స్త్రీలు ఎగరేసిన విమానం | Special Story On Deccan Airlines Founder Gopinath In Family | Sakshi
Sakshi News home page

స్త్రీలు ఎగరేసిన విమానం

Published Wed, Nov 18 2020 5:07 AM | Last Updated on Wed, Nov 18 2020 11:38 AM

Special Story On Deccan Airlines Founder Gopinath In Family - Sakshi

నలుగురు స్త్రీలు ఇప్పుడు ప్రశంసలు పొందుతున్నారు. పేదవాడిని రూపాయి టికెట్‌తో విమానంలో కూచోబెట్టిన ‘ఎయిర్‌ డెక్కన్‌’  వ్యవస్థాపకుడు కెప్టెన్‌ గోపీనాథ్‌ నిజ జీవితం ఆధారంగా తెరకెక్కిన ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాకు దర్శకత్వం వహించిన స్త్రీ– సుధ కొంగర...  భర్త విమానం ఎగరేయడానికి ముందే ‘బన్‌ వరల్డ్‌’ అనే బేకరీ పెట్టి అతని
కల నెరవేర్చుకోవడానికి గొప్ప బలం ఇచ్చిన భార్య భార్గవి గోపీనాథ్‌.. ఆ పాత్రను తెర మీద అద్భుతంగా పోషించి హీరోకు హీరోయినూ  సమానమే అని నిరూపించిన మలయాళ నటి అపర్ణ బాల మురళి.. కొడుకు పక్కన కొండలా నిలిచిన తల్లి పాత్ర పోషించిన ఊర్వశీ... వీరంతా ఇప్పుడు ప్రేక్షకులలో స్ఫూర్తినింపే ఒక విమానాన్ని ఎగురవేశారు. గొప్ప కలలు కనడం సామాన్యుడి హక్కు అని సందేశం ఇస్తున్నారు. గోపీనాథ్‌ అతని భార్య గురించిన సినిమా – జీవిత విశేషాల కథనం ఇది.

కెప్టెన్‌ గోపీనాథ్‌గా, ‘ఎయిర్‌ డెక్కన్‌’ గోపీనాథ్‌గా దేశానికి తెలిసిన ఎయిర్‌ డెక్కన్‌ వ్యవస్థాపకుడు గోపీనాథ్‌ 1980లలో తన 28వ ఏట మిలట్రీ నుంచి బయటపడ్డాడు. ఆయన కర్ణాటకలోని తన సొంత ప్రాంతం హసన్‌కు వచ్చి సేంద్రీయ పద్ధతుల్లో తన పెద్దలు ఇచ్చిన పొలంలో సెరికల్చర్‌ ప్రారంభించాడు. ఆయనకు భార్గవితో పెళ్లయ్యింది. ఇద్దరు కుమార్తెలు జన్మించారు. 1997లో చార్టర్‌ హెలికాప్టర్లను అద్దెకు తిప్పే సంస్థను గోపీనాథ్‌ మొదలెట్టే నాటికే పిల్లల చదువు కోసమే కాదు కుటుంబానికి ఆర్థికపరమైన దన్ను కోసం భార్గవి బెంగళూరు వచ్చేశారు. ఆమె బంధువొకరు అప్పటికే బెంగళూరులో బేకరీ నడుపుతున్నారు.

