Deccan Airways
-
ఆకాశం హద్దులు దాటించిన వ్యక్తి.. ఇప్పుడెక్కడ?
Deccan Aviations GR Gopinath దేశమంటే మట్టికాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్నారు గురజాడ. ఆ మాటల స్ఫూర్తికి వాస్తవ రూపం ఇచ్చినవారిలో జీఆర్ గోపినాథ్ ఒకరు. విమాన ప్రయాణం చేసే హక్కు సంపన్నులకే కాదు. ఈ దేశంలో ఉన్న సామాన్యులకు కూడా ఉందని చాటి చెప్పారు. ఒక్క రూపాయికే ఆకాశయానం కలిగించిన గొప్ప ఎంట్రప్యూనర్ గోపినాథ్. ఆకాశం నీ హద్దురా డైనమిక్ ఎంట్రప్యూనర్, సోషల్ రీఫార్మర్, దేశభక్తుడైన గోపినాథ్ జీవిత చరిత్ర ఆధారంగా ఆకాశం నీ హద్దురా అనే సినిమా కూడా వచ్చింది. ఆ సినిమా అందరూ చూసే ఉంటారు. అయితే ఇప్పుడా గోపినాథ్ ఏం చేస్తున్నారు. తన దక్కన్ ఏవియేషన్ సంస్థ గురించి ఏం చెప్పారు. ఈ దేశ భవిష్యత్తు గురించి ఆయన కంటున్న కలలు ఏంటీ ? ఇటీవల మనీ కంట్రోల్ మీడియాకు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ముఖ్య అంశాలు మీ కోసం.. మిస్ అవుతున్నా దక్కన్ ఏవియేషన్స్ సీఈఓగా ఉన్నప్పుడు సామాన్యులను విమానంలోకి ఎక్కించడం, టైర్ టూ సిటీల మద్య ఎయిర్ కనెక్టివిటీ కల్పించడం వంటి పనులు చేపట్టినప్పుడు ఒంట్లో కొత్త శక్తి ప్రవహించేది. ఆ ఆనందం మాటల్లో వర్ణించలేనిది. ఇప్పుడది మిస్ అవుతున్నాను. ఆ తప్పు చేయను పునర్జన్మలపై నాకు నమ్మకం లేదు, కానీ మళ్లీ జన్మంటూ ఉంటే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ నా డెక్కన్ ఏవియేషన్‌ను విజయ్‌మాల్యాకు అమ్మను గాక అమ్మను. డెక్కన్ ఏవియేషన్‌ని అమ్మేయాలని నిర్ణయం తీసుకోవడం పొరపాటు. నేను నా మనసు మాట విని ఉండాల్సింది. కానీ అలా చేయకుండా డెక్కన్ ఏవియేషన్‌లో పెట్టుబడిదారుల అభిప్రాయం వైపుకే మొగ్గు చూపాను. డెక్కన్ ఏవియేషన్‌ని అమ్మేయడం వల్ల మాకు లాభాలు వచ్చాయనే మాట నిజమే. కానీ సామాన్యులకు విమానయానం దగ్గర చేయాలనే నా కల. కానీ అలా జరగలేదు. అయితే జరిగినదాని గురించి జరగబోయేదాని గురించి నాకు పెద్దగా బాధ అయితే లేదు. రాజకీయాల్లో... కింగ్‌ఫిషర్ ఓనర్ విజయ్ మాల్యాకు ఎయిర్ దక్కన్ని అమ్మేసిన తర్వాత ప్రజా సేవ చేయాలనే లక్ష్యంతో బెంగళూరు సౌత్ నియోకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాను. అయినా సరే నా ప్రయాణం అపకుండా అవినీతి వ్యతిరేకంగా అన్నా హజారే చేపట్టిన ఉద్యమంలో ఉధృతంగా పాల్గొన్నాను. ఆప్ పార్టీ పెట్టగానే దానిలో చేరాను. అయితే ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నియంత్రృత్వ పోకడలు నచ్చక ఆ పార్టీ నుంచి కూడా బయటకు వచ్చేశాను. కానీ పార్టీ పెట్టిన తీరు, ఎన్నికల్లో గెలిపించిన వైనం, పరిపాలన చేస్తున్న విధానాల పరంగా అరవింద్ కేజ్రీవాల్ అంటే ఇప్పటికీ అభిమానం, గౌరవం ఉన్నాయి. రాజకీయాల్లో నూతన అధ్యాయాన్ని అరవింద్ కేజ్రీవాల్ ధైర్యంగా ప్రారంభించారనే నమ్ముతాను. అలాంటి నేతలు కావాలి బడా కార్పోరేట్ కంపెనీలు అన్ని కూడా పాలసీ తయారీలో కీలకంగా ఉండే వారితో దగ్గరి సంబంధాలు నెరుపుతున్నాయి. కార్పోరేట్ శక్తులకు మంచి నాయకులు కాదు మనకు కావాల్సింది. సామాజికంగా విప్లవాత్మకమైన మార్పును తీసుకువచ్చే సృజనాత్మక ఐడియాలు కలిగిన ఎంట్రప్యూనర్లు ప్రోత్సహించేవారు కావాలి. అప్పుడే మన సమాజం వేగంగా మార్పులు వస్తాయి. అభివృద్ధి ఫలాలు అందరికీ అందుతాయి. వారిపైనే ఆశలు ఇప్పుడున్న ఎంట్రప్యూనర్లలో ఓలా భవీష్ అగర్వాల్, పేటీఎం విజయ్ శేఖర్ శర్మలు ఎక్కువగా నన్ను ఆకట్టుకున్నారు. ఇలా వ్యక్తులు మనకు వేలమంది కావాలి. వారంత విభిన్న రంగాల్లోకి చొచ్చుకుపోవాలి. తమకున్న ఐడియాలను ఆచరణలోకి తెచ్చి దేశ గతిని మార్చేయాలి. నా దృష్టిలో ఈ రోజుల్లో ఫ్రీడం ఫైటర్లు అంటే ఎంట్రప్యూనర్లే. వారే ఈ దేశ భవిష్యత్తును నిర్మించగలరు. అలా జరగడం లేదు నరేంద్రమోదీ ప్రధానిగా పదవి బాధ్యతలు చేపట్టగానే రెడ్టేపిజంలో మార్పులు వస్తాయని ఆశించాను. కానీ అలా ఏం జరగడం లేదు. రెట్రోట్యాక్స్ను రద్దు చేయడానికే ఏడేళ్లు సమయం తీసుకున్నారు. కొత్త ఎంట్రప్యూనర్లకు క్షేత్రస్థాయిలో అనవసరంగా ఎదురయ్యే అడ్డంకులు తొలగించాలి. ఐడియాలో సాధ్యమైనంత త్వరగా ఆచరణలోకి వచ్చే వెసులుబాటు ప్రభుత్వ పరంగా ఉండాలి. అప్పుడే మనం చైనాను దాటి అభివృద్ధిలో ముందుకు పోగలం. రిటైర్ అయ్యాక రిటైర్మెంట్ అంటూ ఏమీ లేదు. దక్కన్ ఏవియేషన్స్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా బిజిగానే ఉంటున్నాను. కర్నాటకలోని మా సొంతూరిలో వ్యవసాయం క్షేత్రంలో ఎక్కువ సేపు గడుపుతుంటా. దీంతోపాటు డెక్కన్ ఛార్టర్స్ అనే సంస్థకు గౌరవ అధ్యక్షుడిగా హోదాలో ఉన్నాను. ఈ సంస్థ ఆధీనంలో యాభై వరకు హెలికాప్టర్లు, జెట్ విమానాలు ఉన్నాయి. వీటి నిర్వాహణకు సంబంధించి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటాను. ఇక