నాడు అర లక్ష..నేడు పది లక్షలు | Alluri Jayanthi Celebrated As a State Festival In Visakhapatnam | Sakshi
Sakshi News home page

నాడు అర లక్ష..నేడు పది లక్షలు

Published Wed, Jul 3 2019 8:35 AM | Last Updated on Mon, Jul 15 2019 1:09 PM

Alluri Jayanthi Celebrated As a State Festival In Visakhapatnam - Sakshi

కృష్ణదేవిపేటలోని అల్లూరి పార్కు ముఖద్వారం 

సాక్షి, విశాఖపట్నం : రవి అస్తమించని బ్రిటీష్‌ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు పుట్టిన ఊరు.. నడయాడిన ప్రాంతాలు.. మన్యం పితూరీ నిర్వహించిన గిరిసీమలు.. చివరికి దేశం కోసం ప్రాణాలర్పించిన పుణ్యభూమి..  అన్నీ మన విశాఖ జిల్లాలోనే ఉన్నాయి. పద్మనాభం మండలం పాండ్రంకిలో జన్మించిన అల్లూరి తెల్లదొరల పాలనకు సమాంతరంగా అఖండ భారతంలోనే తొలిసారి 1920లో పంచాయతీ పాలనను గొలుగొండ మండలం పాతూరు(కృష్ణదేవిపేట– కేడీపేట) నుంచే  ప్రారంభించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన ఆయన పార్థివ దేహానికి ఏఎల్‌పురంలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అక్కడే ఆయన సమాధితో పాటు అనుచరుల సమాధులూ ఉన్నాయి.

దేశ స్వాతంత్య్రం కోసం, గిరిజనుల విముక్తి కోసం బ్రిటీష్‌ ప్రభుత్వాన్ని గడగడలాడించిన అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలను ఈనెల 4న నిర్వహించేందుకు రూ.10లక్షలు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన అనుమతులిచ్చింది. దీన్ని రాష్ట్ర వేడుకగా అల్లూరి జన్మస్థలమైన భీమిలి నియోజకవర్గం పద్మనాభం మండలం పాండ్రంకిలో,  పంచాయతీ పాలనకు శ్రీకారం చుట్టిన నర్సీపట్నం నియోజకవర్గం గొలుగొండ మండలం కృష్ణదేవిపేటల్లో  నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇంతటి చారిత్రక నేపథ్యం ఉన్న ప్రాంతాల అభివృద్ధి మాటేమిటి..?
గత టీడీపీ ప్రభుత్వం తన ఐదేళ్ల పాలనలో అల్లూరి నడయాడిన ప్రాంతాల అభివృద్ధికి లెక్కలేనన్ని హామీలిచ్చి.. అన్నింటినీ విస్మరించింది. కానీ అల్లూరి నడయాడిన సీమలోనే తొలి అడుగు వేయడం ద్వారా జిల్లాలో చారిత్రక ప్రజాసంకల్పయాత్రకు శ్రీకారం చుట్టిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. నేడు ప్రభుత్వాధినేతగా ఆ మహనీయుడి జయంతిని రాష్ట్ర వేడుకగా నిర్వహించాలని నిర్ణయించారు. పాలనాపరమైన అనుమతులిచ్చారు.ఇక్కడ ప్రస్తావించాల్సిన విశేషం ఏమిటంటే.. గత ఏడాది టీడీపీ ప్రభుత్వం ఇదే అల్లూరి జయంతికి విడుదల చేసిన సొమ్ము ఎంతో తెలుసా?.. కేవలం రూ.50 వేలు!.. ఇప్పటి ప్రభుత్వం విడుదల చేసిన మొత్తం ఏకంగా రూ. 10 లక్షలు..

నాడు నివాళులే.. నిధుల్లేవు
అల్లూరి సీతారామరాజు జయంతి, వర్ధంతుల సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ఫొటోల కోసం,  ప్రచారం కోసం ‘ఘనమైన’ నివాళులర్పించడం.. ఆ తర్వాత పట్టించుకోకపోవడం గత ఐదేళ్ల తెలుగుదేశం పాలనలో తంతుగా నడిచింది. యాధృచ్ఛికమే కావొచ్చు గానీ.. చారిత్రక స్థలాలైన అల్లూరి పుట్టిన ఊరు, సమాధి ఉన్న ప్రాంతాలు గత టీడీపీ ప్రభుత్వంలో మంత్రులుగా చెలామణీ అయిన గంటా శ్రీనివాసరావు, అయ్యన్నపాత్రుడు ప్రాతినిధ్యం వహించిన నియోజకకవర్గాల్లోనే ఉన్నాయి.  అల్లూరి జన్మస్థలమైన పాండ్రంకి మంత్రిగా గంటా ప్రాతినిధ్యం వహించిన భీమిలిలో ఉంటే.. అల్లూరి నడయాడిన ప్రాంతాలు, పంచాయతీ పాలనకు శ్రీకారం చుట్టిన పాతూరు(కేడీపేట), ప్రాణాలొదిలిన ప్రాంతం, సమాధులు.. అన్నీ నర్సీపట్నం నియోజకవర్గం గొలుగొండలో ఉన్నాయి. వీటన్నింటినీ అభివృద్ధి చేస్తామని ఐదేళ్ల క్రితం అప్పటి టీడీపీ సర్కారు ఎన్నో హామీలిచ్చింది. 

