సాక్షి ప్రతినిధి, ఖమ్మం: అడవిని నమ్ముకున్న ఆదివాసీ గిరిజనులకు పెద్ద ఆపదే వచ్చింది. ఆధునిక ప్రపంచంతో అంతగా సంబంధం లేని ఏజెన్సీ గిరిజనుల ‘పోడు’ జీవితానికి పెద్ద కష్టమే వచ్చిపడింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ఉండాలన్న ఆలోచనతో జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాన్ని సీమాంధ్రలో కలపాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించిందన్న వార్తలు ఇప్పుడు జిల్లా గిరిపుత్రుల్లో అలజడిని రేపుతున్నాయి.
సంస్కృతి, సాంప్రదాయాల పరంగా దశాబ్దాల తరబడి తెలంగాణతో ముడిపడి ఉన్న బంధంతో పాటు పోడు వ్యవసాయంపై ఆధారపడి జీవించే వీరిని.. పరిహారం చెల్లించి వేరే ప్రాంతానికి వెళ్లాలంటుండడంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర విభజన పుణ్యమా అని తమకు సీతమ్మ కష్టాలు వచ్చాయని వారు వాపోతున్నారు. ముంపు పేరుతో తమను ఆంధ్రకు తరలించినా, తాము అక్కడ ఉండలే మని, ఈ ప్రాంతంలోని చెట్టూ, పుట్టాతో తరతరాలుగా అనుబంధం ఉందని, తెలంగాణను విడిచి వెళ్లలేమని వారు తెగేసి చెపుతున్నారు. ఇందుకు అనేక కారణాలు కనిపిస్తున్నాయి.
ఓటెక్కడేయాలి బాబూ...!
సార్వత్రిక ఎన్నికలు త్వరలోనే జరగనున్న నేపథ్యంలో తెలంగాణ ప్రాంతం నుంచి ఏడు మండలాల ప్రజలను సీమాంధ్రలో కలపాల్సి వస్తుండడంతో వారు ఓటు హక్కు ఎక్కడ వినియోగించుకోవాలనే దానిపై సందిగ్ధత నెలకొంది. కుక్కునూరు, వేలే రుపాడు, బూర్గంపాడు మండలాలు ఓ వైపు, వీఆర్‌పురం, కూనవరం, చింతూరు, భద్రాచలం మండలాలు మరోవైపు ముంపునకు గురవుతాయి. వీటిని ఆంధ్ర ప్రాంతంలో కలిపితే జిల్లా భౌగోళిక స్వరూపమే మారిపోతుంది. ప్రస్తుతం 46 మండలాలు ఉండగా.. ఆ సంఖ్య 42కు తగ్గిపోతుంది.
మూడు మండలాల్లో సగం గ్రామాలు ఆంధ్రలో, సగం తెలంగాణలో ఉండాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో ఈసారి ఎన్నికలలో సీమాంధ్రలో కలిసే గిరిజనులు ఓటుహక్కు ఎక్కడ వినియోగించుకుంటారనేది తేలడం లేదు. ప్రస్తుతానికి యథాతథంగా అశ్వారావుపేట, భద్రాచలం, పినపాక అసెం బ్లీ, ఖమ్మం, మహబూబాబాద్ పార్లమెంటు స్థానాల పరిధిలోనే వారి ఓట్లుంటాయని చెపుతున్నా, తర్వాతయినా వారిని ఎక్కడకు పంపుతారనేది కీలకంగా మారనుంది. ఎందుకంటే ఓ టు హక్కు తెలంగాణలో ఉండి ప్రజలు సీ మాంధ్రలో ఉంటే వారి సమస్యల పరిష్కారం రెంటికీ చెడ్డ రేవడే అవుతుంది.
అసలు ఆ ఎమ్మెల్యేలు ఏ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించాలన్నది కూడా సమస్య కానుంది. ఈ పరిస్థితుల్లో వా రి అభివృద్ధిపై ప్రజాప్రతినిధులు దృష్టి సారించే అవకాశం ఉండదు. ఏది ఏమైనా ఈ ఓటు హ క్కు విషయంలో పార్లమెంటులో బిల్లు పెట్టేంతవరకు ఏదీ ఊహించలేమని, అప్పుడే కేంద్రం తన వైఖరిని స్పష్టం చేస్తుందని చెపుతున్నారు.
రహదారి కష్టాలు అన్నీ ఇన్నీ కావు...
సీమాంధ్రకు న్యాయం చేయాలనే వాదనలో భాగంగా భద్రాచలం డివిజన్‌ను ఆ ప్రాంతంలో కలిపితే.. తమకు అష్టకష్టాలు తప్పవని గిరిజనులు అంటున్నారు. ఎందుకంటే గోదావరి నది ఇవతల కుక్కునూరు, వేలేరుపాడు మండలాలు, బూర్గంపాడు మండలంలో ఐదు రెవెన్యూ గ్రామాలు సీమాంధ్రలో కలుస్తాయి. ఇవన్నీ పాల్వంచ డివిజన్‌లో ఉంటాయి. ఇప్పుడు సీమాంధ్రలో కలిస్తే అశ్వారావుపేట, జంగారెడ్డిగూడెం మీదుగా రాజమండ్రి వెళ్లడానికి వీరు కనీసం 130 కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది.
