సాక్షి, రాజమహేంద్రవరం: వరద సహాయక చర్యలపై గతంలో టీడీపీ ప్రభుత్వం స్పందించిన తీరు, తమ ప్రభుత్వం స్పందించిన తీరుకు చాలా వ్యత్యాసం కనిపిస్తోందని ఉప ముఖ్యమంత్రి, తూర్పుగోదావరి జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆళ్ల నాని అన్నారు. గోదావరి వరదలపై అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష ముగిసిన తర్వాత సహచర మంత్రులతో కలిసి ఆళ్ల నాని విలేకరులతో మాట్లాడారు. వరద సహయక చర్యలపై అధికారులను సీఎం జగన్ అభినందించారని తెలిపారు. ఢిల్లీలో ఉన్నప్పటికీ అక్కనుంచి ఎప్పటికప్పుడు నేరుగా వరద పరిస్ధితులను సీఎం సమీక్షించారని వెల్లడించారు. అదనంగా గోదావరి వరద సహాయక చర్యలు అందించాలని సీఎం సూచనలు చేశారని.. గత ప్రభుత్వంలో ఇటువంటి ఆలోచన చేయలేదన్నారు. ప్రతి కుటుంబానికి రూ.5 వేలు సహాయాన్ని అదనంగా అందించాలని ఆదేశించినట్టు చెప్పారు. వరదల వల్ల పంట మునిగిన రైతులకు ఉచితంగా విత్తనాలు పంపిణీ చేస్తామన్నారు.
పోలవరం కమీషన్ల కోసం చంద్రబాబు చేసిన పాపాల వల్ల ఇన్ని కష్టాలు వచ్చాయని, ఎటువంటి ప్రణాళికలు లేకుండా నిర్వాసితులను తరలించకుండా పోలవరం హెడ్ వర్క్ పనులను చేపట్టారని విమర్శించారు. చంద్రబాబు చేసిన పాపాలను ప్రజలు అనుభవించాల్సి వస్తోందని ఆళ్ల నాని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం వద్ద 27.7 మీటర్ల వరద నీటి మట్టం ఉందని, నిరంతరం సహాయక చర్యలు కొనసాగుతాయన్నారు. నిత్యావసర సరుకులు వరద బాధితులకు ఎప్పటికప్పుడు అందజేస్తున్నామని, వండిన ఆహార పదార్థాలు కూడా అందించామని తెలిపారు. ప్రాథమిక అంచనా ప్రకారం తూర్పు గోదావరి జిల్లాలో 4824 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని తెలిపారు. (చదవండి: పోలవరం ముంపు ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే)
Comments
Please login to add a commentAdd a comment