రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితి ప్రకారమే.. అంటే ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు జరుగుతాయి. ఈ విషయాన్ని ప్రధాన ఎన్నికల కమిషనర్ వి.ఎన్.సంపత్ తెలిపారు. తెలంగాణలోని పది జిల్లాల్లోను ఏప్రిల్ 30వ తేదీన, సీమాంధ్ర ప్రాంతంలోని 13 జిల్లాల్లోను మే 7వ తేదీన పోలింగ్ జరుగుతుంది.
అయితే అపాయింటెడ్ డేట్ జూన్ 2వ తేదీ అని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది కాబట్టి, తాము రాజ్యంగం, చట్టం ప్రకారమే వెళ్తామని.. అంటే ఉమ్మడి రాష్ట్రం మాత్రమే ఎన్నికల నాటికి, ఇప్పుడు కూడా ఉంది కాబట్టి ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు నిర్వహిస్తామని సంపత్ చెప్పారు. పైగా తాము ఎక్కడికక్కడ అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల వారీగా ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.
తెలంగాణలో ఏప్రిల్ 2న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. ఇక్కడ నామినేషన్ల దాఖలు గడువు ఏప్రిల్ 9. 10న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఏప్రిల్ 12 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. ఇక సీమాంధ్రలో ఏప్రిల్ 12న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. నామినేషన్ల దాఖలు గడువు ఏప్రిల్ 19. నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 21న ఉంటుంది. 23 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువుంటుంది.