
అన్ని పార్టీలూ ఆలోచిస్తున్నాయి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంట్ ముందుకొస్తే ఆయా రాజకీయ పార్టీలు దాన్ని వ్యతిరేకిస్తాయనే విశ్వాసం తమకుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ, కేంద్ర ప్రభుత్వ క్షుద్ర రాజకీయాలను జాతీయస్థాయిలో ఆయా రాజకీయ పార్టీల దృష్టికి తెచ్చి వారి మద్దతు కూడగట్టడంలో జగన్‌మోహన్‌రెడ్డి కృతకృత్యులయ్యారని చెప్పారు.
మంగళవారంనాడిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ, గత కొద్దిరోజులుగా జగన్ నేతృత్వంలోని తమ పార్టీ ప్రతినిధి బృందం రాష్ట్రపతి ప్రణ బ్ ముఖర్జీని, వామపక్షాలను, బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్, జేడీ(యూ), బీజేడీ, ఎన్సీపీ, శివసేన పార్టీల నాయకులను కలుసుకుందన్నారు. అసెంబ్లీ తీర్మానం లేకుండానే నిరంకుశంగా రాష్ట్ర విభజన చేస్తున్న విషయంతో పాటు రాజ్యాంగంలోని 3వ అధికరణను ఎలా దుర్వినియోగం చేస్తోందో జగన్ వివిధ పక్షాల నేతలకు వివరించారన్నారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాలను విభజించి కొత్త రాష్ట్రాలు ఏర్పాటు చేసినపుడు ఆయా రాష్ట్రాల అసెంబ్లీల నుంచి తీర్మానం తీసుకున్నారని, అయితే ఆంధ్రప్రదేశ్ విషయానికొచ్చినపుడు అలాంటి సంప్రదాయాన్ని పాటించకుండా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుంటున్నారని జగన్ వారి దృష్టికి తెచ్చారన్నారు. ఇదేదో కాంగ్రెస్ సొంతింటి వ్యవహారం మాదిరిగా చేయడం అప్రజాస్వామికం అని చెప్పారని తెలిపారు.
తమ పార్టీ వాదనతో అన్ని పక్షాలూ ఏకీభవించాయని, తప్పకుండా పార్లమెంటులో ఈ విషయం చెబుతామని వారు హామీ ఇచ్చారని అన్నారు. వైఎ స్సార్ కాంగ్రెస్ చేసిన ఈ ప్రయత్నాల వల్ల తప్పకుండా ఆయా పక్షాలు పార్లమెంటులో విభజన బిల్లు వస్తే వ్యతిరేకిస్తాయనే నమ్మకం కలుగుతోందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. త్వరలో సమాజ్‌వాదీ పార్టీ(ఎస్‌పీ), డీఎంకే, ఏడీఎంకే అధినేతలను కూడా జగన్‌మోహన్‌రెడ్డి కలిసి పరిస్థితులను వివరిస్తారన్నారు. రాయల తెలంగాణ ఏర్పాటు ప్రతిపాదన అత్యంత దుర్మార్గమైందని, రాజకీయ లబ్ధి కోసం ఎంత పతనస్థాయికి దిగజారుతారనేది దీన్ని బట్టి అర్థం అవుతోందని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.