ఇక గోదావరి అవతల వీఆర్‌పురం, కూనవరం మండలాలు పూర్తిగా చింతూరు, భద్రాచలం మండలాలు పాక్షికంగా ముంపునకు గురవుతాయి. అవి భద్రాచలం డివిజన్‌లోనికి వస్తాయి. రాష్ట్రం విడిపోయి సీమాంధ్రలో కలిస్తే వీరంతా విశాఖపట్నం లేదా కాకినాడ వెళ్లాలి. కాకినాడ వెళ్లాలంటే ఘాట్ రోడ్డులో 200 కిలోమీటర్లకు పైగా వెళ్లాల్సి ఉంటుంది. విశాఖపట్నం అయితే 300 కిలోమీటర్లు వెళ్లాలి. ఎటు వెళ్లాలన్నా ఒక పూటంతా ప్రయాణం చేయాల్సిందే. విద్య, వైద్యం, ఇతర సౌకర్యాల కోసం సింగిల్‌రోడ్డులో అంతదూరం వెళ్లి రావడం ఎంత కష్టమో చెప్పలేని పరిస్థితి.
జిల్లా కేంద్రం మధ్యలో ఏర్పాటు చేస్తే (రంపచోడవరం లాంటి ప్రాంతాల్లో) వారికి తిప్పలు తప్పినట్లే. ఇక, ముంపు పేరుతో సీమాంధ్రలో కలిపే సుమారు 1.6 లక్షల మందిని ఏ నియోజకవర్గంలో ఎలా కలుపుతారన్నది అంతుపట్టడం లేదు. వాస్తవానికి అసెంబ్లీ లేదా పార్లమెంటు నియోజకవర్గాల్లో ఏ ప్రాంతాలను కలపాలన్నా డీలిమిటేషన్ ప్రక్రియ చేపట్టాల్సి ఉంటుంది. దీనిని ఎలా పరిష్కరిస్తారన్నది కూడా ఇబ్బందిగా మారనుంది.
పరిహారం ‘ఏం’ చేస్తారు?
ఇక, పోలవరం ముంపునకు గురయ్యే వారికి ప్రభుత్వం చెల్లించే పరిహారం కూడా ఎలా ఉంటుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఎందుకంటే గతంలో నిర్ధారించిన విధంగా అందరికీ పరిహారం చెల్లించలేదు. తెలంగాణ ప్రాంతంలో ఎకరానికి రూ.1.40 లక్షలు, ఆంధ్రప్రాంతంలో ముంపునకు గురవుతున్న వారికి రూ. 3.50 లక్షల చొప్పున కొందరికి మాత్రమే చెల్లించారు. ఇందుకు రిజిష్ట్రేషన్ విలువలు, భూసారం, మార్కెట్ ధర, రెండు పంటలు, మూడు పంటలు లాంటి సాకులు చూపారు.
ఇంకా చాలా మంది నిర్వాసితులకు పరిహారం చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇటీవలే అమల్లోకి వచ్చిన నూతన భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇస్తారా? పాత అగ్రిమెంట్ మేరకు వెళతారా అన్నది స్థానిక గిరిజనుల్లో చర్చనీయాంశమవుతోంది. నూతన చట్టం ప్రకారం ఇచ్చినా ఆరేడు లక్షలకు మించి రావు. ఈ నేపథ్యంలో తాము పరిహారం తీసుకుని వెళ్లిపోతే వారిచ్చే డబ్బుతో ఆంధ్ర ప్రాంతంలో అర ఎకరం కూడా కొనలేమని స్థానిక గిరిజనులంటున్నారు.
పోడు వ్యవసాయం చేసుకునే తమకు ఆ డబ్బు దేనికి సరిపోతాయని ప్రశ్నిస్తున్నారు. అశ్వారావుపేట, ముల్కలపల్లి, దమ్మపేట మండలాల మధ్యలోని అటవీ భూములను పోడు చేసుకుని జీవించేందుకు సిద్ధంగా ఉన్నామే తప్ప ఆంధ్రకు వెళ్లే ప్రసక్తి లేదని వారు చెబుతున్నారు. మరోవైపు సీమాంధ్రకు వెళితే పరిహారం చెల్లింపు ప్రక్రియ ఎలా ఉంటుందోనన్న ఆందోళన కూడా ఇక్కడి గిరిజనుల్లో వ్యక్తమవుతోంది. ఓటు హక్కుతో సహా పూర్తిగా ఆ ప్రాంతంలో కలుపుకోకుండా తమను సీమాంధ్ర ప్రాంతం కింద గుర్తిస్తే అటు తెలంగాణ, ఇటు సీమాంధ్రలకు తాము రెంటికీ చెడ్డ రే వడిలా మారుతామని వాపోతున్నారు. అసలు తమకు పరిహారం ఇప్పించేందుకు ఎవరు పోరాడుతారు.. తమను ఎవరు పట్టించుకుంటారు అని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు వీరికి సంక్షేమ పథకాల అమలు కూడా కష్టమేననే ఆందోళన వ్యక్తమవుతోంది.
మా బతుకు గోదారేనా?
Published Mon, Feb 10 2014 2:30 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
Advertisement
Advertisement