కృష్ణదేవిపేట (పాతూరు) మొదలు కొంకసింగి, నాగాపురం, ఏఎల్‌పురం  గ్రామాల రూపురేఖలు మార్చేస్తామని 2014లో ఆరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన చింతకాయల అయ్యన్నపాత్రుడు హామీ ఇచ్చారు. అరకు, చింతపల్లి, లంబసింగితో పాటు టూరిజం ప్యాకేజీలో కేడీ పేటలోని అల్లూరి పార్కును చేర్చి అభివృద్ధి చేస్తామన్నారు. పార్కులో 24 గంటలూ విద్యుత్‌ సౌకర్యం, సోలార్‌ వెలుగులు ఏర్పాటు చేస్తామని, మ్యూజియం, గ్రంధాలయం, అల్లూరి 12 అడుగుల కాంస్య విగ్రహం, సమావేశ మందిరం, రూ.5 లక్షలతో సభా వేదిక  ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేశారు.

ఇక మంత్రి హోదాలో దత్తత తీసుకున్న ఏఎల్‌పురం(అల్లూరి సమాధులున్న గ్రామం) పరిస్థితీ అంతే. ఇక్కడ అండర్‌ డ్రైనేజీ, ఎల్‌ఈడీ బల్బులు, ప్రతి ఇంటికి తాగునీరు, మరుగుదొడ్లు, సీసీ రోడ్లు, విద్య, వైద్యం, పశువైద్య  కేంద్రం, ఆయుర్వేద ఆస్పత్రికి కొత్తభవనం ఏర్పాటు చేస్తామని వాగ్దానం చేశారు. కానీ ఏ ఒక్క హామీ నెరవేరలేదు. అంతెందుకు.. కనీసం అల్లూరి జయంతి కార్యక్రమానికి కూడా సరిగ్గా నిధులు విడుదల చేయని గత ప్రభుత్వ నిర్వాకంతో అధికారులు అల్లాడిపోయేవారు. గత ఏడాది కేవలం రూ.50వేలు విడుదల చేసి ఆర్భాటాలో హడావుడి చేయాలని అప్పటి పాలకులు ఆదేశించడంతో.. నానా పాట్లు పడి రెండులక్షలు ఖర్చు చేశామని ఓ అధికారి చెప్పుకొచ్చారు.

రాష్ట్ర వేడుకగా అల్లూరి జయంతి :మంత్రి అవంతి
తెలుగువాడి పౌరుషానికి ప్రతీక అయిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతిని రాష్ట్ర వేడుకగా నిర్వహిస్తాం. మహనీయుడి పోరాట స్ఫూర్తిని నలుదిశలా చాటేలా ఘనంగా నిర్వహిస్తాం. అల్లూరి నడయాడిన చారిత్రక ప్రాంతాలను పర్యాటక స్థలాలుగా తీర్చిదిద్దుతాం. ఇందుకోసం ఎంతైనా ఖర్చుకైనా వెనుకాడం. ఇందుకోసం పర్యాటక శాఖామంత్రిగా మరింత చొరవ తీసుకుంటాను. ఇక అల్లూరి జయంతి రోజైన ఈనెల 4వ తేదీ గురువారం పాండ్రంకిలో అల్లూరి ఉత్సవ ర్యాలీలు, గిరిజన సంస్కృతి ప్రతిబింబించేలా సాంస్కృతిక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశాలిచ్చాం.

ఆ ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నా: ఎమ్మెల్యే గణేష్‌
నర్సీపట్నం: జిల్లాలో అల్లూరి సీతారామరాజు నడయాడిన ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను. టీడీపీ పాలకుల మాదిరిగా మాటలతో సరిపెట్టను. అల్లూరి జయంతిని ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించేందుకు పది లక్షలు విడుదల చేయడంతోనే ఆ మహనీయుడికి తమ ప్రభుత్వం ఎంత గౌరవం ఇస్తుందో అర్ధం చేసుకోవచ్చు. కృష్ణదేవిపేటలో అల్లూరి స్మారక మందిరాన్ని మరింత అభివృద్ధి చేస్తా. దాంతో పాటు పార్కును అభివృద్ధి చేసేందుకు  కృషి చేస్తా.  పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సహకారంతో ఈ ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతా. ఈ నెల 4న అల్లూరి జయంతిని ఘనంగా నిర్వహించాలని ఆర్డీవో  ఆర్‌.గోవిందరావుకు సూచిం చాం. అల్లూరి అనుచరుడు గంటందొర కుటుంబ సభ్యులను సత్కరించాలని, జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు  తగిన 
ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించాం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement