సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇప్పటివరకూ 35 కోవిడ్–19 (కరోనా వైరస్) అనుమానిత కేసులు నమోదు కాగా.. బాధితుల నుంచి రక్త, కళ్లె నమూనాలు సేకరించి పరీక్ష కేంద్రాలకు పంపించారు. వాటిలో 33 కేసులు నెగెటివ్ వచ్చాయి. మరో రెండు నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది. ఈ నెల 8వ తేదీ నాటికి 34 అనుమానిత కేసులు నమోదు కాగా, సోమవారం ఒక కేసు వచ్చింది. దీంతో ఆ సంఖ్య 35కు చేరింది. ఇప్పటివరకు కరోనా ప్రభావిత దేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన 465 మంది ప్రయాణికులు వైద్యుల పరిశీలనలో ఉన్నారని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని సోమవారం చెప్పారు. మరో 232 మంది వారి ఇంట్లోనే వైద్యుల పర్యవేక్షణలో, మరో ఏడుగురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. రాష్ట్రంలో కరోనా వైరస్ నిరోధానికి అన్ని చర్యలూ తీసుకున్నామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య, ఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి చెప్పారు.
ముమ్మరంగా తనిఖీలు
- కరోనా వైరస్ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలను మరింత ముమ్మరం చేసింది.
- ఇప్పటికే ఎయిర్ పోర్టులు, ఓడరేవుల్లో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
- విదేశాల నుంచి వచ్చిన వారి కోసం తాజాగా అన్ని గ్రామాల్లో వైద్య సిబ్బంది జల్లెడ పడుతున్నారు.
పకడ్బందీ వ్యూహంతో వెళ్లండి
- కరోనా వైరస్ నియంత్రణకు పకడ్బందీ వ్యూహంతో ముందుకెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం ఆదేశించింది.
- కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబ అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో సోమవారం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు.
- ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని రాష్ట్రంలో చేపట్టిన చర్యలను, భవిష్యత్ కార్యాచరణను వివరించారు.
- వీడియో కాన్ఫరెన్స్‌కు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి, వైద్య, ఆరోగ్య శాఖ ఇన్‌చార్జి కమిషనర్ వి.విజయరామరాజు, ఆరోగ్యశ్రీ సీఈవో మల్లికార్జున్, డీఎంఈ డాక్టర్ వెంకటేశ్ హాజరయ్యారు.
200 మంది వైద్యులకు ప్రత్యేక శిక్షణ
- రాష్ట్రంలోని బోధనాస్పత్రులు, జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆస్పత్రుల్లో పనిచేసే వైద్యులకు వైరస్ నియంత్రణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.
- సోమవారం 100 మంది వైద్యులకు శిక్షణ ఇవ్వగా.. మంగళవారం మురో 100 మందికి శిక్షణ ఇస్తున్నారు.
- వీరంతా జిల్లాలకు వెళ్లి మిగతా వైద్యులకు శిక్షణ ఇస్తారు. ఈనెల 11వ తేదీకి శిక్షణ పూర్తవుతుంది.
- 12వ తేదీ నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం స్థాయిలో ప్రత్యేక ఎమర్జెన్సీ బృందాలు ఏర్పాటు చేస్తారు.
- ప్రతి శాఖలో ఒక్కొక్క నోడల్ అధికారిని నియమించారు. వీరందరికీ సోమవారం విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో సమావేశం నిర్వహించారు.
కాలర్ ట్యూన్‌గా.. కరోనా జాగ్రత్తలు
సెల్‌ఫోన్ కాలర్ ట్యూన్ కాస్తా.. కరోనా ట్యూన్‌గా మారింది. ఎవరు.. ఎవరికి ఫోన్ చేసినా ముందుగా దగ్గు, ఆ తర్వాత జాగ్రత్తలు పాటించండనే సందేశాన్ని వినిపిస్తోంది. ఏ మొబైల్ వినియోగదారుడైనా ఈ సందేశం వినకుండా తప్పించుకునే వీలు లేకుండా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అన్ని మొబైల్ సర్వీస్ ప్రొవైడర్లకు ఆదేశాలిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment