మద్యం కిక్కు రూ.11 కోట్లు
మద్యం కిక్కు రూ.11 కోట్లు
Published Sun, Jan 1 2017 10:09 PM | Last Updated on Thu, Sep 27 2018 4:42 PM
- డిసెంబర్ 30, 31 తేదీల్లో భారీగా కొనుగోళ్లు
- కరువులోనూ పెరిగిన ఎక్సైజ్ ఆదాయం
- లక్ష్యాలు విధించిన ప్రభుత్వం
- వ్యాపారులపై పెరుగుతున్న అధికారుల ఒత్తిడి
కర్నూలు: కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ.. డిసెంబరు 31న జరిగిన నూతన వేడుకల్లో మందుబాబులు సుమారు రూ.10.65 కోట్ల విలువ చేసే మద్యాన్ని తాగేశారు. జిల్లా వ్యాప్తంగా 203 మద్యం దుకాణాలు, 35 బార్లు, రెండు క్లబ్‌లు ఉన్నాయి. కల్లూరు శివారుల్లోని హంద్రీనది ఒడ్డున ఉన్న ఇండియన్ మేడ్ లిక్కర్ (ఐఎంఎల్) డిపో నుంచి ప్రతి రోజు రూ.2 కోట్ల విలువ చేసే మద్యం దుకాణాలకు సరఫరా అవుతుంది. 2016 డిసెంబరు నెలంతా రూ.72.22 కోట్లు మద్యం కొనుగోళ్లు జరగగా, 30వ తేదీన రూ.6.15 కోట్లు, 31వ తేదీన రూ.4.50 కోట్లు మద్యాన్ని డిపో నుంచి వ్యాపారులు కొనుగోలు చేశారు. గత మూడు సంవత్సరాలుగా డిసెంబరు నెలలో అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయి. 2014 డిసెంబరు నెలలో రూ.60 కోట్ల వ్యాపారం జరుగగా, 2015 లో రూ.68.73 కోట్లు, 2016 డిసెంబర్ నెలలో రూ.72.22 కోట్లు మద్యం కొనుగోళ్లు చేశారు.
ఏటా పెరుగుతున్న మద్యం అమ్మకాలు..
మద్యం అమ్మకాలతో ప్రభుత్వానికి జిల్లా నుంచి భారీ ఆదాయమే లభిస్తోంది. జిల్లాలో కరువు పరిస్థితులు ఉన్నా.. వ్యాపారుల అంచనాలను మద్యం ప్రియులు పటాపంచలు చేశారు. ఎౖక్సైజ్ ఆర్థిక సంవత్సరం ఏడు నెలల కాలంలో రూ.468.32 కోట్లు మద్యాన్ని తాగేశారు. తక్కువ వ్యవధిలోనే ప్రభుత్వానికి మద్యం బాబులు కోట్ల రూపాయల ఆదాయాన్ని సమకూర్చారు. యేటా ఊహించని స్థాయిలో విక్రయాలు పెరుగుతున్నారు. మందుబాబులు ఏడాదంతా కిక్కులోనే తూలుతున్నారు. నూతన మద్యం పాలసీ విధానం 2015 జూలైలో అమలులోకి వచ్చింది. ఇన్‌వాయిస్« ధరకు అదనంగా 20 శాతం కలిపి ఎంఆర్‌పీ ధర మద్యం సీసాపై ఉంటుంది. ఆ మొత్తం వినియోగదారుడు చెల్లించాల్సి ఉంటుంది. అంటే వ్యాపారులు కొనుగోలు చేసిన (ఎక్సైజ్ ఆర్థిక సంవత్సరం)రూ.468.32 కోట్లకు ఎంఆర్‌పీ జత చేస్తే అక్షరాలా రూ. 562 కోట్ల అమ్మకాలు జరిగాయన్న మాట. మద్యం ద్వారా ఆదాయం పెంచుకునేందుకు ప్రభుత్వం అధికారులపై ఒత్తిడి తెచ్చి లక్ష్యాలు విధించింది. పెద్ద నోట్ల రద్దు కారణంగా గత నెలలో 20 శాతం ఆదాయం ఎక్సైజ్ శాఖకు తగ్గింది. దాన్ని కూడా భర్తీ చేసేందుకు ప్రభుత్వం అధికారులకు లక్ష్యాలు విధించడంతో వ్యాపారులపై ఒత్తిడి పెంచి కొనుగోళ్లు జరిపించారు.
Advertisement