
మద్యంపై పోరే నేరమా?
గోకవరం మండలం గంగంపాలెంలో మద్యం మహమ్మారికి వ్యతిరేకంగా ఎగసిన ఉద్యమంలో పాలు పంచుకున్న క్రమంలో.. కొందరు వైఎస్సార్ సీపీ కార్యకర్తలపైకేసు నమోదు చేయడం ఉద్రిక్తతకు దారి తీసింది. పార్టీ నాయకుడు, గ్రామ సర్పంచ్ భర్త, మరో యువకుడు ఆత్మాహుతికి యత్నించారు. పోలీసుల అనుచిత వైఖరిపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు
జ్యోతుల నెహ్రూ జోక్యంతో శాంతించారు.
గోకవరం : మండలంలోని గంగంపాలెంలో యువకులు ఇటీవల మద్యంపై ఉద్యమం చేపట్టారు. ఈ క్రమంలో గ్రామంలోని సారా బట్టీలపై దాడులు నిర్వహించి సారా తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. గ్రామంలో బెల్టు షాపులపైనా నిఘా పెట్టి ఎక్సైజ్‌శాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు స్పందించకపోవడంతో బెల్టు షాపు మూసేయాలని నిర్వాహకుడైన ఆరుగొల్లి రాంబాబును హెచ్చరించారు. దీంతో తనపై గ్రామానికి చెందిన పలువురు యువకులు దాడి చేశారని రాంబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముక్కా రాజు, వెలమశెట్టి శ్రీను, మరో ఐదుగురిపై రాజమండ్రి అర్బన్ జిల్లా నార్త్‌జోన్ డీఎస్పీ జి.మురళీకృష్ణ బుధవారం ఉదయం విచారణ నిర్వహించి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
కాగా తమ వర్గీయులపై అక్రమంగా అట్రాసిటీ కేసు బనాయించారని ఆరోపిస్తూ సర్పంచ్ సాలపు గంగాభవాని భర్త, వైఎస్సార్ సీపీ నాయకుడు నలమహారాజు పంచాయతీ కార్యాలయంలో తలుపులు వేసుకుని పెట్రోల్ క్యాన్ వెంట ఉంచుకుని ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పంచాయతీ కార్యాలయానికి చేరుకుని నలమహారాజును అనునయించారు. ఆయన ఎంతకీ బయటకు రాకపోవడంతో నెహ్రూ వెంట ఉన్న నాయకులు తలుపులు పగులగొట్టి బయటకు తీసుకువచ్చారు. గ్రామానికి చెందిన మహిళలు విచారణ సందర్భంగా డీఎస్పీ తమతో అనుచితంగా వ్యవహరించారని, అసభ్య పదజాలంతో దూషించారని నెహ్రూ వద్ద వాపోయారు.
ఆగ్రహం వ్యక్తం చేసిన నెహ్రూ గోకవరం పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ఎస్సై ఆర్.శివాజీతో మాట్లాడారు. డీఎస్పీ వచ్చి సమాధానం చెప్పాలని పట్టుపట్టారు. విషయం తెలిసి మండలానికి చెందిన వైఎస్సార్ సీపీ శ్రేణులు, గంగంపాలెం మహిళలు పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని ధర్నా చేశారు. ఓ యువకుడు పెట్రోల్ ఒంటిపై పోసుకుని స్టేషన్‌లోకి చొరబడి డీఎస్పీ రాకపోతే ఆత్మహత్యకు పాల్పడతానడంతో ఉద్రిక్తత నెలకొంది. కోరుకొండ సీఐ సన్యాసిరావు, ఎస్సై తదితరులు ఆ యువకుడిని వారించి పెట్రోల్ క్యాన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
అక్రమ కేసులను సహించం : జ్యోతుల
సుమారు రెండు గంటల ఆందోళన అనంతరం డీఎస్పీ మురళీకృష్ణ పోలీస్‌స్టేషన్ వచ్చి నెహ్రూతో మాట్లాడారు. మద్యంపై ఉద్యమించిన యువకులపై అక్రమంగా అట్రాసిటీ కేసు పెట్టడంపై నెహ్రూ ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. గ్రామ మహిళలతో అనుచితంగా ఎందుకు వ్యవహరించాల్సి వచ్చిందని నిలదీశారు. సర్పంచ్ భర్త ఆత్మహత్యకు యత్నించినాకనీసం స్పందించలేదన్నారు. కేవలం వైఎస్సార్ సీపీ వారిపైనే అక్రమంగా కేసులు పెడుతున్నారని, తాను వచ్చాకే తమ వారి ఫిర్యాదుపై కేసు నమోదు చేశారని విమర్శించారు. రెండు కేసులనూ వెంటనే తొలగించి, పరిస్థితులు చక్కబడే వరకు గ్రామంలో బందోబస్తు నిర్వహించాలని డిమాండ్ చేశారు. డీఎస్పీ సానుకూలంగా స్పందించడంతో నెహ్రూ బయటకు వెళ్లి ధర్నాకు దిగిన పార్టీ శ్రేణులతో మాట్లాడారు. న్యాయం జరుగుతుందని ఆయన ఇచ్చిన హామీతో ఆందోళన విరమించారు. ఆందోళనతో గ్రామంలోని ప్రధాన రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి.