అక్టోబరు 3 నుండి 11వ తేదీ వరకు జరగనున్న తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు అన్నారు.
- టీటీడీ ఈవో సాంబశివరావు
తిరుమల : అక్టోబరు 3 నుండి 11వ తేదీ వరకు జరగనున్న తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని టీటీడీ ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు అన్నారు. మంగళవారం ఇక్కడి అన్నమయ్య భవన్ అతిథిగృహంలో ఆయన టీటీడీలోని అన్ని విభాగాల ఉన్నతాధికారులతో బ్రహ్మోత్సవాలపై సమీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈసారి ఉత్సవాలకు రద్దీ అనూహ్యంగా పెరిగే అవకాశం ఉందని, అందుకు తగ్గట్టుగా బస, దర్శనం, అన్నప్రసాదం, భద్రత,ఉత్సవాల ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
16వ తేదీన పౌర్ణమి సందర్భంగా గరుడ వాహన సేవను మాదిరి బ్రహ్మోత్సవాల తరహాలోనే నిర్వహించి లోటుపాట్లను పరిశీలిస్తామన్నారు. ఉత్సవాల్లో వాహన సేవను భక్తులందరూ దర్శించుకునే ఏర్పాట్లు చేస్తామన్నారు. ఉత్సవాల్లో భక్తులకు లడ్డూల కొరత లేకుండా 7 లక్షల లడ్డూలు నిల్వ ఉంచుకునే ఏర్పాట్లు చేశామన్నారు. ఉత్సవాలతోపాటు తిరుమల శనివారాల నేపథ్యంలో ఆలయంలోని మూలమూర్తి దర్శనం కూడా పకడ్బందీగా నిర్వహిస్తామని, రోజుకు కనీసం 80 నుండి 90వేల పైబడి భక్తులకు సంతృప్తిక దర్శనం కల్పిస్తామన్నారు.