సాక్షి, రొంపిచర్ల(గుంటూరు) : రాజధాని అంశంపై టీడీపీ నాయకులు చేస్తున్న వదంతులు నమ్మవద్దని ఎమ్మెల్యేలు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, బొల్లా బ్రహ్మనాయుడు స్పష్టం చేశారు. రొంపిచర్లలో గురువారం విలేకర్లతో మాట్లాడారు. రాజధాని నిర్మాణానికి ఈ ప్రాంతం అనువుగా ఉండదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారే గానీ రాజధానిని మారుస్తామని చెప్పలేదన్నారు. రాజధానిని నిర్మించాలంటే రూ.50 వేల కోట్లు వ్యయం అవుతుందన్నారు. రాజధాని నిర్మాణం పేరుతో టీడీపీ ప్రభుత్వం 34 వేలు ఎకరాలు తీసుకుందని, కానీ కేవలం రెండు వేల ఎకరాల్లో మాత్రమే నిర్మాణాలు ప్రారంభించారని తెలిపారు. శివరామకృష్ణన్ కమిటీ రాజధాని ప్రాంతం భూకంపాలు, వరదలకు నిలయంగా ఉంటుందని చెప్పిందని గుర్తు చేశారు.
అక్కడ రాజధాని వద్దని చెప్పినా టీడీపీ నాయకులు ఇన్‌సైడర్ ట్రేడింగ్ ద్వారా ముందుగానే 2 వేల ఎకరాల భూములు కొనుగోలు చేసి అమరావతిని రాజధానిగా ప్రకటించారన్నారు. ఇప్పటికే విజిలెన్స్ తనిఖీలు జరుగుతున్నాయన్నారు. టీడీపీ నాయకుల కోసమే రాజధాని అమరావతిలో ఏర్పాటుచేశారని పేర్కొన్నారు. ఈ భూముల్లో పునాదులు 30 మీటర్ల లోతు నుంచి వేయాల్సి వస్తుందన్నారు. అసెంబ్లీకి కూడా 100 అడుగుల లోతు నుంచి పునాదులు వేయాల్సి వచ్చిందన్నారు. నాగార్జునసాగర్ కుడికాలువ పరిధిలోని జిల్లాలో గల జోన్–1, 2 పరిధిలో వరి పండించుకునేందుకు సాగునీరు అందుతుందన్నారు. వరి పంట సాగు చేసేందుకు విత్తనాలు కూడా పంపిణీ చేస్తున్నామని వివరించారు. ఇప్పటికే రొంపిచర్ల మార్కెట్‌యార్డులో 1000 క్వింటాళ్ల వరి విత్తనాలను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. 56 వేల టన్నుల యూరియా, 28 వేల టన్నుల ఎరువులు సిద్ధం చేశామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment