పండగ చేస్కో !
దసరా మద్యం అమ్మకాలు రూ.16.11 కోట్లు
గతేడాది కంటే దాదాపు రూ.3 కోట్లు ఎక్కువ
21 రోజుల్లో రూ.73.23 కోట్ల మద్యం వ్యాపారం
విశాఖపట్నం : దసరా సంబరాలను మందు బాబులు భలే జరుపుకున్నారు. ప్రభుత్వానికి భారీ ఆదాయాన్ని అందించారు. మరోవైపు మద్యం మత్తులో జనాన్ని ముంచి డబ్బులు సంపాదించే ప్రయత్నంలో భాగంగా ప్రభుత్వం ‘చీప్’ ట్రిక్స్ ప్లే చేస్తోంది. కొన్ని రకాల మద్యం ధరలు 10 శాతం తగ్గిస్తూనే భారీగా పన్నులు బాదేసింది. దీనివల్ల పేద, మధ్యతరగతి ప్రజలు మద్యానికి బానిసలవుతారు. కానీ సర్కారుకు మాత్రం ఆర్థిక లాభం చేకూరుతుంది.
ఈ ఏడాది దసరా మూడు రోజుల్లో (19,20,21 తేదీల్లో) సుమారు రూ.16.11 కోట్ల విలువ చేసే మద్యం విక్రయాలు జరిగాయి. గతేడాది ఇదే సమయంలో జరిగిన అమ్మకాల కంటే దాదాపు రూ.2.69 కోట్లు ఎక్కువ. అయితే గతేడాదితో పోల్చితే ఈ ఏడాది లిక్కర్ అమ్మకాలు అంతగా పెరగలేదు. బీరు మాత్రం రెట్టింపు తాగేశారు. గతేడాది ఇదే నెలలో 21వ తేదీ వరకూ జరిగిన అమ్మకాలతో పోల్చితే ఈ ఏడాది ఏకంగా దాదాపు రూ.21.72 కోట్లు అదనపు విక్రయాలు జరిగాయి.