రాజకీయాలు, భారత ఆర్థిక వ్యవస్థ, అవినీతి తదితర అంశాలపై గంటల తరబడి జరిగే చర్చాగోష్టీల్లో భాగమవుతాను. వర్తమాన అంశాలపై పుస్తకాలు కూడా రాస్తుంటాను. ఇప్పటికే సింపుల్ ఫ్లై, వన్ కనాట్ మిస్ ద ఫ్లైట్ అనే పుస్తకాలు అచ్చయ్యాయి. - సాక్షి , వెబ్‌డెస్క్ చదవండి: స్త్రీలు ఎగరేసిన విమానం -
స్త్రీలు ఎగరేసిన విమానం
నలుగురు స్త్రీలు ఇప్పుడు ప్రశంసలు పొందుతున్నారు. పేదవాడిని రూపాయి టికెట్‌తో విమానంలో కూచోబెట్టిన ‘ఎయిర్ డెక్కన్’ వ్యవస్థాపకుడు కెప్టెన్ గోపీనాథ్ నిజ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాకు దర్శకత్వం వహించిన స్త్రీ– సుధ కొంగర... భర్త విమానం ఎగరేయడానికి ముందే ‘బన్ వరల్డ్’ అనే బేకరీ పెట్టి అతని కల నెరవేర్చుకోవడానికి గొప్ప బలం ఇచ్చిన భార్య భార్గవి గోపీనాథ్.. ఆ పాత్రను తెర మీద అద్భుతంగా పోషించి హీరోకు హీరోయినూ సమానమే అని నిరూపించిన మలయాళ నటి అపర్ణ బాల మురళి.. కొడుకు పక్కన కొండలా నిలిచిన తల్లి పాత్ర పోషించిన ఊర్వశీ... వీరంతా ఇప్పుడు ప్రేక్షకులలో స్ఫూర్తినింపే ఒక విమానాన్ని ఎగురవేశారు. గొప్ప కలలు కనడం సామాన్యుడి హక్కు అని సందేశం ఇస్తున్నారు. గోపీనాథ్ అతని భార్య గురించిన సినిమా – జీవిత విశేషాల కథనం ఇది. కెప్టెన్ గోపీనాథ్‌గా, ‘ఎయిర్ డెక్కన్’ గోపీనాథ్‌గా దేశానికి తెలిసిన ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు గోపీనాథ్ 1980లలో తన 28వ ఏట మిలట్రీ నుంచి బయటపడ్డాడు. ఆయన కర్ణాటకలోని తన సొంత ప్రాంతం హసన్‌కు వచ్చి సేంద్రీయ పద్ధతుల్లో తన పెద్దలు ఇచ్చిన పొలంలో సెరికల్చర్ ప్రారంభించాడు. ఆయనకు భార్గవితో పెళ్లయ్యింది. ఇద్దరు కుమార్తెలు జన్మించారు. 1997లో చార్టర్ హెలికాప్టర్లను అద్దెకు తిప్పే సంస్థను గోపీనాథ్ మొదలెట్టే నాటికే పిల్లల చదువు కోసమే కాదు కుటుంబానికి ఆర్థికపరమైన దన్ను కోసం భార్గవి బెంగళూరు వచ్చేశారు. ఆమె బంధువొకరు అప్పటికే బెంగళూరులో బేకరీ నడుపుతున్నారు. ఆయన సహాయంతో మల్లేశ్వరంలో ఆమె ‘బన్ వరల్డ్’ అనే బేకరీని స్థాపించారు. కాలేజీలు ఎక్కువగా ఉండే ప్రాంతం కావడాన బన్ వరల్డ్ విపరీతంగా ఆదరణ పొందింది. విద్యార్థులు అక్కడికి వచ్చి కూచునే స్థలం అయ్యింది. గోపీనాథ్ తన జీవితంలో ఏ ప్రయోగం చేసినా, సామాన్యుడు ఎక్కే విమానయాన సంస్థ ప్రారంభించాలనుకున్నా తన వెనుక