ఆయన సహాయంతో మల్లేశ్వరంలో ఆమె ‘బన్‌ వరల్డ్‌’ అనే బేకరీని స్థాపించారు. కాలేజీలు ఎక్కువగా ఉండే ప్రాంతం కావడాన బన్‌ వరల్డ్‌ విపరీతంగా ఆదరణ పొందింది. విద్యార్థులు అక్కడికి వచ్చి కూచునే స్థలం అయ్యింది. గోపీనాథ్‌ తన జీవితంలో ఏ ప్రయోగం చేసినా, సామాన్యుడు ఎక్కే విమానయాన సంస్థ ప్రారంభించాలనుకున్నా తన వెనుక తన భార్య నడిపే బేకరి ఉంది, తనకు ఆమె సంపూర్ణ మద్దతు ఉంది అని భావించడం వల్లే. అలాగని భార్గవి పూర్తిగా భర్త చాటు భార్యగా పూర్తిగా ఉండలేదు. గోపీనాథ్‌కు సలహాదారుగా, మార్గదర్శి గా, ఆర్థిక సర్దుబాటుదారుగా కూడా ఉంది. అందుకే తన జీవిత కథ స్ఫూర్తితో తీసిన ‘ఆకాశం నీ హద్దురా’ సినిమాను చూసిన గోపీనాథ్‌ ‘నా భార్య పాత్ర ఎలా ఉండాలో అలా ఉంది’ అని చిత్ర హీరో–నిర్మాత సూర్యను, దర్శకురాలు సుధ కొంగరను ప్రశంసించాడు. సినిమాలో ఆయన భార్య పాత్రను మలయాళ నటి అపర్ణ బాలమురళి పోషించింది. భర్తను డీకొట్టేలా ఉంటూనే అతన్ని ఎంతో సమర్థించే పాత్ర అది.


నిజ జీవితం
కర్ణాటకకు చెందిన గోపీనాథ్‌ను భారత పౌర విమానయాన చరిత్రను తిరగరాసిన వ్యక్తిగా చెప్పుకుంటారు. 2003 వరకూ ఆకాశంలో విహరించడం అనేది డబ్బున్నవారి వ్యవహారంగా మాత్రమే దేశంలో ఉంటే గోపీనాథ్‌ తన ‘ఎయిర్‌ డెక్కన్‌’ సంస్థతో దానిని సమూలంగా మార్చేశాడు. ఒక్కశాతం మంది కే అందుబాటులో ఉండే విమానయానాన్ని దాదాపు 40 శాతం మందికి ఆయన చేరువ చేశాడు. చిన్న విమానాలు నడపడం, చిన్న ఊళ్లకు నడపటం, ట్రావెల్‌ ఏజెంట్‌ కమీషన్‌ను తొలగించి నేరుగా టికెట్‌ కొనే ఏర్పాటు చేయడం, ప్రయాణంలో ఇచ్చే తినుబండారాల, పానీయాల చార్జిని తొలగించి అవి కావాల్సిన వారు ఫ్లయిట్‌లోనే కొనుక్కునే ఏర్పాటు చేయడం ఇవన్నీ సంచలనం సృష్టించాయి.

అన్నింటి కంటే మించి ‘ఒక రూపాయి’ టికెట్‌ స్కీమ్‌ పెట్టి రెండు మూడు నెలల ముందు టికెట్‌ బుక్‌ చేసుకుంటే ఒక్క రూపాయికే విమాన ప్రయాణం చేయొచ్చు అని ఆఫర్‌ ఇవ్వడంతో రైలులో ఎన్నడూ ఫస్ట్‌ క్లాస్‌ ప్రయాణం చేసి ఎరగని వారు కూడా విమానం ఎక్కారు. 2003–2007 వరకూ సాగిన ఎయిర్‌ డెక్కన్‌ ఆ తర్వాత ‘కింగ్‌ ఫిషర్‌’లో విలీనం అయ్యింది. తన అనుభవాలను ఆయన ‘సింప్లి ఫ్లై’ పేరుతో పుస్తకంగా రాశాడు. ఆ పుస్తకం స్ఫూర్తిగానే ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా తయారైంది.

సినిమా మార్పు
కెప్టెన్‌ గోపీనాథ్‌ ’సింప్లి ఫ్లై’ పేరుతో తన ఆత్మానుభవాలు రాశాక దానిని చదివిన గిరీష్‌ కర్నాడ్‌ ‘ఈ కథ మంచి సినిమా అవుతుంది’ అని నలుగురికీ చెప్పడం మొదలెట్టాడు. ఈ పుస్తకాన్ని విపరీతంగా ఇష్టపడ్డ సుధ కొంగర రైట్స్‌ కోసం గోపీనాథ్‌ను సంప్రదిస్తే ఎందుకో ఆయన ఇవ్వలేదు. ఈలోపు తన డాక్యుమెంటరీ ‘పిరియడ్‌. ఎండ్‌ ఆఫ్‌ సెంటెన్స్‌’తో ఆస్కార్‌ సాధించిన నిర్మాత గునీత్‌ మోంగా ఆ రైట్స్‌ సాధించింది. అయినా వెనక్కు తగ్గని సుధ ఆ కథను సూర్యాకు చెప్పి ఒప్పించి గునీత్‌తో కలిసి సినిమా నిర్మించేలా ప్రాజెక్ట్‌ను చక్కబరిచింది.

