ముంచెత్తిన అభిమానం
ఆశయానికి తూట్లు.. ఆర్భాటపు పాట్లు
Published Sat, Apr 15 2017 6:52 AM | Last Updated on Fri, Aug 10 2018 8:23 PM
► అంబేడ్కర్ జయంతి సభకు దళితులను దూరం పెట్టిన ప్రభుత్వం
► గొప్పలు చెప్పుకునేందుకు ఒక్క రోజే రూ.7 కోట్ల ఖర్చు
► ఇతర జిల్లాల నుంచి వచ్చిన ప్రజలకు తప్పని తిప్పలు
ఒక వైపు..డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆశయ సాధనకు కృషి చేద్దాం..రాజ్యాంగ నిర్మాత చూపిన మార్గంలో పయనిద్దాం..అంబేడ్కర్ చెప్పినట్లు దళితుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం..ఇదీ శుక్రవారం అంబేడ్కర్ జయంతి సందర్భంగా రాజధాని ప్రాంతంలో సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో మార్మోగిన నినాదాలు..మరో వైపు లంక అసైన్డ్ భూములకు సమాన ప్యాకేజీ ఇవ్వాలంటూ రెండేళ్లుగా పోరాడుతున్న దళితుల ఆవేదనలు అక్కడ మైకుల శబ్దాల్లో, పాలకుల నిర్లక్ష్యంలో కలిసిపోయాయి.
సాక్షి, అమరావతి బ్యూరో: రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ పేరు చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ప్రచార అర్భాటం కోసం కోట్ల రూపాయలను మంచి నీళ్లలా ఖర్చు చేసింది. డాక్టర్ అంబేడ్కర్ ఎవరి అభివృద్ధి కోసమైతే నిత్యం తపనపడ్డారో. వారిని టీడీపీ ప్రభుత్వం విస్మరించింది. దళితుల పండుగకు వారిని దూరంగా పెట్టింది. లంక అసైన్డ్ రైతుల రెండేళ్లుగా ఎదుర్కొంటున్న సమాన ప్యాకేజీనే ఇందుకు నిదర్శనం.
అదే విధంగా రాజధాని నిర్మాణం కోసం భూములు వదులకున్న రైతులకు డాక్టర్ అంబేడ్కర్ జయంతిలో సముచిత స్థానం దక్కకపోవటం గమనార్హం. అమరావతిలో శుక్రవారం డాక్టర్ అంబేద్కర్ 126 జయంతి వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. శాఖమూరు పరిధిలో 20 ఎకరాల విస్తీర్ణంలో 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటుకు సీఎం చంద్రబాబు భూమి పూజ చేశారు. భారీ ఎత్తున చేపట్టిన ఈ కార్యక్రమంలో రాజధాని ప్రాంతంలోని సామాన్య దళితులకు ఆహ్వానం లేదు. అధికార పార్టీకి చెందిన కొందరు దళిత నాయకులను మాత్రం పిలిచి..మిగిలిన వారిని బహిరంగ సభకు రానివ్వకుండా అడ్డుకున్నారనే ప్రచారం ఉంది. లంక అసైన్డ్ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు సమాన ప్యాకేజీ ఇవ్వటానికి ప్రభుత్వం నిరాకరించిన విషయం తెలిసిందే.
సభకు దళిత రైతులు హాజరైతే ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో వారిని కార్యక్రమానికి రానివ్వకుండా కట్టుదిట్టం చేశారని ప్రజా సంఘాల నేతల ఆరోపిస్తున్నారు. అందులో భాగంగానే ఇద్దరు నాయకులను అరెస్టు చేశారు. శాఖమూరులో దళితులకు కేటాయించిన నివాస స్థలాలను టీడీపీ నాయకుడు ఒకరు అక్రమించుకుని పూలింగ్‌కు ఇచ్చారు. నివాస స్థలాలకు చెందిన బాధితులను కూడా కార్యక్రమానికి రాకుండా అడ్డుకున్నట్లు తెలిసింది. రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులు కొందరిని కార్యక్రమానికి హాజరవ్వొద్దని ఫోన్లలో హెచ్చరించినట్లు ప్రచారం జరుగుతోంది. వారొస్తే నిలదీస్తారనే అనుమానంతో కట్టడి చేసినట్లు అనంతవరం, రాయపూడికి చెందిన ఇద్దరు రైతులు చెప్పారు.
అందరికీ తిప్పలే..
కార్యక్రమానికి రాష్ట్ర నలుమూలల నుంచి జనాన్ని బస్సుల్లో తరలించారు. అయితే అక్కడ లోపలికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. దీంతో జనం ఎర్రని ఎండలోనే అల్లాడిపోయారు. మంచి నీరు, మజ్జిగ, భోజనం ఏర్పాటు చేసినా అందరికీ అందలేదు. దీంతో పస్తులతో వెనుదిరిగారు.
మంచినీళ్లలా ప్రజాధనం
సీఎం చంద్రబాబు ఆర్భాటం కోసం అంబేడ్కర్ జయంతి వేడుకను ఆసరాగా చేసుకుని రూ.7 కోట్లపైనే ఖర్చు చేసినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు వెయ్యి వాహనాల ద్వారా జనాన్ని తీసుకొచ్చారు. ఒక్కో ఆర్టీసీ బస్సుకు రూ.15 వేలు చెల్లిస్తామని ప్రభుత్వ పెద్దలు హామీ ఇచ్చినట్లు డ్రైవర్ ఒకరు స్పష్టం చేశారు. డ్వాక్రా సంఘాల వారికి రుణాల పేరు చెప్పి తీసుకొచ్చినట్లు మహిళలు తెలిపారు. ఇలా రకరకాల హామీల పేరుతో జనాన్ని బహిరంగ సభకు తరలించినట్లు తెలుస్తోంది. ఆర్భాటం కోసం వెచ్చించిన రూ.7 కోట్లను రాజధానిలో దళిత కుటుంబాల వారికి వెచ్చించి ఉంటే... డాక్టర్ అంబేడ్కర్ ఆశయంలో ప్రభుత్వం పాలుపంచుకునే అవకాశం ఉండేదని ప్రజా సంఘాల వారు అభిప్రాయ పడుతున్నారు. ఓ వైపు దళితులను అణచివేస్తూ మరో వైపు అంబేడ్కర్ స్మృతివనం ఏర్పాటు రాజకీయ లబ్ధి కోసమేనని విమర్శిస్తున్నారు.
Advertisement