తన భార్య నడిపే బేకరి ఉంది, తనకు ఆమె సంపూర్ణ మద్దతు ఉంది అని భావించడం వల్లే. అలాగని భార్గవి పూర్తిగా భర్త చాటు భార్యగా పూర్తిగా ఉండలేదు. గోపీనాథ్‌కు సలహాదారుగా, మార్గదర్శి గా, ఆర్థిక సర్దుబాటుదారుగా కూడా ఉంది. అందుకే తన జీవిత కథ స్ఫూర్తితో తీసిన ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాను చూసిన గోపీనాథ్ ‘నా భార్య పాత్ర ఎలా ఉండాలో అలా ఉంది’ అని చిత్ర హీరో–నిర్మాత సూర్యను, దర్శకురాలు సుధ కొంగరను ప్రశంసించాడు. సినిమాలో ఆయన భార్య పాత్రను మలయాళ నటి అపర్ణ బాలమురళి పోషించింది. భర్తను డీకొట్టేలా ఉంటూనే అతన్ని ఎంతో సమర్థించే పాత్ర అది. నిజ జీవితం కర్ణాటకకు చెందిన గోపీనాథ్‌ను భారత పౌర విమానయాన చరిత్రను తిరగరాసిన వ్యక్తిగా చెప్పుకుంటారు. 2003 వరకూ ఆకాశంలో విహరించడం అనేది డబ్బున్నవారి వ్యవహారంగా మాత్రమే దేశంలో ఉంటే గోపీనాథ్ తన ‘ఎయిర్ డెక్కన్’ సంస్థతో దానిని సమూలంగా మార్చేశాడు. ఒక్కశాతం మంది కే అందుబాటులో ఉండే విమానయానాన్ని దాదాపు 40 శాతం మందికి ఆయన చేరువ చేశాడు. చిన్న విమానాలు నడపడం, చిన్న ఊళ్లకు నడపటం, ట్రావెల్ ఏజెంట్ కమీషన్‌ను తొలగించి నేరుగా టికెట్ కొనే ఏర్పాటు చేయడం, ప్రయాణంలో ఇచ్చే తినుబండారాల, పానీయాల చార్జిని తొలగించి అవి కావాల్సిన వారు ఫ్లయిట్లోనే కొనుక్కునే ఏర్పాటు చేయడం ఇవన్నీ సంచలనం సృష్టించాయి. అన్నింటి కంటే మించి ‘ఒక రూపాయి’ టికెట్ స్కీమ్ పెట్టి రెండు మూడు నెలల ముందు టికెట్ బుక్ చేసుకుంటే ఒక్క రూపాయికే విమాన ప్రయాణం చేయొచ్చు అని ఆఫర్ ఇవ్వడంతో రైలులో ఎన్నడూ ఫస్ట్ క్లాస్ ప్రయాణం చేసి ఎరగని వారు కూడా విమానం ఎక్కారు. 2003–2007 వరకూ సాగిన ఎయిర్ డెక్కన్ ఆ తర్వాత ‘కింగ్ ఫిషర్’లో విలీనం అయ్యింది. తన అనుభవాలను ఆయన ‘సింప్లి ఫ్లై’ పేరుతో పుస్తకంగా రాశాడు. ఆ పుస్తకం స్ఫూర్తిగానే ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా తయారైంది. సినిమా మార్పు కెప్టెన్ గోపీనాథ్ ’సింప్లి ఫ్లై’ పేరుతో తన ఆత్మానుభవాలు రాశాక దానిని చదివిన గిరీష్ కర్నాడ్ ‘ఈ కథ మంచి సినిమా అవుతుంది’ అని నలుగురికీ చెప్పడం మొదలెట్టాడు. ఈ పుస్తకాన్ని విపరీతంగా ఇష్టపడ్డ సుధ కొంగర రైట్స్ కోసం గోపీనాథ్‌ను సంప్రదిస్తే ఎందుకో ఆయన ఇవ్వలేదు. ఈలోపు తన డాక్యుమెంటరీ ‘పిరియడ్. ఎండ్ ఆఫ్ సెంటెన్స్’తో ఆస్కార్ సాధించిన నిర్మాత గునీత్ మోంగా ఆ రైట్స్ సాధించింది. అయినా వెనక్కు తగ్గని సుధ ఆ కథను సూర్యాకు చెప్పి ఒప్పించి గునీత్తో కలిసి సినిమా నిర్మించేలా ప్రాజెక్ట్‌ను చక్కబరిచింది. నిజ జీవితంలో కథ కర్నాటకలో జరిగినా సినిమా తమిళంలో తీయడం వల్ల మదురై ప్రాంతానికి (తెలుగులో చుండూరు) మారింది. స్కూల్ టీచర్ కొడుకైన సూర్య తమ పల్లెలో ఆగని రైలు కోసం పోరాడే స్థాయి నుంచి తన పల్లెవారు విమానం ఎక్కే స్థాయి వరకు చేసే పోరాటం గా ‘సూరారై పొట్రు’ (ఆకాశం నీ హద్దురా) తయారైంది. అప్పటికే విమానయానంలో ఉన్న పెద్ద పెద్ద మొసళ్లు, తిమింగలాలు సామాన్యుడికి విమాన టికెట్ అందుబాటులోకి తెస్తాను అంటూ సూర్య బయలుదేరితే ఎటువంటి కష్టాలు తెచ్చి పెడతారో నాటకీయంగా సినిమాకు తగిన స్థాయిలో చూపించారు. నలుగురు స్త్రీలు ఈ కథ ఖర్చుతో కూడిన కథ. విమానాలు, ఎయిర్‌పోర్ట్‌లు అంటే పెద్ద బడ్జెట్ అవసరం అవుతుంది. మేకింగ్ కూడా శ్రమతో నిండినది. ఇలాంటి సినిమాలకు మగ దర్శకులను ఎంచుకోవడం పెద్ద హీరోల ఆనవాయితీ. కాని సూర్య సుధ కొంగర సామర్థ్యాలకు విలువ ఇచ్చారు. ఆమె ఆ కథను సమర్థంగా తీర్చి దిద్ది పరిశ్రమలో స్త్రీ దర్శకుల ఉనికిని సమున్నతంగా నిలబెట్టారు. ‘గురు (వెంకటేశ్) హిట్టయ్యాక యూనిట్లో నా ముందు ఎవరూ నోరెత్తడం లేదు’ అంటారు సుధ– స్త్రీ దర్శకులకు ఎదురైన చిరాకులను గుర్తు చేసుకుంటూ. ఇక సినిమాలో సూర్యకు భార్యగా చేసిన అపర్ణ మదురై పల్లెటూరు అమ్మాయిగా ఏదైనా సాధిద్దాం అనుకునే మొండి ఆడపిల్లగా పల్లెటూరి అమ్మాయిలను ఉత్సాహ పరుస్తుంది. ఆ పాత్రకు స్ఫూర్తిగా నిలిచిన భార్గవి కథను ఇప్పుడు ఎక్కువ మంది తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఇక సినిమాలో సూర్య తల్లిగా నటించిన ఊర్వశి కొడుకుపై నమ్మకం ఉంచిన స్త్రీ. అతనికి వెన్నుదన్నుగా నిలుస్తుంది. నిజ జీవితంలో కాని, సినిమాలో కాని ఈ విమానం కేవలం మగవారి వల్ల ఎగరలేదు... స్త్రీల వల్ల కూడా ఎగరింది అని దర్శకురాలు చాలా నిర్దిష్టంగా, స్పష్టంగా చెప్పడం వల్ల స్త్రీ భాగస్వామ్యం సమాజ ప్రగతిలో ఎంత అవసరమో చెప్పినట్టయ్యింది.పురుషుడు స్త్రీకి, స్త్రీ పురుషుడికి తోడుగా నిలుస్తూ గొప్ప విజయాలు సాధించాలనే స్ఫూర్తి మరోసారి ఉజ్జీవనం కావడం ఎంతో సంతోషకరమైన విషయం. ‘ఎగిరి’ గంతేయాల్సిన విజయం. -
72 ఏళ్ల క్రితమే ఆకాశాన హజ్‌కు..
1946, అక్టోబర్ 22. ఆ రోజు మంగళవారం నగరమంతా సందడిగా ఉంది. జంట నగరాల నుంచి బేగంపేట విమానాశ్రయానికి ఉదయం 6 గంటల నుంచే జనం వస్తున్నారు. ఉదయం 9 గంటలకు విమానాశ్రయం జనసంద్రంగా మారింది. హైదరాబాద్‌లో ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీ.. దేశ చరిత్రలో ఓ కొత్త అధ్యాయాన్ని లిఖించిన రోజు. దేశంలోనే తొలిసారి హజ్ యాత్రకు వెళ్లేందుకు విమానం సిద్ధమైంది.ఉదయం 10 గంటలకు 18 మంది యాత్రికులతో డకోటా డీ–3 విమానం గాలిలోకి ఎగిరింది. అలా దేశంలోనే తొలిసారి హజ్ యాత్రకు దక్కన్ ఎయిర్వేస్ విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఈ విమానానికి పైలెట్లుగా కెప్టెన్ కాక్స్, మునిషీ, రేడియో ఆపరేటర్‌గా నాసిర్, ఫ్లైట్ ఇంజనీర్‌గా లార్డ్ వ్యవహరించారు. మంగళవారం నుంచి హజ్ యాత్ర ప్రారంభమవుతున్న నేపథ్యంలో ‘సాక్షి’ప్రత్యేక కథనం. – సాక్షి, హైదరాబాద్ 1400 ఏళ్ల క్రితమే... 1400 ఏళ్ల క్రితం నుంచే వివిధ దేశాల నుంచి సౌదీ అరేబియాలోని మక్కాకు హజ్ ఆరాధనల కోసం ముస్లింలు వెళుతున్నారు. హైదరాబాద్ సంస్థానాన్ని పాలించిన బహుమనీలు, కుతుబ్ షాహీలు, ఆసిఫ్‌జాహీల కాలం నుంచే ముస్లింలు హజ్‌కు రోడ్డు, సముద్ర మార్గాల ద్వారా వెళ్లినట్లు చరిత్ర చెబుతోంది. 72 ఏళ్ల క్రితం దేశంలోనే తొలిసారి హైదరాబాద్ సంస్థాన ప్రజలు విమానంలో యాత్రకు వెళ్లారు. 1946లో ఒక విమానంలో 18 మంది వెళ్లగా, ప్రస్తుతం 25 విమానాల్లో దాదాపు 8 వేల మంది వెళుతున్నారు. హకీంపేట్ రన్‌వే నుంచి.. అప్పట్లో దేశ వ్యాప్తంగా ఎక్కడ నుంచి కూడా హజ్‌కు విమాన సర్వీసులు లేవు. 1947లో హైదరాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి రెండోసారి విమానం హజ్ యాత్రకు వెళ్లింది. అయితే యాత్రికుల సంఖ్య ఎక్కువ కావడం, బేగంపేట్ విమాన రన్‌వే తక్కువగా ఉండడంతో హకీంపేట్‌లో విమాన రన్‌వే అనుకూలంగా ఉండడంతో అక్కడి నుంచి హజ్ యాత్రకు బయలుదేరినట్లు ఇంటాక్ తెలంగాణ కో కన్వీనర్ అనురాధ తెలిపారు. ఆగుతూ.. హజ్ యాత్రకు.. హైదరాబాద్ నుంచి హజ్ యాత్రికుల విమానాలు నేరుగా సౌదీ అరేబియాలోని జెడ్డాకు వెళ్లేవి కావు. ఇంధనం ఇబ్బందులుండటంతో సిరియా, ఈజిప్టు, ఇరాక్‌తో పాటు ముంబై, కరాచి, షార్జాలో ఆగి వెళ్లేవారు. దక్కన్ ఎయిర్వేస్ విమానాలు హజ్ యాత్రకు 1946, 1947.. రెండేళ్ల పాటు నడిచాయి. అనంతరం దేశానికి స్వాతంత్య్రం రావడం, హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్‌లో విలీనం కావడంతో జరిగిన పరిణామాల దృష్ట్యా 1948–1950 వరకు విమానాలు హజ్ యాత్రకు వెళ్లలేదు. మళ్లీ 1951 నుంచి 1953 వరకు హైదరాబాద్ నుంచి హజ్ యాత్రకు విమానాలు వెళ్లాయి. 1953లో దక్కన్ ఎయిర్వేస్ ఎయిర్ ఇండియాలో విలీనం కావడంతో హజ్ యాత్రకు విమానాలు రద్దు చేశారు. ఆసిఫ్ జాహీల కాలంలో రైలు మార్గాన.. నిజాం హయాంలో హైదరాబాద్‌లో 1874లో రైల్వే లైన్ ప్రారంభమైంది. దీంతో సంస్థానం నుంచి హజ్ యాత్రకు వెళ్లే వారు రైలు మార్గం ద్వారా ముంబైకి చేరుకొని అక్కడి నుంచి సముద్ర మార్గం ద్వారా సౌదీ అరేబియాలోని జెడ్డా నౌకాశ్రయానికి చేరుకునేవారు. నిజాం ప్రభుత్వ హయాంలో హైదరాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వెళ్లేవారికి నాంపల్లిలో ప్రభుత్వం తరఫున ఉచితంగా భోజన వసతి ఉండేది. ఏడవ నిజాం ఉస్మాన్అలీ హయాం వచ్చే సరికి నాంపల్లి స్టేషన్ హజ్ యాత్ర సమయంలో జనసంద్రంగా మారేది. యాత్రికులతో పాటు వారి కుటుంబ సభ్యులు, ఇరుగుపొరుగు వారితో పాటు సాధారణ జనం కూడా అక్కడికి వచ్చేవారు. 1994 వరకు నౌకాయానం.. తిరిగి విమాన యానం తొలుత హైదరాబాద్ నుంచి హజ్ యాత్రకు వెళ్లే వారు రోడ్డు, రైల్వే మార్గాల ద్వారా ముంబైకి చేరుకునే వారు. మొదట్లో ఇంజన్ నౌకలు లేకపోవడంతో పరదా వాటిల్లోనే యాత్ర సాగేది. రంజాన్ 2 నెలల తర్వాత హజ్ ఆరాధనలు వస్తాయి. రంజాన్ నెల ఉపవాసాల కంటే ముందే హజ్ ఆరాధనలకు ఇళ్ల నుంచి బయలుదేరే వారు. నేను 1969 నుంచి హజ్ యాత్రకు వెళుతున్నా. అప్పటి నుంచి అందరి సామాన్లు మోసేవాడిని. అందుకే అందరూ నన్ను హబీబ్ కూలీగానే పిలుస్తారు. ఆ రోజుల్లో రంజాన్ కంటే ముందు ముంబై నుంచి సౌదీ, ముజ్జదీ అనే 2 నౌకలు, రంజాన్ తర్వాత ముహ్మదీ, అక్బర్, నూర్జహా పేర్లతో నౌకలు హజ్‌కు వెళ్లేవి. నౌక ప్రయాణం దాదాపు పదమూడు నుంచి పదిహేను రోజులు పట్టేది. చివరిసారిగా 1994 వరకు నౌకాయానం జరిగింది. అనంతరం విమానయానం ప్రారంభమైంది. – హజ్ సేవకుడు హబీబ్ అబ్దుల్ ఖాదర్ ఇల్యాస్ హబీబ్ కూలీ -
విమానాశ్రయ విస్తరణకు భూసేకరణ ఎప్పుడో!