నిజ జీవితంలో కథ కర్నాటకలో జరిగినా సినిమా తమిళంలో తీయడం వల్ల మదురై ప్రాంతానికి (తెలుగులో చుండూరు) మారింది. స్కూల్‌ టీచర్‌ కొడుకైన సూర్య తమ పల్లెలో ఆగని రైలు కోసం పోరాడే స్థాయి నుంచి తన పల్లెవారు విమానం ఎక్కే స్థాయి వరకు చేసే పోరాటం గా ‘సూరారై పొట్రు’ (ఆకాశం నీ హద్దురా) తయారైంది. అప్పటికే విమానయానంలో ఉన్న పెద్ద పెద్ద మొసళ్లు, తిమింగలాలు సామాన్యుడికి విమాన టికెట్‌ అందుబాటులోకి తెస్తాను అంటూ సూర్య బయలుదేరితే ఎటువంటి కష్టాలు తెచ్చి పెడతారో నాటకీయంగా సినిమాకు తగిన స్థాయిలో చూపించారు.

నలుగురు స్త్రీలు
ఈ కథ ఖర్చుతో కూడిన కథ. విమానాలు, ఎయిర్‌పోర్ట్‌లు అంటే పెద్ద బడ్జెట్‌ అవసరం అవుతుంది. మేకింగ్‌ కూడా శ్రమతో నిండినది. ఇలాంటి సినిమాలకు మగ దర్శకులను ఎంచుకోవడం పెద్ద హీరోల ఆనవాయితీ. కాని సూర్య సుధ కొంగర సామర్థ్యాలకు విలువ ఇచ్చారు. ఆమె ఆ కథను సమర్థంగా తీర్చి దిద్ది పరిశ్రమలో స్త్రీ దర్శకుల ఉనికిని సమున్నతంగా నిలబెట్టారు.


‘గురు (వెంకటేశ్‌) హిట్టయ్యాక యూనిట్‌లో నా ముందు ఎవరూ నోరెత్తడం లేదు’ అంటారు సుధ– స్త్రీ దర్శకులకు ఎదురైన చిరాకులను గుర్తు చేసుకుంటూ. ఇక సినిమాలో సూర్యకు భార్యగా చేసిన అపర్ణ మదురై పల్లెటూరు అమ్మాయిగా ఏదైనా సాధిద్దాం అనుకునే మొండి ఆడపిల్లగా పల్లెటూరి అమ్మాయిలను ఉత్సాహ పరుస్తుంది. ఆ పాత్రకు స్ఫూర్తిగా నిలిచిన భార్గవి కథను ఇప్పుడు ఎక్కువ మంది తెలుసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఇక సినిమాలో సూర్య తల్లిగా నటించిన ఊర్వశి కొడుకుపై నమ్మకం ఉంచిన స్త్రీ. అతనికి వెన్నుదన్నుగా నిలుస్తుంది.

నిజ జీవితంలో కాని, సినిమాలో కాని ఈ విమానం కేవలం మగవారి వల్ల ఎగరలేదు... స్త్రీల వల్ల కూడా ఎగరింది అని దర్శకురాలు చాలా నిర్దిష్టంగా, స్పష్టంగా చెప్పడం వల్ల స్త్రీ భాగస్వామ్యం సమాజ ప్రగతిలో ఎంత అవసరమో చెప్పినట్టయ్యింది.పురుషుడు స్త్రీకి, స్త్రీ పురుషుడికి తోడుగా నిలుస్తూ గొప్ప విజయాలు సాధించాలనే స్ఫూర్తి మరోసారి ఉజ్జీవనం కావడం ఎంతో సంతోషకరమైన విషయం. ‘ఎగిరి’ గంతేయాల్సిన విజయం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement