మామూళ్లు.. పరవళ్లు
జిల్లాలో నెలకు రూ. 110 కోట్ల మద్యం విక్రయాలు
ఆమ్యామ్యాల రూపేణా రూ. 1.42 కోట్ల పంపకాలు
ఎమ్మార్పీ ఉల్లంఘనతో వ్యాపారులకు
రూ. 5 కోట్లకు పైగా అదనపు ఆదాయం
అధికార పార్టీ సంపూర్ణ సహకారం
విజయవాడ : జిల్లాలో మద్యం ఏరులై పారుతోంది. మామూళ్లు పరవళ్లు తొక్కుతున్నాయి. వందల సంఖ్యలో వైన్ షాపులు, ఎక్కువగా బార్లు ఉండడంతో నిత్యం కోట్లల్లో వ్యాపారం జరుగుతోంది. ‘తిలాపాపం..తలా పిడికెడు’ చందంగా ఎక్సైజ్, పోలీసు శాఖలో కానిస్టేబుల్ మొదలుకొని ఉన్నత స్థాయి అధికారుల వరకు అందరు నెలవారీ మామూళ్లు తీసుకుని చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఎక్సైజ్‌కు రూ. 71.49 లక్షలు, పోలీసు శాఖకు రూ. 71.40 లక్షలు నెలవారీ వ్యాపారులు సమర్పించుకుంటున్నారు. దీన్ని తిరిగి రాబట్టుకునే క్రమంలో ఎమ్మార్పీని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారు. నెలకు రూ. 5 కోట్లకు పైగా అదనపు ఆదాయాన్ని పొందుతూ మందుబాబుల జేబులకు చిల్లు పెడుతున్నారు. దీనికి అధికార పార్టీ నేతలు పూర్తిస్థాయిలో సహకారం అందిస్తున్నారు. జిల్లాలో కొత్తగా ప్రభుత్వ షాపుల స్థానంలో వచ్చినవాటితో కలిపి 343 వైన్ షాపులున్నాయి. 167 బార్లు ఉన్నాయి. నెలకు సగటున రూ.110 కోట్లకు పైనే మద్యం విక్రయాలు జరుగుతుంటాయి.
70 శాతానికి పైగా వైన్ షాపులు, బార్లల్లో రోజుకు రూ. లక్షకుపైగా మద్యం విక్రయాలు ఉంటాయి. ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ నిబంధనలను పూర్తిగా తుంగలో తొక్కుతున్నారు. ఎక్కడా మద్యాన్ని ఎమ్మార్పీకి విక్రయించరు. సమయపాలన అస్సలు పాటించరు. వైన్ షాపుల్లో ఇష్టారాజ్యంగా లూజ్ సేల్స్ సాగిస్తున్నారు. పోలీసులు మొదలుకొని ఎక్సైజ్ శాఖ వరకు అప్పుడప్పుడు ఆధికార పార్టీ నేతలు చేప్పే ఖర్చులన్నీ లిక్కర్ వ్యాపారులే చూసుకోవడంతో అధికారులు పూర్తిగా వ్యాపారుల ఇష్టానికే వదిలేశారు. దీంతో అడ్డగోలుగా విక్రయాలు సాగిస్తున్నా నామమాత్రంగా కూడా వైన్ షాపులు, బార్లపై కేసులు నమోదుచేస్తున్న దాఖలాలు లేవు.
మామూళ్లు ఇలా..
జిల్లాలో మామూళ్ల వ్యవహారం బహిరంగ రహస్యమే. నెలకు రూ 1.42 కోట్లకు పైగా వివిధ విభాగాల అధికారులకు అందుతాయి. ఒక్కో వైన్ షాపు నుంచి ఎక్సైజ్ స్టేషన్‌కు నెలకు రూ. 15 వేలు అందుతున్నాయి. గత ఏడాది వరకు ఇది రూ. 12 వేలే. పెరిగిన ఖర్చుల నేపథ్యంలో మామూళ్లనూ పెంచారు. ఒక్కో బార్ నెలకు రూ. 12 వేలు ముట్టజెప్పాలి. ఇది కేవలం ఎక్సైజ్ శాఖ మామూలు మాత్రమే. ఇందులో ఎక్సైజ్ కానిస్టేబుల్ మొదలుకొని జిల్లా స్థాయి అధికారి వరకు అందరికీ వాటాలుంటాయనేది అందరికీ తెలిసిందే. వైన్ షాపు, బార్ నుంచి సంబంధిత లా అండ్ ఆర్డర్ పోలీసు స్టేషన్‌కు రూ. 14 వేలు మామూళ్లు అందుతాయి. ఇందులో కూడా కింది స్థాయి నుంచి పైస్థాయి అధికారి వరకు అందరికీ వాటాలుంటాయి. అప్పుడప్పుడు స్టేట్ టాస్క్‌ఫోర్స్ బృందానికి కూడా కొంత మొత్తం మామూళ్ల రూపేణా అందుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
3000కు పైగా బెల్ట్ షాపులు
రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బెల్ట్ షాృులు లేకుండా చేస్తామని చంద్రబాబు ప్రకటించారు. దీన్ని ఎక్సైజ్ అధికారులు సీరియస్‌గా తీసుకున్నారు కాని అమలు మాత్రం చేయడం లేదు. జిల్లాలోని గ్రామాల్లో ప్రతి వైన్ షాపునకు అనుబంధంగా సగటున 20 నుంచి 50 వరకు బెల్ట్ షాపులున్నాయి. నూజివీడు, తిరువూరు, మైలవరం, కైకలూరు. పెడన, నందిగామ, జగ్గయ్యపేట తదితర ప్రాంతాల్లో పదుల సంఖ్యలో బెల్ట్ షాపులు ఉన్నాయి. వైన్ షాపుల్లో ఎమ్మార్పీ కంటే రూ. 10 అధికంగా విక్రయిస్తుంటే.. బెల్ట్ షాపుల్లో మాత్రం రూ. 20 నుంచి రూ. 30 వరకు అధిక ధరకు అమ్ముతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు జిల్లాలో ఎక్సైజ్ అధికారులు బెల్ట్ షాపుల విక్రేతలపై 418 కేసులు నమోదు చేశారు.