సాక్షి, రాజమండ్రి : విజయవాడ, విశాఖపట్నం తర్వాత ఆ రెండు నగరాల మధ్య ఉన్న ఏకైక విమానాశ్రయం రాజమండ్రి సమీపంలోని మధురపూడిలోనే ఉంది. పెరుగుతున్న విమాన ప్రయాణాలను దృష్టిలో ఉంచుకుని ఈ విమానాశ్రయాన్ని విస్తరించాలని 2012లో కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. విస్తరణకు అవసరమైన 800 ఎకరాల సేకరణకు రూ.80 కోట్లు మంజూరు చేసింది. అయినా భూ సేకరణలో అధికారులు వెనకడుగు వేస్తున్నారు. బ్రిటిష్‌వారి హయాంలో ఏర్పాటైన రాజమండ్రి విమానాశ్రయాన్ని అప్పట్లో అత్యవసర సందర్భాల్లో మాత్రమే వినియోగించారు. తర్వాత దీనిని హెలికాప్టర్ల రాకపోకలకు ఉపయోగించారు. సుమారు 366 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ విమానాశ్రయం నుంచి తొలిసారి 1985లో హైదరాబాద్‌కు వాయుదూత్ సర్వీసులు నడిపారు. తర్వాత 1994లో వీఐఎస్ ఎయిర్వేస్ ఇక్కడి నుంచి విమానాలను నడిపింది. అనంతరం డెక్కన్ ఎయిర్వేస్ హైదరాబాద్‌కు సర్వీసులు ప్రవేశపెట్టింది. మూడేళ్ల నుంచి జెట్ ఎయిర్వేస్, స్పైస్‌జెట్ సంస్థలు నిత్యం హైదరాబాద్‌కు సర్వీసులు నిర్వహిస్తున్నాయి. ప్రస్తుతం ఇక్కడి నుంచి హైదరాబాద్‌కు నాలుగు సర్వీసులు ప్రయాణిస్తున్నాయి. గత నెలలో వచ్చిన హుద్‌హుద్ తుపానుతో విశాఖపట్నం విమానాశ్రయం బాగా దెబ్బతింది. ఈ నేపథ్యంలో రాజమండ్రి విమానాశ్రయానికి ప్రాధాన్యం పెరిగింది. ఇవీ విస్తరణ అవసరాలు ఈ విమానాశ్రయంలో చిన్నతరహా విమానాల ల్యాండింగ్‌కు వీలుగా 1.7 కిలోమీటర్ల రన్‌వే ఉంది. భావి అవసరాలకు తగ్గట్టు ఎయిర్‌బస్సులు నడపాలంటే 3.2 కిలోమీటర్ల రన్‌వే కావాలి. ప్రాంగణాన్ని కూడా విస్తరించాలి. ఇందుకు ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుని మరో 800 ఎకరాలు సేకరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. రెండేళ్ల క్రితం రూ.80 కోట్లు మంజూరు చేసింది. కానీ స్థల సేకరణ మాత్రం నేటికీ ప్రారంభం కాలేదు. 2007లో రూ.38 కోట్లతో విమానాశ్రయంలో కొత్త కంట్రోల్ టవర్, టెర్మినల్ నిర్మాణాలు చేపట్టి, 2012 మే నెలలో ప్రారంభించారు. దీంతో పెద్ద విమానాల రాకకు వసతులు మెరుగుపడినా భూసేకరణే అడ్డంకిగా మారింది. కొత్త చట్టం ప్రకారం పరిహారానికి డిమాండ్ గతంలో విమానాశ్రయానికి స్థల సేకరణ సమయంలో టీడీపీ స్థానిక నేతలు మోకాలడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో కొత్త భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించి విస్తరణ చేపట్టాలన్న డిమాండ్ భూముల యజమానులైన రైతుల నుంచి వినిపిస్తోంది. జిల్లాకో విమానాశ్రయం ఏర్పాటు చేస్తామంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు రాజమండ్రి విమానాశ్రయంపై దృష్టి సారించాలని ఉభయ గోదావరి జిల్లాల్లోని విమాన ప్రయాణికులు కోరుతున్నారు.