
ఒక్క టీవీకి రూ. 4 లక్షలా?
హైదరాబాద్: ప్రజా ధనాన్ని దుబారా చేయడంలో చంద్రబాబు సర్కారు ఒక్క నిమిషం కూడా ఆలోచించడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అంబటి రాంబాబు ఆక్షేపించారు. ప్రభుత్వం చెప్పేవి శ్రీరంగ నీతులు... చేసేవి చెడ్డ పనులని విమర్శించారు. ప్రభుత్వ ఖజానాకు చిల్లు పెట్టే కార్యక్రమం సీఎం ఆధ్వర్యంలోనే జరుగుతోందని ఆరోపించారు. మంత్రి యనమల తన చాంబర్ కసం రూ.80 లక్షలు ఖర్చు చేశారని, ఒక్క టీవీ కోసమే రూ. 4లక్షలు వెచ్చించారని తెలిపారు.
స్పీకర్ కోడెల స్టడీటూర్ల పేరిట జోహెన్నెస్ బర్గ్, కేప్ టౌన్, కెన్యా, మారిషస్ వెళ్తున్నారని చెప్పారు. ఆ దేశాల్లో చట్టసభల తీరు గురించి మనం తెల్సుకోవాల్సింది ఏముందని ప్రశ్నించారు. రాజధాని కోసం చందాలు వసూలు చేస్తున్న దశలో ఇంత ఖర్చు దేనికి అని నిలదీశారు. దుబారా ఖర్చులు చేయకుండా పునరాలోచన చేయాలని అంబటి సూచించారు.