జేసీని రక్షించేందుకే బాబు పాట్లు
♦ వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు
♦ విపక్ష నేత జగన్‌పై కేసు పెట్టి అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటనలో దివాకర్ ట్రావెల్స్ యాజమాన్యాన్ని రక్షించేందుకే చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు చెప్పారు. ఇంత భారీ ప్రమాదాన్ని, ప్రాణ నష్టాన్ని కప్పిపెట్టే కుట్ర జరిగిందని ఆరోపించారు. బాధితుల్ని పరామర్శించడానికి వెళ్లిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై కేసు పెట్టి అసలు విషయాన్ని ప్రభుత్వం, ప్రభుత్వానికి సంబంధించిన తాబేదార్లు పక్కదారి పట్టించేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు.
గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరులతో అంబటి మాట్లాడారు. ఇలాంటి సంఘటనలు అనేకం జరిగినప్పుడు జగన్ వెళ్లి బాధితులకు మనోధైర్యం కలిగించారని, అప్పుడు అధికారులు ఎవ్వరూ వివాదం చేయడానికి ప్రయత్నించలేదని చెప్పారు. ప్రస్తుత ఘటనలో టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డికి చెందిన దివాకర్ ట్రావెల్స్ తప్పులేదని చూపించటానికి చంద్రబాబు పడరాని పాట్లు పడుతున్నారని అన్నారు. ప్రమాదంలో మరణించిన డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం చేయకుండా తరలించేందుకు ప్రయత్నించడంపై డాక్టర్, కలెక్టర్‌ను జగన్ ప్రశ్నించారని చెప్పారు.
అధికారులంటే గౌరవం ఉంది
జగన్ మాటలను సరిగా అర్ధం చేసుకోకుండా ఐఏఎస్‌ల సంఘం మాట్లాడటం సరికాదని అంబటి అన్నారు. జగన్ హెచ్చరించి, డ్రైవర్ మృతదేహానికి పోస్టుమార్టం చేయించకుండా ఉండుంటే కలెక్టర్ జైలుకు వెళ్లి ఉండేవారని చెప్పారు. ఈ సంగతి కలెక్టర్, ఐఏఎస్‌లకు తెలియకపోవడం బాధాకరమన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులంటే తమకు గౌరవం ఉందని చెప్పారు. వారిలో నీతినిజాయితీ గలవారు ఉన్నారని, పోస్టుల కోసం కక్కుర్తిపడే వాళ్లు కూడా ఉన్నారని అన్నారు.గతంలో చంద్రబాబు వాడిన భాష బాగుందా అని ప్రశ్నించారు.