
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
- టీటీడీ ఈవో సాంబశివరావు వెల్లడి
తిరుమల: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం చేశామని టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు వెల్లడించారు. శుక్రవారం ఇక్కడి అన్నమయ్య భవన్ అతిథిగృహంలో జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు, సీవీఎస్‌వో ఘట్టమనేని శ్రీనివాస్‌తో కలసి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను మీడియాకు వెల్లడించారు. అక్టోబరు 1 నుండి 12వ తేదీ వరకు తిరుమల రెండు ఘాట్‌రోడ్లలో 24 గంటలూ వాహనాల రాకపోకలకు అనుమతిస్తామన్నారు.
భక్తుల దర్శనార్థం 7వ తేదీన గరుడ వాహన సేవను రాత్రి 7.30 గంటలకే నిర్వహిస్తామన్నారు. వాహన మండపం నుండి హథీరాంజీ మఠం వరకు ఉండే సుమారు 25 వేల మంది భక్తులను గరుడ సేవను దర్శించుకున్న తర్వాత వారిని వెలుపలకు పంపి అదేస్థానంలో కొత్తవారికి అవకాశం ఇచ్చేందుకు ప్రయత్నిస్తుమన్నారు. వాహన సేవలో హారతి కూడళ్ల వద్ద రెట్టింపు స్థాయిలో భక్తులను అనుమతించి ఉత్సవ దర్శనం కల్పిస్తామన్నారు.
గరుడ సేవలో శ్రీవారి మెట్టు కాలిబాట మార్గాన్ని 24 గంటలూ తెరిచి ఉంచే ఏర్పాట్లు చేస్తామన్నారు. రోజుకు 2 వేల ఆర్టీసీ బస్సు ట్రిప్పులు, గరుడసేవలో 3800 ట్రిప్పులు తిరిగే ఏర్పాట్లు చేశామన్నారు. ఉదయం 9 నుండి అర్థరాత్రి 1 గంట వరకు అన్నప్రసాదాలు వడ్డించే ఏర్పాట్లు చేస్తామన్నారు. భక్తుల ఫిర్యాదులు, సూచనల కోసం కామన్ కమాండ్ కంట్రోల్ రూమ్‌లో టోల్‌ఫ్రీ నెంబరు 1800425111111 అందుబాటు ఉంటుందన్నారు. నాణ్యత ప్రమాణాలు పరిశీలించాకే లడ్డూలు వితరణ చేస్తామన్నారు.