అందరి నోటా సమైక్యాంధ్ర నినాదమే
Published Tue, Aug 6 2013 3:16 AM | Last Updated on Fri, Sep 1 2017 9:40 PM
స్వార్థ రాజకీయాల్లో భాగంగా చోటు చేసుకున్న రాష్ట్ర విభజనపై ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. చిన్నా.. పెద్ద తేడా లేకుండా ఆవేశం కట్టలు తెంచుకుంటోంది. సమైక్యమే ముద్దు.. తెలంగాణ వద్దే వద్దనే నినాదం హోరెత్తుతోంది. ప్రధాన పట్టణాలతో పాటు పల్లెల్లోనూ ఉద్యమం రగులుకుంటోంది. రోజుకో రీతిలో ఉద్యమకారులు నిరసన తెలియజేస్తున్నారు. కదం తొక్కుతూ.. పదం కలుపుతూ తెలుగుతల్లికి నీరాజనాలు అర్పిస్తున్నారు. సోమవారం కూడా జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. మున్సిపల్ ఉద్యోగుల సమ్మెతో పౌరసేవలు పూర్తిగా స్తంభించాయి. న్యాయవాదుల రిలే దీక్ష యథాతథంగా కొనసాగింది. ఉద్యోగ జేఏసీ ఆందోళనలు, మున్సిపల్ ఉద్యోగుల నిరసనలు, ట్రాక్టర్ అసోసియేషన్ యజమానులు, ఎల్‌పీజీ గ్యాస్ డీలర్లు, సిబ్బంది.. లైటింగ్, ఫ్లవర్ డెకొరేషన్ అసోసియేషన్ కార్మికుల ప్రదర్శనలతో నగరంలో ఎటుచూసినా ఉద్యమ వాతావరణమే కనిపించింది.
యువత ద్విచక్ర వాహనాలతో ర్యాలీలు చేపట్టగా.. పశుసంవర్ధక శాఖ ఉద్యోగుల నేతృత్వంలో పాతబస్టాండ్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రదర్శన నిర్వహించారు. చెన్నమ్మ సర్కిల్‌లో పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి జాతీయ రహదారిని దిగ్భందించారు. కర్నూలులో కేవీ సుబ్బారెడ్డి విద్యా సంస్థల అధినేత కె.వి.సుబ్బారెడ్డి, సురక్ష హాస్పిటల్ అధినేత డాక్టర్ బి.ప్రసాద్‌ల ఆమరణదీక్ష కొనసాగిస్తుండగా.. వీరి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు సమీక్షిస్తున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని డిమాండ్ చేస్తూ చిన్ననీటి పారుదల శాఖ మంత్రి టీజీ వెంకటేష్ కర్నూలులో కాంగ్రెస్ పార్టీ కారా్యాలయం వద్ద 10 గంటల పాటు నిరవధిక దీక్ష చేపట్టారు. ఉద్యమాన్ని కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.
పైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు వారం రోజులుగా ఉద్యమంలో స్వచ్ఛందంగా పాల్పంచుకుంటుండటంతో పాఠశాలలు మూతపడ్డాయి. ఆళ్లగడ్డ పట్టణంలో గుండా రవికుమార్ అనే వికలాంగుడు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు సకాలంలో స్పందించి అతన్ని రక్షించారు. నంద్యాలలో నేషనల్ విద్యాసంస్థల సిబ్బంది, విద్యార్థులు శ్రీనివాసనగర్ జంక్షన్ నుండి సంజీవనగర్ జంక్షన్ వరకు ర్యాలీ నిర్వహించి సోనియాగాంధీ దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. ఆత్మకూరు పట్టణంలోనూ జేఏసీ ఆధ్వర్యంలో వైఎస్‌ఆర్‌సీపీ పట్టణ కన్వీనర్ ఇస్కాల రమేష్ రిలే నిరాహారదీక్షలు ప్రారంభమయ్యాయి. కోడుమూరు నియోజకవర్గ పరిధిలో సి.బెళగల్, పోలకల్, కంబదహాల్, ముడుమాల గ్రామాల్లో ఉద్యోగులు, విద్యార్థులు, పట్టభద్రులు సోనియా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.
గూడూరు పట్టణంలో జేఏసీ నాయకులు మోటార్ సైకిల్ ర్యాలీ చేపట్టారు. కోడుమూరులో జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు మొదలయ్యాయి. కాంగ్రెస్ నాయకులు పట్టణ ంలో దుకాణాలు బంద్ చేయించి, మధ్యాహ్నం 2గంటల వరకు వాహనాల రాకపోకలను స్తంభింపజేశారు. అన్ని వర్గాల ప్రజలు కోట్ల సర్కిల్‌లో మానవహారంగా ఏర్పడ్డారు. హోలియ దాసరి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆ వర్గానికి చెందిన ప్రజలు కేసిఆర్ దిష్టిబొమ్మతో శవయాత్రను నిర్వహించారు. సమైక్యాంద్ర నినాదాలతో ఎమ్మిగనూరు పట్టణం అట్టుడికింది. పట్టణ వ్యాపార సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో పట్టణ బంద్ విజయవంతమైంది. కేసీఆర్‌కు చీరకట్టించిన ఫ్లెక్సీలతో వ్యాపారులు మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు.
పట్టణ ప్రైవేట్ స్కూల్స్ అసోషియేషన్ నాయకులు యు.యు.ఉరుకుందు, మహానందయ్యల ఆధ్వర్యంలో దాదాపు 10వేల మంది విద్యార్థులతో భారీ ర్యాలీ కొనసాగింది. పట్టణంలోని ఎద్దులమార్కెట్ వద్ద ఆందోళనకారులు మూడు ఆర్టీసీ బస్సుల అద్దాలు పగులగొట్టారు. 72గంటల సమ్మెలో భాగంగా మున్సిపల్ ఉద్యోగులు పెన్‌డౌన్ చేశారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ బి.వి.జయనాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఆదోనిలో సమక్య ఉద్యమం మరింత జోరందుకుంది. ఎమ్మెల్యే మీనాక్షినాయుడు, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు చంద్రకాంత్ రెడ్డి, ప్రసాద్‌రావు, వెంకటేశ్వర రెడ్డి, మునిస్వామి, కాంగ్రెస్ నాయకులు విట్టారమేష్, నీలకంటప్ప, జేఏసీ నాయకులు విరుపాక్షి, సునీల్ రాజ్‌కుమార్ తదితరులు పట్టణంలో భారీ ర్యాలీ చేపట్టారు. హిజ్రాలు సైతం ర్యాలీలో పాల్గొన్నారు.
కొలిమిగుండ్లలో వ్యాపార వర్గాలు రహదారిపై వంటావార్పు నిర్వహించారు. డోన్‌లో ఫొటోగ్రాఫర్ల సంఘం ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన జరిగింది. కోవెలకుంట్లలోని గ్రామ పంచాయతీ సర్కిల్‌లో ప్రధాన రోడ్డుపై వంటావార్పు చేపట్టి 5వేల మంది సహపంక్తి భోజనం చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా స్టీరింగ్ సభ్యులు ఎర్రబోతుల వెంకటరెడ్డి, మండల కన్వీనర్ గాండ్ల పుల్లయ్య తదితరులు సంఘీభావం ప్రకటిం చారు. ఇదిలాఉండగా సమైక్యాంధ్రకు మద్ద తుగా మంగళవారం జాతీయ రహదారులను దిగ్బంధించనున్నట్లు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త ఎస్వీ మోహన్‌రెడ్డి తెలిపారు. సమైక్యాంధ్ర జేఏసీ పిలుపులో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
Advertisement
Advertisement