన్ని అప్పట్లో అత్యవసర సందర్భాల్లో మాత్రమే వినియోగించారు. తర్వాత దీనిని హెలికాప్టర్ల రాకపోకలకు ఉపయోగించారు.
సుమారు 366 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ విమానాశ్రయం నుంచి తొలిసారి 1985లో హైదరాబాద్‌కు వాయుదూత్ సర్వీసులు నడిపారు. తర్వాత 1994లో వీఐఎస్ ఎయిర్‌వేస్ ఇక్కడి నుంచి విమానాలను నడిపింది. అనంతరం డెక్కన్ ఎయిర్‌వేస్ హైదరాబాద్‌కు సర్వీసులు ప్రవేశపెట్టింది. మూడేళ్ల నుంచి జెట్ ఎయిర్‌వేస్, స్పైస్‌జెట్ సంస్థలు నిత్యం హైదరాబాద్‌కు సర్వీసులు నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడి నుంచి హైదరాబాద్‌కు నాలుగు సర్వీసులు ప్రయాణిస్తున్నాయి. గత నెలలో వచ్చిన హుద్‌హుద్ తుపానుతో విశాఖపట్నం విమానాశ్రయం బాగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో రాజమండ్రి విమానాశ్రయానికి ప్రాధాన్యం పెరిగింది.
ఇవీ విస్తరణ అవసరాలు
ఈ విమానాశ్రయంలో చిన్నతరహా విమానాల ల్యాండింగ్‌కు వీలుగా 1.7 కిలోమీటర్ల రన్‌వే ఉంది. భావి అవసరాలకు తగ్గట్టు ఎయిర్‌బస్సులు నడపాలంటే 3.2 కిలోమీటర్ల రన్‌వే కావాలి. ప్రాంగణాన్ని కూడా విస్తరించాలి. ఇందుకు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుని మరో 800 ఎకరాలు సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. రెండేళ్ల క్రితం రూ.80 కోట్లు మంజూరు చేసింది. కానీ స్థల సేకరణ మాత్రం నేటికీ ప్రారంభం కాలేదు. 2007లో రూ.38 కోట్లతో విమానాశ్రయంలో కొత్త కంట్రోల్ టవర్, టెర్మినల్ నిర్మాణాలు చేపట్టి, 2012 మే నెలలో ప్రారంభించారు. దీంతో పెద్ద విమానాల రాకకు వసతులు మెరుగుపడినా భూసేకరణే అడ్డంకిగా మారింది.
కొత్త చట్టం ప్రకారం పరిహారానికి డిమాండ్
గతంలో విమానాశ్రయానికి స్థల సేకరణ సమయంలో టీడీపీ స్థానిక నేతలు మోకాలడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో కొత్త భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించి విస్తరణ చేపట్టాలన్న డిమాండ్ భూముల యజమానులైన రైతుల నుంచి వినిపిస్తోంది. జిల్లాకో విమానాశ్రయం ఏర్పాటు చేస్తామంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు రాజమండ్రి విమానాశ్రయంపై దృష్టి సారించాలని ఉభయ గోదావరి జిల్లాల్లోని విమాన ప్రయాణికులు కోరుతున్నారు.